Share News

Delhi High Court: ఆర్మీలో క్రమశిక్షణే ముఖ్యం.. మతం కాదు

ABN , Publish Date - Jun 02 , 2025 | 05:45 AM

మతపర పరేడ్‌లో పాల్గొననందున ఆర్మీ అధికారి తొలగింపును ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. మతం కంటే యూనిఫారమే ముఖ్యమని, ఆదేశాలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.

Delhi High Court: ఆర్మీలో క్రమశిక్షణే ముఖ్యం.. మతం కాదు

ఢిల్లీ హైకోర్టు స్పష్టీకరణ

న్యూఢిల్లీ, జూన్‌ 1: సైనిక దళాలు వాటి యూనిఫారం ద్వారా కలిసి ఉంటాయే తప్ప మతం కారణంగా విడిపోవని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. విధుల్లో భాగంగా మతపర పరేడ్‌లో పాల్గొనడానికి ఇష్టపడని ఓ క్రైస్తవ ఆర్మీ అధికారిని విధుల నుంచి తొలగించడం సబబేనని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్‌ నవీన్‌ చావ్లా, జస్టిస్‌ శైలీందర్‌ కౌర్‌ల ధర్మాసనం తీర్పు చెప్పింది. ఆ అధికారి విధులు నిర్వర్తించే రెజిమెంట్‌లో గురుద్వారా, మందిరం ఉన్నాయి. విధుల్లో భాగంగా జవాన్లు ప్రతివారం ఆ గుడిలోనికి వెళ్లి పూజలు చేసి, మతపర పరేడ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. ట్రూప్‌ లీడర్‌గా ఆ అధికారే తన కింద పనిచేసే జవాన్లను గుడికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అయితే తాను క్రిస్టియన్‌ను అయినందున అలాంటి పూజలు చేయలేనని, తనకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఉన్నతాధికారులు ఇందుకు నిరాకరించారు. 2021 మార్చి 3న ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిని సవాలు చేస్తూ ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ‘‘ప్రస్తుత కేసు మతస్వేచ్ఛకు సంబంధించినది ఎంతమాత్రం కాదు. ఉన్నతాధికారి ఇచ్చిన చట్టబద్ధమైన ఆదేశాలను పాటించారా, లేదా అన్నదే ముఖ్యం’’ అని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.


ఇవీ చదవండి:

చర్చలంటూ జరిగితే పీఓకే పైనే

పక్కా ప్లాన్ ప్రకారమే హత్యలు

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 02 , 2025 | 05:45 AM