Bihar Assembly Elections: బిహార్ ఎన్నికలునవంబరు 22లోపే
ABN , Publish Date - Oct 06 , 2025 | 02:47 AM
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు.. శాసనసభ పదవీకాలం ముగిసే నవంబరు 22వ తేదీలోపే జరుగుతాయని ఎన్నికల ప్రధాన కమిషనర్...
ఛఠ్ పూజలాగే ఉత్సాహంగా పాల్గొనాలి
ఓటర్లకు సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ పిలుపు
ఎన్నికల సన్నద్ధతపై పట్నాలో సమీక్ష
న్యూఢిల్లీ, అక్టోబరు 5: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు.. శాసనసభ పదవీకాలం ముగిసే నవంబరు 22వ తేదీలోపే జరుగుతాయని ఎన్నికల ప్రధాన కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్ స్పష్టంచేశారు. ఛఠ్ పూజ(ఈ నెల 25 నుంచి 28 వరకు) మాదిరిగానే ఓటింగ్‌లోనూ ఆనందోత్సాహాలతో పాల్గొనాలని రాష్ట్ర ఓటర్లకు పిలుపిచ్చారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేశామన్నారు. ప్రత్యేక విస్తృత సవరణ (ఎస్‌ఐఆర్)ను చట్టబద్ధంగానే చేపట్టామని చెప్పారు. త్వరలోనే దీనిని దేశవ్యాప్తంగా నిర్వహిస్తామన్నారు. రెండ్రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆదివారం రెండో రోజు ఆదివారం ఆయన పట్నాలో సహచర ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషీలతో కలిసి అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్ర ఎన్నికల అధికారులతో సమీక్ష జరిపారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బూత్ స్థాయి అధికారు(బీఎల్‌వో)లు కూడా దీనికి హాజరయ్యారు. బిహార్ ఎన్నికలతో మొదలలయ్యే పలు సంస్కరణలను సీఈసీ విశదీకరించారు. ఇక నుంచి ఈ రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా పోలింగ్ కేంద్రానికి 1,200 మంది మాత్రమే ఓటర్లు ఉంటారని చెప్పారు. ‘బిహార్లోని వైశాలి ప్రపంచానికే ప్రజాస్వామ్య మార్గాన్ని ఎలా చూపిందో.. అదే విధంగా ఓటర్ల జాబితాల ప్రక్షాళనలో వీరు దేశానికే స్ఫూర్తిగా నిలిచారు’ అని కొనియాడారు. ప్రతి ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితాల సవరణ ప్రజాప్రాతినిధ్య చట్టప్రకారం చట్టబద్ధమేనని.. ఎన్నికలు ముగిశాక సవరించడం కుదరదని గుర్తుచేశారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. సెప్టెంబరు 30న ఓటర్ల జాబితాను ప్రచురించామని.. చేర్పులు, తొలగింపులపై అభ్యంతరాలున్నా.. అర్హులైనవారిని చేర్చకపోయినా.. అభ్యంతరాలు తెలియజేసేందుకు ఇప్పటికీ పది రోజుల వ్యవధి ఉందని చెప్పారు. అన్ని అభ్యంతరాలను ఓటర్ నమోదు అధికారు(ఈఆర్‌వో)ల స్థాయిలో పరిష్కరిస్తామన్నారు. నామినేషన్లు మొదలు కాగానే ఓటర్ల జాబితా నిశ్చిలంగా ఉంటుందని.. ఎన్నికల ప్రక్రియ ముగిసేదాకా అందులో మార్పులకు ఆస్కారం ఉండదన్నారు.
పారదర్శకత కోసం 17 సంస్కరణలు..
ఎన్నికల ప్రక్రియలో నిష్పాక్షికత, పారదర్శకత కోసం 17 సంస్కరణలను బిహార్ ఎన్నికల నుంచే ఎన్నికల కమిషన్ శ్రీకారం చుడుతోందని జ్ఞానేశ్‌కుమార్ తెలిపారు. వీటిలో పోలింగ్ సందర్భంగా కొన్ని, ఓట్ల లెక్కింపు సమయంలో కొన్ని అమలవుతాయన్నారు. ఇకపై ఏ పోలింగ్ కేంద్రంలోనూ 1,200 మందికి మించి ఓటర్లు ఉండరని స్పష్టంచేశారు. ప్రస్తుతం 1,500 మంది ఓటర్లు ఉంటున్నారు. తాజా సవరణతో బిహార్లో ఇప్పుడున్న 77,895 పోలింగ్ కేంద్రాలు 90,712కి పెరుగుతాయి.
బీఎల్‌వోలు గుర్తింపు కార్డులు ధరించడం తప్పనిసరి. ప్రతి పోలింగ్ కేంద్రంలో పూర్తిస్థాయిలో వెబ్‌కాస్టింగ్ నిర్వహిస్తారు. పోలింగ్ కేంద్రాల వెలుపల ఓటర్లు తమ మొబైల్ ఫోన్లను డిపాజిట్ చేసేందుకు ఒక కేంద్రం ఏర్పాటుచేస్తారు.
ఎన్నికల గుర్తు ఉన్నప్పటికీ.. ప్రస్తుతం ఈవీఎంలోని బ్యాలెట్ పేపర్‌పై అభ్యర్థి ఫొటో బ్లాక్ అండ్ వైట్‌లో ఉంటోంది. వారిని గుర్తించడం కష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఫొటోలు ఇక కలర్‌లో ఉంటాయి. బిహార్‌తో మొదలుపెట్టి ఇక దేశవ్యాప్తంగా ఇదే అమలవుతుంది. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఎంత మంది ఉంటారో ప్రిసైడింగ్ అధికారి ఇచ్చే ఫాం-17సీకి, ఈవీఎం కౌంటింగ్ యూనిట్‌లో పోలైన ఓట్లల సరిపోలనప్పుడు వీవీప్యాట్లన్నిటినీ పూర్తిగా లెక్కిస్తారు.
ఇక మీదట ఓట్ల లెక్కింపులో తుది రెండు రౌండ్ల ముందు మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ఓట్లను రీకౌంట్ చేస్తారు.
ఆధార్ గుర్తింపు కార్డు మాత్రమే..
గుర్తింపు ధ్రువపత్రాల్లో ఆధార్‌ను చేర్చడంపై జ్ఞానేశ్‌కుమార్ స్పష్టత ఇచ్చారు. అది గుర్తింపు కార్డు మాత్రమేనన్నారు. అదీగాక ఆధార్ నంబర్ ఇవ్వాలని ఎన్యుమరేషన్ ఫాంలో ఎన్నికల కమిషనే కోరిందని గుర్తుచేశారు. ‘సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. ఆధార్ చట్టం కింద కూడా ఆధార్ కార్డును పుట్టినరోజు, చిరునామా, పౌరసత్వాలకు ధ్రువీకరణగా పరిగణించడానికి వీల్లేదు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 26వ సెక్షన్ ప్రకారం అది ఐచ్ఛికం మాత్రమే’ అని ఆయన వివరించారు.