Agroforestry Rules: వ్యవసాయ భూముల్లోని వృక్షాల నరికివేత రూల్స్‌లో మార్పు
ABN , Publish Date - Jun 29 , 2025 | 04:22 AM
ఆగ్రోఫారెస్ర్టీ(వ్యవసాయ భూముల్లో వృక్షాల పెంపకం)ని ప్రోత్సహించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ భూముల్లోని వృక్షాల నరికివేతను సులభతరం చేస్తూ నమూనా నిబంధనలు జారీ చేసింది.
న్యూఢిల్లీ, జూన్ 28: ఆగ్రోఫారెస్ర్టీ(వ్యవసాయ భూముల్లో వృక్షాల పెంపకం)ని ప్రోత్సహించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ భూముల్లోని వృక్షాల నరికివేతను సులభతరం చేస్తూ నమూనా నిబంధనలు జారీ చేసింది. దీనికి సంబంధించి కేంద్ర పర్యావరణ శాఖ ఈనెల 19న అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు లేఖలు పంపింది. వ్యవసాయ భూముల్లోని వృక్షాలను నరికేందుకు స్పష్టమైన సమన్వీకృత నియమాలు లేకపోవడమే ఆగ్రోఫారెస్ర్టీకి కీలకమైన అవరోధంగా కేంద్రం గుర్తించినట్లు తెలిపింది. కలప ఆధారిత పరిశ్రమలు(ఏర్పాటు, నియంత్రణ) మార్గదర్శకాలు-2016 కింద ఇప్పటికే ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి కమిటీ(ఎ్‌సఎల్‌సీ)లే తాజా నిబంధనలనూ అమలయ్యేలా చూస్తాయి. ఈ కమిటీ వ్యవసాయ భూముల నుంచి కలప రవాణాకు, దరఖాస్తుల పరిశీలనకు ఏజెన్సీలను ఏర్పాటు చేస్తుంది. రైతులు చెట్లు నాటే తమ భూమి వివరాలను ఎన్‌టీఎంఎ్‌స(జాతీయ టింబర్ మేనేజ్‌మెంట్ సిస్టం) పోర్టల్‌లో తప్పక నమోదు చేయాలి. ఆ ప్రదేశం, చెట్లు నాటిన తేదీ, ఆ చెట్ల సగటు ఎత్తు తదితర ప్రాథమిక సమాచారాన్ని నమోదు చేయాలి. ప్రతి చెట్టును ఫొటో తీసి, జియోట్యాగ్ చేయాలి. తర్వాత చెట్లను నరకాలంటే ఆ చెట్ల ఫొటోలను ఎన్‌టీఎంఎ్‌సలో అప్‌లోడ్ చేయాలి. నరికే తేదీని తెలపాలి. ఆ తర్వాత ఆటోమేటిక్‌గా నిరభ్యంతర సర్టిఫికెట్‌ను పోర్టల్‌లో జారీ చేస్తారు.