Radiologist Arrested: రేడియాలజిస్టు పాడు పని.. స్కానింగ్ కోసం వెళ్లిన మహిళపై..
ABN , Publish Date - Nov 21 , 2025 | 07:38 AM
ఓ రేడియాలజిస్టు తన పాడు బుద్ధి చూపించాడు. స్కానింగ్ చేయించుకోవడానికి వచ్చిన మహిళపై అఘాయిత్యం చేశాడు. చివరకు పాపం పండి జైలు పాలయ్యాడు.
21వ శతాబ్దంలోనూ ఆడవారిపై అఘాయిత్యాలు ఆగటం లేదు. కొంతమంది కామాంధులు తమ కోర్కెలు తీర్చుకోవటానికి దారుణానికి పాల్పడుతున్నారు. చిన్న పిల్లల దగ్గరినుంచి ముసలి వారి వరకు ఎవ్వరినీ వదలటం లేదు. తాజాగా, ఓ రేడియాలజిస్టు స్కానింగ్ చేయించుకోవటం కోసం వచ్చిన మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమెను లైంగికంగా వేధించాడు. ఈ సంఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. జయకుమార్ అనే వ్యక్తి అనేకల్‌లోని ప్లాస్మా మెడినోస్టిక్స్ స్కానింగ్ సెంటర్‌లో రేడియాలజిస్టుగా పని చేస్తున్నాడు.
పది రోజుల క్రితం ఓ మహిళ స్కానింగ్ చేయించుకోవటానికి తన భర్తతో కలిసి జయకుమార్ పని చేస్తున్న స్కానింగ్ సెంటర్‌కు వచ్చింది. మహిళ, జయకుమార్ స్కానింగ్ గదిలో ఉండగా ఆమె భర్త బయట కూర్చున్నాడు. స్కానింగ్ చేసే సమయంలో జయకుమార్ తన పాడు బుద్ధి బయటపెట్టాడు. సదరు మహిళను లైంగికంగా వేధించాడు. ఆమె అడ్డు చెప్పగా బెదిరింపులకు సైతం దిగాడు. ఆమె దీన్నంతా తన మొబైల్ ఫోన్‌లో వీడియో తీసింది. భర్తతో కలిసి పోలీస్ స్టేషన్‌లో జయకుమార్‌పై ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, సంఘటన జరిగి పది రోజులు గడుస్తున్నా నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేయలేదు. దీంతో మహిళ కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్ ముందు ఇన్‌స్పెక్టర్ తిప్పేస్వామికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. పది రోజులు గడుస్తున్నా నిందితుడ్ని అరెస్ట్ చేయకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జయకుమార్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని లేకపోతే సిటీ వ్యాప్తంగా నిరసనలకు దిగుతామని తేల్చి చెప్పారు. దీంతో పోలీసులు జయకుమార్‌ను అరెస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి
మినీ వేలాన్ని ఆపేయండి: రాబిన్ ఉతప్ప
కలెక్టరేట్‌లో నీళ్లు కరువాయే...