Indian Air Defense: ఆకాశమే హద్దు
ABN , Publish Date - May 11 , 2025 | 04:07 AM
పాకిస్థాన్ దాడుల్లో ఆకాశ్ క్షిపణి వ్యవస్థ కీలక పాత్ర పోషించి నగరాలను రక్షించింది. డీఆర్‌డీవో శాస్త్రవేత్త ప్రహ్లాద రామారావు అభివృద్ధి చేసిన ఈ క్షిపణి శక్తివంతమైన దేశీయ రక్షణ వ్యవస్థగా నిలిచింది.
న్యూఢిల్లీ, మే10: ఆకాశ్ క్షిపణి వ్యవస్థ.. గురువారం రాత్రి పాకిస్థాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసినపుడు, వాటిని నేలకూల్చి పశ్చిమ భారత్‌లోని నగరాలను రక్షించడంలో కీలక పాత్ర పోషించింది. ఉపరితలం నుంచి గగన తలంలోని బహుళ లక్ష్యాలను ఏకకాలంలో ఛేదించ గల సత్తా దీని సొంతం. డీఆర్‌డీవో శాస్త్రవేత్త డాక్టర్ ప్రహ్లాద రామారావు సహచర శాస్త్రవేత్తలతో కలసి 15 ఏళ్ల క్రితం స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు. పాక్ దాడులను ఆకాశ్ సమర్థంగా తిప్పికొడుతున్న దృశ్యాలను టీవీల్లో చూసిన 78 ఏళ్ల ప్రహ్లాద రామారావు హర్షం వ్యక్తం చేశారు. ‘నా జీవితంలో అది అత్యంత సంతోషకరమైన రోజు. శత్రువుల వైమానిక లక్ష్యాలను కూల్చివేయడంలో నా బిడ్డ అత్యంత కచ్చితంగా, అద్భుతంగా పనిచేసింది. అంచనాలకు మించి పనిచేస్తూ లక్ష్యాలను ఎదుర్కొంటున్న తీరు చూసి నా కళ్లల్లో ఆనంద భాష్పాలు వచ్చాయి’ అని జాతీయ మీడియాతో ప్రహ్లాద రామారావు అన్నారు. ఆకాశ్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా అత్యంత చిన్న వయసులో పని చేసిన ఘనత ఆయనదే. మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఆయన్ను ఎంపిక చేశారు. డ్రోన్లు, క్షిపణులు, హెలికాప్టర్లతో పాటు అమెరికా తయారు చేసిన అత్యంత నైపుణ్యం గల సూపర్‌సోనిక్ ఎఫ్-16 యుద్ధ విమానాలను అడ్డుకునేలా సహచర శాస్త్రవేత్తలతో కలసి ఆకాశ్ క్షిపణి వ్యవస్థను రూపొందించినట్టు ప్రహ్లాద రామారావు తెలిపారు. మొదట్లో దీనిపై భారత మిలటరీ సంకోచించిందని గుర్తు చేసుకున్నారు. తాజాగా పాక్ దాడులను తిప్పికొట్టడంలో భారత ఇంటిగ్రేటెడ్ కౌంటర్-మానవ రహిత ఏరియల్ సిస్టమ్ గ్రిడ్, రష్యాలో తయారు చేసిన ఎస్-400, ఇతర విమాన నిరోధక ఆయుధాలతో కలసి ఆకాశ్ సమర్థంగా పనిచేసింది.
ఇవీ ప్రత్యేకతలు
ఆకాశ్ సిస్టమ్‌ను హైదరాబాద్‌లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ తయారు చేసింది.
సమూహంగా లేదా వేర్వేరుగా 20 కిలో మీటర్ల ఎత్తులో ఉన్న బహుళ లక్ష్యాలను ఏకకాలంలో ఛేదించగలదు.
ప్రతి లాంచర్‌లో మూడు క్షిపణులు ఉంటాయి. ఒక్కో క్షిపణి 20 అడుగుల పొడవు, 710 కిలోల బరువు ఉంటుంది. ప్రతి క్షిపణి 60 కిలోల వార్‌హెడ్‌ను మోసుకెళ్లగలదు.
ఈ సిస్టమ్ పూర్తిగా ఆటోమేటిక్. రియల్ టైమ్, మల్టీ సెన్సార్ డేటాతో శత్రు లక్ష్యాలను గుర్తించి, దాడి చేస్తుంది.
ఆకాశ్ సిస్టమ్‌ను రూ.6,000 కోట్ల ఒప్పందంతో ఆర్మేనియాకు ఎగుమతి చేశారు.