Share News

Air India: ఎయిరిండియా సర్వీసులు పెద్దసంఖ్యలో రద్దు

ABN , Publish Date - Jun 21 , 2025 | 06:06 AM

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం నేపథ్యంలో ఎయిరిండియా పూర్తి అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం నిర్వహణ, సాంకేతిక లోపాల కారణంగా పలు అంతర్జాతీయ, దేశీయ విమానాలను రద్దు చేసింది.

Air India: ఎయిరిండియా సర్వీసులు పెద్దసంఖ్యలో రద్దు

న్యూఢిల్లీ/పుణె, జూన్‌ 20: అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం నేపథ్యంలో ఎయిరిండియా పూర్తి అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం నిర్వహణ, సాంకేతిక లోపాల కారణంగా పలు అంతర్జాతీయ, దేశీయ విమానాలను రద్దు చేసింది. ఇందులో ఏఐ2204 దుబాయ్‌-హైదరాబాద్‌, ఏఐ2872 హైదరాబాద్‌-ముంబై సహా, ఏఐ906 దుబాయ్‌-చెన్నై, ఏఐ308 ఢిల్లీ-మెల్‌బోర్న్‌, ఏఐ309 మెల్‌బోర్న్‌-ఢిల్లీ వంటి విమాన సర్వీసులు ఉన్నాయి. కాగా, ఏఐ2145 ఢిల్లీ-బాలి విమానం మరికొద్దిసేపటిలో బాలి విమానాశ్రయానికి చేరుతుందనగా తిరిగి వెనక్కి పంపించారు. బాలి విమానాశ్రయానికి సమీపంలో అగ్నిపర్వతం విస్ఫోటనం సంభవించిందన్న సమాచారం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.


దీంతో విమానం తిరిగి ఢిల్లీకి వచ్చి సురక్షితంగా ల్యాండ్‌ అయింది. ఇదిలా ఉండగా.. ఏఐ2470 విమానం శుక్రవారం ఢిల్లీ నుంచి పుణె వెళ్తుండగా ఓ పక్షి ఢీకొట్టింది. విమానం పుణె ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అయ్యాక ఈ విషయాన్ని గుర్తించారు. దీంతో తిరిగి ఢిల్లీ ప్రయాణాన్ని రద్దు చేశారు. మరోవైపు, పలు అంతర్జాతీయ సర్వీసుల చార్జీలను 70ు వరకు తగ్గిస్తున్నట్లు ఎయిరిండియా తెలిపింది. ఢిల్లీ-పారిస్‌ విమానం చార్జీని రూ.23,313 నుంచి రూ.24,045గా నిర్ణయించింది. ఇదే మార్గంలో ఎయిర్‌ ఫ్రాన్స్‌ చార్జీ రూ.69,763 నుంచి రూ.83,261గా ఉండడం గమనార్హం.

Updated Date - Jun 21 , 2025 | 06:06 AM