Chennai: రాందాస్‌తో అన్బుమణి భేటీ.. సయోధ్యకు యత్నాలు
ABN , Publish Date - Jun 06 , 2025 | 11:13 AM
పీఎంకే పార్టీలో తండ్రీకొడుకుల మధ్య నెలకొన్న విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ రాందాస్, ఆయన తనయుడు, ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు డాక్టర్ అన్బుమణిల మధ్య గతకొద్దరోజులుగా విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే.
- రంగంలోకి ఆడిటర్ గురుమూర్తి
చెన్నై: వన్నియార్ల ఓటు బ్యాంకు కలిగిన పాట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే)లో గత కొద్ది నెలలుగా ఆ పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ రాందాస్, ఆయన తనయుడు పార్టీ అధ్యక్షుడు డాక్టర్ అన్బుమణి(Dr Anbumani) మధ్య కొనసాగుతున్న ఆధిపత్యపోరు గురువారం సమసి పోతుందనుకున్న పార్టీ శ్రేణులకు తీవ్ర నిరాశే మిగిలింది. ముప్పావు గంటసేపు కొనసాగిన భేటీ సత్ఫలితాలివ్వలేదని తెలుస్తోంది. అదే సమయంలో తండ్రీ తనయుల మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రముఖ ఆడిటర్ గురుమూర్తి రంగ ప్రవేశం చేశారు. ఇటీవల పార్టీ అధ్యక్షుడిగా తన మాటకు తిరుగులేదంటూ మూడు రోజులపాటు చోళింగనల్లూరులో జిల్లా నేతలతో జరిగిన సమావేశాల్లో అన్బుమణి చేసిన ప్రకటన రాందాస్ కు తీవ్ర ఆగ్రహం కలిగించింది.
అన్బుమణి మద్దతుదారులను పార్టీ తొలగించి, తన అనుయాయులను నియమించారు. రెండు రోజుల క్రితం రాందాస్ మీడియాతో మాట్లాడుతూ పార్టీలో నెలకొన్న సంక్షోభంపై గురువారం తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని తెలిపారు. ఆయన మాటలను బట్టి అన్బుమణిని పార్టీ నుండి తొలగించడం ఖాయమని అందరూ అనుకున్నారు. ఆ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా చెన్నైలోనే ఉంటున్న అన్బుమణి గురువారం ఉదయం దిండివనం తైలాపురం గార్డెన్‌కు వెళ్ళి పార్టీ వ్యవస్థాపకుడైన తన తండ్రి రాందాస్ ను కలుసుకున్నారు.
ఈ విషయం తెలియగానే పార్టీ గౌరవాధ్యక్షుడు జీకే మణి సహా పలువురు నాయకులు తండ్రీ తనయుల భేటీ సత్ఫలితమిస్తుందని భావించారు. అన్బుమణి తన కుమార్తెతో కలిసి వెళ్లి రాందా్‌సతో భేటీ అయ్యారు. ఉదయం 9.10 నుంచి 10 గంటల వరకు ఇద్దరూ చర్చలు జరిపారు. ఈ చర్చలలో రాందాస్ పెద్దకుమార్తె కాంతిమతి కూడా పాల్గొన్నారు. ఈ చర్చల తర్వాత అన్బుమణి విసవిసా బయటకు వచ్చి కారెక్కి వెళ్ళిపోయారు. అన్బుమణి మీడియాతో భేటి కావాల్సి ఉన్నప్పటికీ ఎందుకనో వెళ్ళిపోయారు.
ఆడిటర్ గురుమూర్తి రంగ ప్రవేశం..
రాందా్‌సను కలుసుకుని అన్బుమణి వెళ్ళిపోయిన పది నిమిషాల తర్వాత తుగ్లక్ పత్రిక సంపాదకుడు, ఆడిటర్ గురుమూర్తి, చెన్నై నగర మాజీ మేయర్ సైదై దురైసామి తైలాపురం చేరుకున్నారు. ఆ మధ్య కేంద్ర హోం శాఖమంత్రి అమిత్‌షా నగరానికి వచ్చినప్పుడు అన్నాడీఎంకే, బీజేపీ మధ్య పొత్తు ఖరారు ప్రకటన సభ ఏర్పాటు చేయడంలో గురుమూర్తి కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. అమిత్‌షా ముందుగా గురుమూర్తి నివాసంలో చర్చలు జరిపిన మీదటే గిండి స్టార్ హోటల్‌లో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామిని పక్కన కూర్చోబెట్టుకుని 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడానికి రెండు పార్టీల మధ్య పొత్తుఖరారైందని ప్రకటించారు.

ఆ రీతిలోనే గురుమూర్తి పీఎంకేని ఎన్డీయేలో చేర్చేదిశగా పావులు కదిలించేందుకు తైలాపురం గార్డెన్‌కు వెళ్ళారు. అన్బుమణి వెళ్ళిన 10 నిమిషాలకు ఒకే కారులో గురుమూర్తి, సైదై దురైసామి కలిసి రాందాస్ నివాసానికి చేరుకున్నారు. వీరిద్దరూ మధ్యాహ్నం 1.15 గంటల వరకూ రాందాస్‌తో అసెంబ్లీ ఎన్నికల వ్యూహంపై చర్చించారు. అదే సమయంలో పీఎంకేలో తండ్రీతనయుల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరుకు ముగింపు పలకాలని రాందాస్‌కు గురుమూర్తి సూచన చేసినట్లు తెలుస్తోంది. రాందాస్ తో సమావేశం అనంతరం గురుమూర్తి మీడియాతో మాట్లాడుతూ రాందాస్ తన చిరకాల మిత్రుడని, ఆయనకు తానంటే ఎంతో ఇష్టమని కూడా చెప్పారు.
అన్బుమణి వచ్చివెళ్ళినట్లు తనకు తెలియదని చెప్పారు. అదే సమయంలో పీఎంకేతో పొత్తు ఖరారు చేసుకునేందుకు బీజేపీ ప్రతినిధిగా తాను ఎలాంటి చర్చలు చేయలేదని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల మధ్య సమస్యలు, సంక్షోభం వచ్చినప్పుడల్లా హాజరవుతున్నారే అంటూ విలేఖరులు ఆయనను ప్రశ్నించినప్పుడు తాను వెళ్చే చోట సమస్యలు రావటం ఆనవాయితీగా మారిందని గురుమూర్తి నవ్వుతూ చెప్పారు. తండ్రీకొడుకుల మధ్య సయోధ్య కుదిరిందా అన్న ప్రశ్నకు బదులివ్వకుండా ఆయన బయలుదేరి వెళ్ళారు.
ఈ వార్తలు కూడా చదవండి.
పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధరలు..
బనకచర్లపై ఉత్తమ్, కవిత తప్పుడు ప్రచారం: బక్కని
Read Latest Telangana News and National News