Amit Shah: నక్సలైట్లను ఈ వర్షాకాలంలో నిద్రపోనీయం
ABN , Publish Date - Jun 23 , 2025 | 04:31 AM
నక్సలైట్ల ఏరివేత కార్యక్రమాలను కొనసాగిస్తామని, ఈ వర్షాకాలంలోనూ వాటికి విరామం ఇవ్వబోమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు.
ఆపరేషన్ కొనసాగిస్తాం.. చర్చలు అవసరం లేదు
కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు
రాయ్‌పూర్, జూన్ 22: నక్సలైట్ల ఏరివేత కార్యక్రమాలను కొనసాగిస్తామని, ఈ వర్షాకాలంలోనూ వాటికి విరామం ఇవ్వబోమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ప్రతి ఏటా వర్షాకాలంలో నదులు పొంగడం కారణంగా దట్టమైన అడవుల్లో నక్సలైట్ల ఏరివేత ఆపరేషన్‌ను నిలిపివేస్తుంటామని, ఈ సారి మాత్రం అలా చేయబోమని చెప్పారు. గాలింపు చర్యలు కొనసాగించి నక్సలైట్లకు విశ్రాంతి లేకుండా చేస్తామని అన్నారు. 31/3 లక్ష్యాన్ని-(2026 మార్చి 31 నాటికి నక్సలైట్లను లేకుండా చేయాలన్న టార్గెట్‌ను) సాధిస్తామని తెలిపారు. ఛత్తీ్‌సగఢ్ రాజధాని నవ రాయ్‌పూర్‌లోని అటల్‌నగర్‌లో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ క్యాంపస్, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ ఈ వర్షాకాలంలోనూ నిరంతరం గాలింపు చర్యలు చేపట్టి నక్సలైట్లకు నిద్రలేకుండా చేస్తామని తెలిపారు. నక్సలైట్లతో చర్చలు జరిపేది లేదని స్పష్టం చేశారు. ఆయుధ పోరాటానికి స్వస్తి చెప్పి జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు. ప్రభుత్వం ఆకర్షణీయమైన లొంగుబాటు విధానాన్ని ప్రకటించిందని, దాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు. లొంగిపోయేవారిని హృదయపూర్వకంగా స్వాగతిస్తామని తెలిపారు. అలాంటివారికి ఛత్తీ్‌సగఢ్, కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలన్నీంటినీ అమలు చేస్తామని, ఇంకా ఎక్కువ సాయం చేస్తామని ప్రకటించారు.
పహల్గాం ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చిన ముగ్గురి అరెస్టు
ఇదిలా ఉండగా, పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరిని ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. ఈమేరకు ఎన్‌ఐఏ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన పర్వేజ్ అహ్మద్, బషీర్ అహ్మద్ అనే ఇద్దరు స్థానికులను అదుపులోకి తీసుకున్నాం. వారు దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదుల గురించిన వివరాలను వెల్లడించారు. పహల్గాం దాడికి పాల్పడిన వారు పాకిస్థాన్ దేశీయులని, నిషేధిత ఉగ్రసంస్థ లష్కరే తయిబాకు చెందినవారని వారు వెల్లడించారు. దాడికి ముందు ఉగ్రవాదులని తెలిసే.. వారికి ఆ ఇద్దరు ఆశ్రయం కల్పించారు’’ అని ఎన్‌ఐఏ పేర్కొంది.