Bill Clinton Health: ఆందోళనకరంగా బిల్ క్లింటన్ ఆరోగ్యం!
ABN , Publish Date - Aug 31 , 2025 | 05:26 AM
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇప్పటికే గుండె సంబంధిత వ్యాధులతో ఆయన బాధపడుతున్నారు.
గుండె వ్యాధులతో తీవ్ర ఇబ్బంది
లయ సరిచేసేలా గుండెకు డీఫిబ్రిలేటర్
న్యూయార్క్, ఆగస్టు 30: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇప్పటికే గుండె సంబంధిత వ్యాధులతో ఆయన బాధపడుతున్నారు. దీనికి సంబంధించి పలుమార్లు సర్జరీలు కూడా అయ్యాయి. ఇటీవల ఆయన అమెరికాలోని హ్యాంప్‌టన్స్ ఎయిర్‌పోర్టులో డీఫిబ్రిలేటర్ అనే వైద్య పరికరంతో కనిపించారు. ఆయనతో పాటు భార్య హిల్లరీ క్లింటన్ కూడా ఉన్నారు. పోర్టబుల్ డీఫిబ్రిలేటర్ ఉన్న బ్యాగును ఆమె తీసుకుని వెళుతున్నారని డెయిలీ మెయిల్ వార్తా సంస్థ పేర్కొంది. 79 ఏళ్ల క్లింటన్‌కు 2004లోనే హర్ట్‌ఎటాక్ వచ్చింది.
నాలుగుసార్లు బైపాస్ సర్జరీ కూడా జరిగింది. కాగా, డీఫిబ్రిలేటర్ ఓ వైద్య పరికరం. గుండెలో అసాధారణ స్పందనలను సరిచేయడానికి ఉపయోగిస్తారు. ఇది గుండెకు ఓ నియంత్రిత స్థాయిలో విద్యుత్ షాక్‌ను ఇస్తుంది. దీంతో లయ తప్పిన గుండెను సాధారణ పరిస్థితిలోకి తీసుకువచ్చే వీలవుతుంది. ప్రాణాంతక గుండె లయ, అరిథ్మియా పరిస్థితుల నుంచి రోగిని కాపాడే అవకాశం కలుగుతుంది.