Anbumani: పార్టీలో సర్వాధికారిని నేనే..
ABN , Publish Date - May 31 , 2025 | 11:45 AM
పార్టీలో సర్వాధికారిని నేనే.. అని డాక్టర్ అన్బుమణి తేల్చేశారు. అలాగే కోశాధికారి తొలగింపు చెల్లదంటూ కూడా ఆయన అన్నారు. కాగా.. పీఎంకేలో తండ్రీకొడుకుల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. ఆ పార్టీలో నెలకొన్న విభేధాలతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు.
- కోశాధికారి తొలగింపు చెల్లదు
- అనుయాయుల సమావేశంలో అన్బుమణి
చెన్నై: పీఎంకేలో తండ్రీకొడుకుల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. పీఎంకే అధ్యక్షుడిగా అన్బుమణిని తొలగించినట్లు వ్యవస్థాపకుడైన ఆయన తండ్రి డాక్టర్ రాందాస్ ఇప్పటికే ప్రకటించగా, ఆ అధికారం ఆయనకు లేదని డాక్టర్ అన్బుమణి(Dr Anbumani) తెగేసి చెప్పారు. అధ్యక్షుడిగా పార్టీకి సర్వాధికారిని తానేనని, ఎవరినైనా చేర్చుకోవాలన్నా, తొలగించాలన్నా తనకు మాత్రమే అధికారాలున్నాయని అన్బుమణి స్పష్టం చేశారు. తాను అధ్యక్షుడిగా ఉన్నా సాధారణ కార్యకర్తలాగే వ్యవహరిస్తానని, పార్టీ శ్రేణులందరినీ సమైక్యపరచి పార్టీని అభివృద్ధి బాటలో నడిపిస్తానని ప్రకటించారు.

శుక్రవారం చెన్నైలో జరిగిన సమావేశంలో తనకు అనుయాయులైన జిల్లా కార్యదర్శులు, ఇన్‌చార్జుల సమావేశంలో అన్బుమణి మాట్లాడుతూ.. పార్టీ వ్యవస్థాపకుడు రాందాస్ ఆశయాలను ఆదర్శంగా తీసుకునే పార్టీని నడిపిస్తానన్నారు. పార్టీలో అయోమయపరిస్థితులున్నాయని, త్వరలోనే అంతా సర్దుకుంటుందని తెలిపారు. గతంలో తాను ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని, ఇప్పుడు ఎదురవుతున్న అవమానాన్ని కూడా అధిగమిస్తానని అన్బుమణి చెప్పారు. ఈ ప్రపంచంలో తాను ఎక్కువగా అభిమానించేది, ఆరాధించేది తన తల్లినేనని, అలాంటప్పుడు తన తండ్రి చెప్పినట్లు ఎలా దాడి చేస్తానని ప్రశ్నించారు.

తానెప్పుడూ పార్టీ శ్రేణుల్లో ఒకడిగానే వ్యవహరిస్తానని, రాష్ట్రాభివృద్ధే పార్టీ లక్ష్యమని ఆ దిశగానే పార్టీని ముందుకు నడిపిస్తానని వెల్లడించారు. మూడు రోజలుపాటు జరుగనున్న జిల్లా నేతల సమావేశాల్లో కొత్త సభ్యుల చేరిక, పాత సభ్యత్వాన్ని రెన్యూవల్ చేయడం తదితర కార్యక్రమాలపై పార్టీ శ్రేణులు దృష్టిసారించాలన్నారు. పార్టీ శ్రేణులు తమ అభిప్రాయాలను నిర్భయంగా తనకు తెలపవచ్చని, పార్టీకి బంగారు భవిష్యత్తు ఉందన్నారు. పార్టీ కార్యకర్తలంతా ధైర్యంగా ముందుకు దూసుకుపోవాలని పిలుపునిచ్చారు. పార్టీలో కలతలు, అభిప్రాయ భేదాలు రావటం సహజమేనని, అవన్నీ కాలానుగుణంగా సమసిపోతాయని అన్బుమణి అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
సామాన్యులకు షాకింగ్.. పెరిగిన గోల్డ్, తగ్గిన వెండి ధరలు
Read Latest Telangana News and National News