Delhi elections: ఢిల్లీ..ఎవరి ఖిల్లా?
ABN , Publish Date - Jan 20 , 2025 | 04:35 AM
మురికివాడల్లోని జనం, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, కార్మికులు ఆప్ వైపు! మధ్యతరగతి, ఉన్నతవర్గాల ప్రజలు కమలం పార్టీ వైపు! మైనారిటీలేమో కాంగ్రె్‌సవైపు,
అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ముక్కోణపు పోటీ
గత అసెంబ్లీ ఎన్నికలకు, ఇటీవలి లోక్‌సభ ఎన్నికలకు పార్టీల ఓట్ల శాతాల్లో భారీతేడా
మెరుగుపడ్డ బీజేపీ, కాంగ్రెస్.. ప్రజలపై ఆమ్ ఆద్మీ పార్టీ వరాల జల్లు
నేటితో ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ గడువు.. ఫిబ్రవరి 5న పోలింగ్
న్యూఢిల్లీ, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): మురికివాడల్లోని జనం, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, కార్మికులు ఆప్ వైపు! మధ్యతరగతి, ఉన్నతవర్గాల ప్రజలు కమలం పార్టీ వైపు! మైనారిటీలేమో కాంగ్రె్‌సవైపు, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ వర్గాల్లో ఎవరు ఏవైపు ఉన్నారు? అనే ప్రశ్నకు ఈ విశ్లేషణలే వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు తప్పదనిపిస్తోంది! నామినేషన్ల ఉపసంహరణకు సోమవారంతో గడువు ముగియనుండటంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ఉధృతం చేయనున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. అదేనెల 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 53.57 శాతం ఓట్లతో ఆమ్ ఆద్మీ పార్టీ 62 స్థానాలు గెలుచుకుంటే, 38.51శాతం ఓట్లతో బీజేపీ 8 స్థానాలకే పరిమితమైంది. 4.26 శాతం ఓట్లతో కాంగ్రెస్ ఒక్క సీటూ గెలుచుకోలేకపోయింది. ఆర్నెల్ల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 54.35శాతం, కాంగ్రెస్ 18.91శాతం సాధించి ఓటు బ్యాంకును మెరుగుపరుచుకున్నాయి. ఆప్ మాత్రం 24.17 శాతం ఓట్లకుపడిపోయింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో జననాడి ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికంగా మారింది. ఈ మూడు పార్టీలకు న్యూఢిల్లీ నియోజకవర్గం అత్యంతకీలకంగా మారింది.
ఇక్కడ ఆప్ అధినేత కేజ్రీవాల్, బీజేపీ నుంచి మాజీ ఎంపీ, మాజీ సీఎం సాహెబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేశ్ వర్మ, కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ, మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ పోటీ చేయలేదు. ఈసారి ఆ పార్టీ పర్వేశ్‌ను నిలబెట్టడం, 2013లో షీలా దీక్షిత్‌ను ఓడించి అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్‌ను ఢీకొనేందుకు ఆమె కుమారుడు సందీ్‌పను కాంగ్రెస్ బరిలోకి దింపడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. ఆప్ నుంచి కేజ్రీవాల్ ఒక్కరే ప్రచారం చేస్తుండగా బీజేపీ, కాంగ్రెస్ నుంచి పలువురు జాతీయ స్థాయి నేతలు ప్రచారం చేస్తున్నారు. బీజేపీ తరఫున ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, యూపీ సీఎం యోగి సహా పలు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకముందే నరేంద్రమోదీ జనవరి 3న రాంలీలా మైదానంలో పార్టీ ప్రచారాన్ని ప్రారంభించి భారీ ఎత్తున ప్రాజెక్టులు ప్రకటించారు. కాంగ్రెస్ తరఫున లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంకా గాంధీ, పార్టీ అధ్యక్షుడు ఖర్గే, సచిన్ పైలట్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. ఇటీవల సీలంపూర్‌లో రాహుల్ జరిపిన ర్యాలీకి పెద్ద ఎత్తున ప్రజాస్పందన లభించింది.
సోమవారం న్యూఢిల్లీ నియోజకవర్గంలో సందీప్ దీక్షిత్ మద్దతుగా పాదయాత్ర చేస్తున్న రాహుల్ ఇతర నియోజకవర్గాల్లో కూడా పాదయాత్రలు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. షీలాదీక్షిత్ హయాంలో ఢిల్లీలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రధానంగా ప్రచారానికి ఉపయోగించుకుంటోంది. ఢిల్లీలో బీజేపీ కంటే ఆప్ పార్టీయే తమకు ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో.. జాతీయ స్థాయిలో బీజేపీని తీవ్రంగా విమర్శించే రాహుల్, ఇతర కాంగ్రెస్ నేతలు ఈసారి కేజ్రీవాల్‌నే లక్ష్యంగా చేసుకున్నారు. తమకు గతంలో మద్దతుగా నిలిచిన మురికివాడల ప్రజలు, దళితులు, మైనారిటీలు ఆప్‌వైపు తరలడంతో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్‌పైనే ప్రధానంగా విమర్శలు చేస్తున్నారు. ఈసారి ముస్లింలు పూర్తిగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయి. ఇక దాదాపు అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున స్వతంత్ర అభ్యర్థులు, చిన్నా చితక పార్టీల నేతలు పోటీకి దిగడంతో ఆ చీలే ఓట్లు ఎక్కడ దెబ్బ కొడతాయోనని 3 పార్టీలూ ఆందోళన చెందుతున్నాయి. మొత్తం 70 నియోజకవర్గాల్లో 980 మంది అభ్యర్థులు 1521 నామినేషన్లు దాఖలు చేయగా 1040 నామినేషన్లను ఎన్నికల సంఘం ఆమోదించింది.
ఉచిత వరాల మధ్య ఓటర్లు ఎటువైపు?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు పెద్ద ఎత్తున ఉచిత వరాలపై హామీలు గుప్పిస్తుండటంతో ప్రజలు ఏ పార్టీవైపు ఆకర్షితులవుతారన్న విషయం అంచనా వేయడం కష్టంగా మారింది. ఢిల్లీ ఎన్నికల ఘట్టం ప్రారంభమైన కొద్దిరోజులకే 8వ పే కమిషన్‌ను నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం వల్ల ఢిల్లీలో అత్యధికంగా ఉన్న ప్రభుత్వోద్యోగులు తమకు అనుకూలంగా మారతారని బీజేపీ ఆశాభావంతో ఉంది. మహిళలకు నెలకు రూ. 2,500 చొప్పన చెల్లిస్తామని, గర్భిణులకు రూ. 21వేలతో పాటు ఆరు న్యూట్రిషన్ కిట్లను అందిస్తామని, రూ. 500కే పేదలకు ఎల్పీజీ సిలిండర్లు సరఫరా చేస్తామని బీజేపీ ప్రకటించింది. ఆప్ కూడా మహిళలకు నెలకు రూ. 2,500 చెల్లిస్తామని, వృద్ధులకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా చికిత్స అందిస్తామని, ఉచిత విద్యుత్తు, నీటి సరఫరా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం,ఆడపిల్ల వివాహానికి రూ.లక్ష చెల్లిస్తామని ప్రకటించింది. తాజాగా అద్దె ఇళ్లలో నివసించేవారందరికీ ఉచిత విద్యుత్తు, నీటి సరఫరా కల్పిస్తామనీ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ కూడా రూ. 500కు గ్యాస్ సిలిండ ర్, ఉచిత రేషన్ కిట్, 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు హామీలను గుప్పించింది.