A senior Haryana police officer: హరియాణాలో మరో పోలీసు ఆత్మహత్య
ABN , Publish Date - Oct 15 , 2025 | 04:28 AM
హరియాణాలో సీనియర్ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య కేసుపై విచారణ జరుగుతున్న తరుణంలో...
ఐపీఎస్ పూరన్ కేసులో కొత్త మలుపు
ఆయనపైనే తీవ్ర ఆరోపణలు చేసిన సైబర్ సెల్ ఏఎ్‌సఐ సందీప్ కుమార్
‘నిజాలు’ బయటకొచ్చేందుకు ఆత్మహత్య అంటూ నోట్, వీడియో
కొత్త డీజీపీగా ఓపీ సింగ్ నియామకం
న్యూఢిల్లీ/చండీగఢ్, అక్టోబరు 14: హరియాణాలో సీనియర్ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య కేసుపై విచారణ జరుగుతున్న తరుణంలో పెద్ద ట్విస్ట్ చోటుచేసుకుంది. రాష్ట్రంలో మరో పోలీసు అధికారి మంగళవారం బలవన్మరణానికి పాల్పడ్డారు. సందీప్ కుమార్ అనే ఏఎ్‌సఐ రోహ్‌తక్‌లో తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన తన సూసైడ్ నోట్‌లో పూరన్ కుమార్‌ను లక్ష్యంగా చేసుకొని తీవ్ర ఆరోపణలు చేశారు. సందీప్ కుమార్ రోహ్‌తక్ సైబర్ విభాగంలో ఏఎ్‌సఐగా పనిచేస్తున్నారు. ఆయన పూరన్‌పై నమోదైన ఓ అవినీతి కేసును దర్యాప్తు చేస్తున్నారు. ‘నిజాలు’ వెలుగులోకి రావడం కోసం ప్రాణత్యాగం చేస్తున్నట్లు తన మూడు పేజీల సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. సందీప్ ఆత్మహత్యకు ముందు ఆరు నిమిషాల వీడియోను కూడా రికార్డు చేశారు. పూరన్ కుమార్ ఒక అవినీతి పోలీసు అధికారి అని, ఆయన అవినీతి బయటకు వస్తుందనే భయంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. కులవివక్ష అంశాన్ని ఉపయోగించి.. వ్యవస్థను హైజాక్ చేశారని ఆరోపించారు. పూరన్ గన్‌మెన్ ఒక లిక్కర్ కాంట్రాక్టర్ నుంచి రూ.2.5 లక్షలు లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డాడని, లంచం ఆరోపణలు వెలుగులోకి రావడంతో ఐపీఎస్ అధికారి కులరంగు పూసేందుకు యత్నించారని, చివరకు ఆత్మహత్య చేసుకున్నారని ఏఎ్‌సఐ ఆరోపించారు. పూరన్ కుమార్ సూసైడ్ నోట్‌లో పేర్కొన్న 10 మంది అధికారుల్లో ఒకరైన రోహ్‌కత్ మాజీ ఎస్పీ నరేంద్ర బిజార్ణియాను ప్రశంసించారు. అయితే సందీప్ కుమార్ సూసైడ్ నోట్‌ను, వీడియోను పోలీసులు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ఇదిలా ఉండగా, పూరన్ ఆత్మహత్య వివాదం నేపథ్యంలో హరియాణా ప్రభుత్వం కొత్త డీజీపీగా 1991 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ఓంప్రకాశ్ సింగ్‌ను నియమించింది. డీజీపీగా ఉన్న శత్రుజీత్ సింగ్ కపూర్‌ను సెలవుపై పంపిన కొద్ది గంటలకే ఈ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం చండీగఢ్‌లో పూరన్ కుటుంబసభ్యులను పరామర్శించారు.