Share News

Allahabad High Court: అభ్యర్థుల ఆస్తుల జాబితాను ప్రజలకు అందుబాటులో ఉంచాల్సింది ఈసీనే

ABN , Publish Date - Aug 18 , 2025 | 04:08 AM

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఆస్తుల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పైనే ఉన్నట్టు కనిపిస్తోందని అలహాబాద్‌ హైకోర్టు అభిప్రాయపడింది.

Allahabad High Court: అభ్యర్థుల ఆస్తుల జాబితాను ప్రజలకు అందుబాటులో ఉంచాల్సింది ఈసీనే

  • అలహాబాద్‌ హైకోర్టు

ప్రయాగ్‌రాజ్‌, ఆగస్టు 17: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఆస్తుల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పైనే ఉన్నట్టు కనిపిస్తోందని అలహాబాద్‌ హైకోర్టు అభిప్రాయపడింది. ఆస్తుల జాబితాను ఆదాయపు పన్ను విభాగం తనిఖీలు చేసిన తరువాత వాటిని ప్రజాబాహుళ్యానికి అందుబాటులో తీసుకురావాల్సిన బాధ్యత ఈసీపైనే ఉంటుందని తెలిపింది. ఆస్తుల జాబితాలు ప్రజలకు తెలిసేలా ఏర్పాట్లు చేయాలంటూ 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు కావడం లేదంటూ రిటైర్డు ఐఏఎస్‌ అఽధికారి ఎస్‌.ఎన్‌ శుక్లా ఆధీనంలోని లోక్‌ ప్రహరీ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అభ్యర్థులు ఫారం-26లో తమ ఆస్తుల వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది. వాటిని ఆదాయపు పన్ను విభాగం తనిఖీ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుంది.


ఈ బాధ్యత ఎవరన్నదానిపై సమస్య తలెత్తింది. దీనిని ఆదాయపు పన్ను శాఖే చూడాల్సి ఉంటుందని ఎన్నికల కమిషన్‌ తరఫు న్యాయవాది చెప్పారు. తమపై అలాంటి బాధ్యత లేదని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకొని ప్రాథమికంగా చూస్తే ఇది ఎన్నికల కమిషన్‌ చేయాల్సిన పనేనని అభిప్రాయపడింది. అలా అయితే ఇందుకు కేంద్ర ప్రభుత్వం తమకు సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం కోర్టుకు తెలిపింది. దాంతో కేంద్ర హోం శాఖను ప్రతివాదిగా చేర్చుతూ తదుపరి విచారణను సెప్టెంబరు15కు వాయిదా వేసింది.

Updated Date - Aug 18 , 2025 | 04:08 AM