Elderly Man Served Burnt Roti: మాడిపోయిన చపాతీలు పెట్టిన కోడలు.. మామ ఏం చేశాడంటే..
ABN , Publish Date - Oct 30 , 2025 | 08:55 PM
మాడిపోయిన చపాతీలు ఓ కుటుంబంలో చిచ్చుపెట్టాయి. కోడలు ప్రతీ రోజూ మాడిపోయిన చపాతీలు పెడుతోందని ఓ మామ ఆత్మహత్య చేసుకున్నాడు.
పుట్టింటి వాళ్లను ఒకలా.. అత్తింటి వారిని మరోలా చూసే మహిళలు ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు. కొంతమంది మహిళలు అత్తామామల్ని గౌరవించకపోగా హింసలకు గురి చేస్తున్నారు. వేరు కాపురం పెట్టడమో లేక అత్తామామల్ని ఇంట్లోనుంచి వెళ్లగొట్టడమో చేస్తున్నారు. కోడలి వేధింపులు భరించలేక ప్రాణాలు తీసుకున్న అత్తామామలు కూడా లేకపోలేదు. తాజాగా, ఓ వృద్ధుడు కోడలి వేధింపులు భరించలేక ప్రాణాలు తీసుకున్నాడు. ప్రతీ రోజూ మాడిపోయిన చపాతీలు పెడుతోందని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ సంఘటన మధ్య ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. భోపాల్‌కు చెందిన పుష్పేంద్రకు కొన్నేళ్ల క్రితం అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో పెళ్లయింది. పెళ్లయిన కొంతకాలం వీరి కాపురం సజావుగానే సాగింది. తర్వాతినుంచి గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే పుష్పేంద్ర విడాకులకు అప్లై చేశాడు. భార్య మాత్రం అతడిపై గృహ హింస కేసు పెట్టింది. ఇద్దరి మధ్యా గొడవలతో కుటుంబం పరిస్థితి నరకంలా మారింది. పుష్పేంద్ర తండ్రి రమేశ్ చంద్ర గుప్తను కోడలు చాలా దారుణంగా చూసేది.
ప్రతీ రోజూ తినడానికి మాడిపోయిన చపాతీలు.. నీళ్లు కలిపిన కూరగాయలు పెట్టేది. మానసికంగా బాగా వేధించేది. కోడలి వేధింపులు తట్టుకోలేకపోయిన రమేశ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు ఓ సూసైడ్ నోట్ రాశాడు. సూసైడ్ నోట్‌లో.. ‘నేను ఇక దీన్ని భరించలేను. ఈ అవమానాలు భరిస్తూ బతికి ఉండలేను’ అని పేర్కొన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఇంటి దగ్గరకు చేరుకున్నారు. రమేశ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపారు. సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి
మొంథా తుపాన్ ఎఫెక్ట్.. 4 లక్షల ఎకరాల్లో పంట నష్టం..
ఇన్సురెన్స్ డబ్బుల కోసం తల్లి దారుణం.. లవర్‌తో కలిసి కొడుకు మర్డర్..