Fight Over Light Switch: నైట్ షిఫ్ట్‌లో ఉద్యోగుల మధ్య గొడవ.. ఆఫీస్‌లో దారుణ హత్య..
ABN , Publish Date - Nov 01 , 2025 | 07:21 PM
ఆఫీస్‌లోని లైట్లు ఆఫ్ చేసే విషయంలో ఇద్దరికీ గొడవ అయింది. ఆ గొడవ చినికి చినికి గాలి వానలా మారింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవటం మొదలెట్టారు. ఈ నేపథ్యంలోనే వంశీ డంబెల్‌తో భీమేష్‌పై దాడి చేశాడు.
ఈ మధ్య కాలంలో క్షణికావేశంలో చోటుచేసుకుంటున్న దారుణాలకు లెక్క లేకుండా పోయింది. చిన్న చిన్న విషయాలే ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఓ మనిషి మరో మనిషిని చంపేస్తున్నాడు. తాజాగా, ఓ యువకుడు తన సహోద్యోగిని డంబెల్‌తో ఆఫీస్‌లోనే కొట్టి చంపాడు. లైట్లు ఆఫ్ చేసే విషయంలో గొడవ కారణంగా ఇంత దారుణానికి తెగబడ్డాడు. ఈ సంఘటన కర్ణాటకలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన 24 ఏళ్ల సోమల వంశీ.. కర్ణాటకలోని చిత్ర దుర్గకు చెందిన 41 ఏళ్ల భీమేష్ బాబు బెంగళూరులోని దాత డిజిటల్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నారు. సినిమా షూటింగ్‌లకు సంబంధించిన వీడియోలను ఈ దాత డిజిటల్ బ్యాంకులో ప్రతీ రోజూ స్టోర్ చేస్తూ ఉంటారు. వంశీ, భీమేష్ శుక్రవారం నైట్ షిఫ్ట్‌కు వచ్చారు. శనివారం తెల్లవారుజామున ఆఫీస్‌లోని లైట్లు ఆఫ్ చేసే విషయంలో ఇద్దరికీ గొడవ అయింది.
ఆ గొడవ చినికి చినికి గాలి వానలా మారింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవటం మొదలెట్టారు. ఈ నేపథ్యంలోనే వంశీ డంబెల్‌తో భీమేష్‌పై దాడి చేశాడు. తలపై విచక్షణా రహితంగా కొట్టి చంపేశాడు. హత్య చేసిన తర్వాత అతడు నేరుగా గోవిందరాజ్ నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పోలీసులు వంశీని అరెస్ట్ చేశారు. అతడిపై మర్డర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మరింత లోతుగా విచారణ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
కుషాయిగూడలో రిటైర్డ్ ఆర్మీ జవాన్ షాపులో దోపిడీకి యత్నం..
మా ప్రభుత్వంలో మెరుగ్గా పెన్షన్ల పంపిణీ: సీఎం చంద్రబాబు