Share News

Ahmedabad Flight Accident: ఉదయం పేపర్లో యాడ్.. మధ్యాహ్నం విమాన ప్రమాదం..

ABN , Publish Date - Jun 13 , 2025 | 12:19 PM

Viral Newspaper Ad: అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రపంచ దేశాలు సైతం ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి.

Ahmedabad Flight Accident: ఉదయం పేపర్లో యాడ్.. మధ్యాహ్నం విమాన ప్రమాదం..
Viral Newspaper Ad

గుజరాత్: ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్‌లో కూలిపోవడానికి కొన్ని గంటల ముందు.. అంటే గురువారం ఉదయం గుజరాత్‌కు చెందిన ఓ ప్రముఖ న్యూస్ పేపర్లో ఓ యాడ్ వచ్చింది. అది కిడ్‌జానియా అనే ఇండోర్ మీనియేచర్ సిటీకి సంబంధించిన యాడ్. ఆ యాడ్‌లో ఓ మూలకు ఎయిర్ ఇండియా విమానం ఉంది. అది కూడా బిల్డింగ్‌లోంచి బయటకు చొచ్చుకు వస్తున్నట్లుగా ఉంది. నిన్న ఏఐ 171 విమానం సాంకేతిక లోపం కారణంగా వైద్య కళాశాల భవనంపై కుప్పకూలిన సంగతి తెలిసిందే.


యాడ్‌లో చూపించినట్లుగానే..

విమానం ముందు భాగం వైద్య కళాశాల చివరకు వచ్చి చేరింది. అది అచ్చం యాడ్‌లో చూపించినట్లుగానే కనిపిస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక, ఈ వైరల్ న్యూస్‌పై కిడ్‌జానియా ప్రతినిధి స్పందిస్తూ.. ‘మిడ్ డే పత్రికలో వచ్చిన యాడ్ గురించి క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. ప్రపంచవ్యాప్తంగా కిడ్‌జానియా ప్రమోషన్ల కోసం భవనంలోంచి బయటకు చొచ్చుకు వస్తున్నట్లుగా ఉండే విమానాన్ని వాడుతున్నాం. ఎయిర్ ఇండియాతోపాటు ప్రపంచంలోని చాలా ఎయిర్ లైన్లతో మాకు భాగస్వామ్య ఒప్పందాలు ఉన్నాయి.


సమ్మర్ క్యాంపులో భాగంగా.. విమాన ప్రమాదం జరగడాని కంటే ముందే ఆ యాడ్ సబ్‌మిట్ చేశాం. ఈ విషాదకర ఘటన నుంచి దేశం కుదుటపడే వరకూ యాడ్‌ను ఆపేస్తాము’ అని స్పష్టం చేశారు. కాగా, అహ్మదాబాద్‌లో జరిగిన ప్రమాదంలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో 169 మంది ఇండియన్స్ కాగా.. 53 మంది యూకే.. ఏడుగురు పోర్చుగీస్.. కెనడాకు చెందిన ఓ వ్యక్తి ఉన్నారు. వీరంతా సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఓ వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు.

Updated Date - Jun 13 , 2025 | 03:38 PM