Family Loans: కుటుంబ రుణాల్లో అగ్రస్థానంలో.. ఏపీ, తెలంగాణ..
ABN , Publish Date - Oct 25 , 2025 | 03:38 AM
సామాజిక, ఆర్థిక అంశాల్లో ముందంజలో ఉండే దక్షిణాది రాష్ట్రాలకు చెందిన కుటుంబాలు అప్పులు తీసుకోవటంలోనూ దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ముందున్నాయి.
దేశంలోనే దక్షిణాదిలో రుణాలు అధికం
సామాజికవర్గాల ప్రకారం బీసీల్లో గరిష్ఠం.. ఎస్టీల్లో కనిష్ఠం.. కేంద్ర గణాంకాలశాఖ
దక్షిణాది ప్రజలకు రుణ చెల్లింపు సామర్థ్యం ఎక్కువ.. నిపుణుల అభిప్రాయం
అందుకనే రుణసంస్థలు అప్పులిస్తున్నాయ్.. నిపుణులు
న్యూఢిల్లీ/అమరావతి, అక్టోబరు 24: సామాజిక, ఆర్థిక అంశాల్లో ముందంజలో ఉండే దక్షిణాది రాష్ట్రాలకు చెందిన కుటుంబాలు అప్పులు తీసుకోవటంలోనూ దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ముందున్నాయి. ఇక మొత్తం దక్షిణాదిలో రెండు తెలుగు రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ప్రతీ ఆరు నెలలకోమారు విడుదలయ్యే కేంద్ర గణాంకాలశాఖ జర్నల్ ‘సర్వేక్షణ’ ఈ వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం.. దేశంలోని వయోజనుల్లో అప్పు తీసుకున్న వారి సంఖ్య సగటున 15 శాతం కాగా.. దక్షిణాది రాష్ట్రాలన్నింటా ఇది 20 శాతానికిపైనే ఉంది. అన్నింట్లోకి అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలవటం గమనార్హం. ఆ రాష్ట్రంలో అప్పు తీసుకున్న వయోజనుల సంఖ్య సగటున 43.7 శాతం. ఆ తర్వాత స్థానంలో తెలంగాణ 37.2 శాతంతో ఉంది. తదుపరి స్థానాల్లో కేరళ (29.9శాతం), తమిళనాడు (29.4శాతం), పుదుచ్చేరి (28.3శాతం), కర్ణాటక (23.2శాతం) ఉన్నాయి. ఇతర రాష్ట్రాల విషయానికొస్తే.. ఛత్తీ్‌సగఢ్ 6.5శాతం, అస్సాం 7.1శాతం, గుజరాత్ 7.2శాతం, జార్ఖండ్ 7.5శాతం, పశ్చిమ బెంగాల్ 8.5శాతం, హరియాణా 8.9శాతం మంది రుణగ్రహీతలను కలిగి ఉన్నాయి. ఢిల్లీలో అత్యల్పంగా కేవలం 3.4 శాతం మంది మాత్రమే రుణం తీసుకున్నట్లు తెలిపారు.
అగ్రస్థానంలో బీసీలు
దేశంలో అప్పులు తీసుకుంటున్న వ్యక్తులను, కుటుంబాలను సామాజికవర్గాల ప్రకారం పరిశీలిస్తే.. 16.6 శాతంతో బీసీలు అగ్రస్థానంలో నిలువగా.. 11 శాతంతో ఎస్టీలు అత్యంత దిగువన ఉన్నారు. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల పరంగా స్వల్ప తేడానే ఉంది (పట్టణాలు-14శాతం, గ్రామీణ ప్రాంతాలు-15శాతం). అలాగే మతాలవారీగానూ పెద్దగా తేడాల్లేవు. మహిళలకంటే పురుషులు, వివాహితులు, చిన్న కుటుంబాల వారు ఎక్కువగా అప్పులు తీసుకుంటున్నట్లు తేలింది. 2020-21లో నిర్వహించిన 78వ బహుళ ప్రయోజనకర సర్వేలో వెల్లడైన అంశాల ఆధారంగా ఈ వివరాలను నమోదు చేశారు. సర్వేలో భాగంగా 15 లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారిని ప్రశ్నించారు. సర్వే సమయానికి కనీసం రూ.500 లేదా అంతకంటే ఎక్కువ అప్పు ఉన్న వారి వివరాలు సేకరించారు. ఈ నివేదికపై ఆర్థిక నిపుణులు స్పందిస్తూ.. దక్షిణాది రాష్ట్రాల ప్రజల తలసరి ఆదాయం, ఆస్తులు ఎక్కువ కాబట్టి, రుణాలు తిరిగి చెల్లించే సామర్థ్యం ఉంటుందని, అందువల్లే రుణసంస్థలు వారికి అప్పులను గణనీయంగా ఇస్తున్నాయని పేర్కొన్నారు.