Amit Shah Says Rahul Cant Be PM: రాహుల్ పీఎం కాలేడు..ఉదయనిధి సీఎం కాబోడు
ABN , Publish Date - Aug 23 , 2025 | 03:04 AM
కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో ఉన్న ప్రధాన పార్టీల నేతలంతా వారి వారసులకు పట్టం కట్టాలనే లక్ష్యం...
చెన్నై, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో ఉన్న ప్రధాన పార్టీల నేతలంతా వారి వారసులకు పట్టం కట్టాలనే లక్ష్యం పెట్టుకున్నారని అమిత్‌షా అన్నారు. ప్రజల మేలు వారికి అవసరం లేదని విమర్శించారు. తమిళనాడు సీఎం, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఏకైక లక్ష్యం.. తన కుమారుడు ఉదయనిధిని సీఎం చేయడమేనని, సోనియాగాంధీ ప్రధాన లక్ష్యం తనయుడు రాహుల్ గాంధీని పీఎం సీటలో కూర్చోబెట్టడమేనని అన్నారు. ఈ మేరకు తమిళనాడులోని తిరునల్వేలిలో శుక్రవారం జరిగిన బీజేపీ బూత్ కమిటీ నిర్వాహకుల సమావేశంలో షా మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయనిధి సీఎం కాలేడని, రాహుల్ ప్రధాని కాబోడని వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌లో ఇటీవల ప్రధాని, మంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు తీవ్ర నేరారోపణలతో అరెస్టయితే పదవి నుంచి తొలగించేందుకు వీలుకల్పించే బిల్లును ప్రవేశపెట్టామని తెలిపారు. ఈ బిల్లును ప్రతిపక్షాలన్నీ తీవ్రంగా వ్యతిరేకించాయని, దీనికి కారణం ప్రతిపక్ష పార్టీల్లో అత్యధిక శాతం మంది అవినీతి పరులేనన్నారు. ఈ బిల్లును తమిళనాడు సీఎం స్టాలిన్ నల్లచట్టంగా పేర్కొనటం విడ్డూరంగా ఉందన్నారు.