Tribal Culture: బస్తర్ కొత్త ఆశ.. కేశ్‌కాల్ టన్నెల్!
ABN , Publish Date - Mar 05 , 2025 | 04:27 AM
అందమైన జలపాతాలకు ప్రసిద్ధి చెందింది. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ ప్రాంతం పర్యాటకంగా బాగా అభివృద్ధి చెందాలి..! కానీ.. గిరిజన ప్రాంతం కావడం, సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో పర్యాటకంగా బాగా వెనకబడింది. ఛత్తీ్‌సగఢ్ రాజధాని రాయ్‌పూర్ నుంచి విశాఖపట్నం మీదుగా దక్షిణ భారతదేశానికి చేరుకోవాలంటే బస్తర్ నుంచే రావాలి.

శరవేగంగా సొరంగ మార్గం పనులు
భారత్‌మాల ప్రాజెక్టు కింద ఆరు లేన్లతో 464 కి.మీ. రహదారి
పూర్తయితే రాయ్‌పూర్ నుంచి విశాఖపట్నానికి 7 గంటలే
ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి
న్యూఢిల్లీ, మార్చి 4: ఛత్తీ్‌సగఢ్‌లోని బస్తర్ జిల్లా గిరిజన సంస్కృతికి, ప్రకృతి సౌందర్యానికి, అందమైన జలపాతాలకు ప్రసిద్ధి చెందింది. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ ప్రాంతం పర్యాటకంగా బాగా అభివృద్ధి చెందాలి..! కానీ.. గిరిజన ప్రాంతం కావడం, సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో పర్యాటకంగా బాగా వెనకబడింది. ఛత్తీ్‌సగఢ్ రాజధాని రాయ్‌పూర్ నుంచి విశాఖపట్నం మీదుగా దక్షిణ భారతదేశానికి చేరుకోవాలంటే బస్తర్ నుంచే రావాలి. కొండలు, లోయలతో కూడిన ఈ ప్రాంతంలో ప్రయాణాన్ని సులభతరం చేసే ఉద్దేశంతో బస్తర్ వద్ద కేశ్‌కాల్ టన్నెల్‌ను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. భారత్‌మాల ప్రాజెక్టు కింద నిర్మిస్తున్న ఈ 2.5 కి.మీ. టన్నెల్ బస్తర్‌తోపాటు ఈ రాష్ట్ర ముఖచిత్రాన్నే మార్చేయనుంది. దక్షిణ భారతదేశానికి కనెక్టివిటీని మెరుగుపరిచే ఈ సొరంగ మార్గం.. ఈ ఏడాది చివరినాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం రాయ్‌పూర్ నుంచి విశాఖపట్నానికి రోడ్డుమార్గంలో రావాలంటే దాదాపు 12 గంటలు పడుతోంది. ఈ టన్నెల్ పూర్తయి, ఆరు వరుసల ఎక్స్‌ప్రెస్ హైవే అందుబాటులోకి వస్తే ఇది ఏడు గంటలకు తగ్గనుంది. ఇది వాణిజ్యానికి, పర్యాటక రంగం అభివృద్ధికి ఊతమిస్తుంది. అలాగే స్థానికంగా పరిశ్రమలు పెరుగుతాయి. ఈ నేపథ్యంలో బస్తర్ వద్ద నిర్మిస్తున్న కేశ్‌కాల్ సొరంగ మార్గంపై కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే టన్నెల్ నిర్మాణ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ప్రతిరోజూ 10 మీటర్ల మేర కొండరాయిని తొలుస్తున్నారు.
పర్యాటకానికి ఊతం..
కేశ్‌కాల్ టన్నెల్ పూర్తయితే రైతులు, వ్యాపారులకు అపారమైన అవకాశలు దక్కుతాయి. ముఖ్యంగా బస్తర్‌లో పర్యాటక రంగం అభివృద్ధికి ఇది కీలకం కానుంది. ఈ ప్రాంతం ఇప్పటికే దాని సహజసిద్ధమైన సౌందర్యానికి, సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ధి చెందింది. కానీ, క్లిష్టమైన భూభాగం కారణంగా సరైన గుర్తింపు దక్కలేదు. ఎక్స్‌ప్రెస్ హైవే వస్తే ఛత్తీ్‌సగఢ్, బస్తర్ రైతులు తమ వ్యవసాయ, అటవీ ఉత్పత్తులు, హస్తకళలను దక్షిణ భారతదేశంలోని విస్తారమైన మార్కెట్లకు సులభంగా రవాణా చేయగలుగుతారు. 2026 మార్చినాటికి బస్తర్‌లో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి ఈ రోడ్డు మార్గం మరింత సహకరించనుంది. రహదారుల కనెక్టివిటీ, పాఠశాలలు, ఆస్పత్రులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. నక్సలిజంతో అట్టుడికిన ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు మార్గం సుగమం అవుతుంది.
మారనున్న బస్తర్ ముఖచిత్రం
బస్తర్ వద్ద నిర్మిస్తున్న కేశ్‌కాల్ టన్నెల్ పొడవు 2.5 కిలోమీటర్లు. ఛత్తీ్‌సగఢ్‌లో ఇదే అతి పొడవైన సొరంగ మార్గం.
1910లో నిర్మించిన ఇరుకైన పాత రోడ్డు స్థానంలో ఆరు వరుసలతో కూడిన విశాలమైన ఎక్స్‌ప్రెస్ హైవేను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో కేశ్‌కాల్ టన్నెల్ చాలా కీలకమైనది.
ఈ టన్నెల్ పూర్తయి ఎక్స్‌ప్రెస్ హైవే కూడా అందుబాటులోకి వస్తే.. ఈ మార్గంలో ఉన్న చిత్రకోట జలపాతం, తీరథ్‌గఢ్ జలపాతం, కుతుంసర్ గుహలు, ప్రసిద్ధ దంతేశ్వరి ఆలయం వంటి ప్రధాన పర్యాటక ప్రాంతాలకు ఆదరణ పెరుగుతుంది.