Drug Trafficking: స్కూల్ బ్యాగ్‌లో 5 కిలోల హ్యాష్ ఆయిల్
ABN , Publish Date - Oct 18 , 2025 | 05:21 AM
పోలీసుల కళ్లుగప్పి మాదక ద్రవ్యాల రవాణా చేసేందుకు అక్రమార్కులు మైనర్లను....
ఘట్‌కేసర్ రైల్వేస్టేషన్‌లో పోలీసులకు పట్టుబడ్డ 17 ఏళ్ల బాలుడు
వైజాగ్ నుంచి రైలులో హైదరాబాద్‌కు రాక
దొరికిన సరుకు విలువ రూ.1.15 కోట్లు
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): పోలీసుల కళ్లుగప్పి మాదక ద్రవ్యాల రవాణా చేసేందుకు అక్రమార్కులు మైనర్లను వాడేస్తున్నారు. మాయమాటలు చెప్పి డబ్బు ఎర వేసి పిల్లలతో తప్పుడు పనులు చేయిస్తున్నారు. ఇలా స్కూల్ బ్యాగులో రూ.1.15 కోట్ల విలువైన 5.10 కిలోల హ్యాష్ ఆయిల్(గంజాయి నుంచి తయారైన ద్రవం)పెట్టుకుని వైజాగ్ నుంచి రైలులో హైదరాబాద్‌కు వచ్చిన ఓ 17 ఏళ్ల బాలుడు పోలీసులకు చిక్కాడు. ఘట్‌కేసర్ రైల్వేస్టేషన్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను నేరేడ్‌మెట్ కమిషనరేట్‌లో శుక్రవారం సీపీ సుధీర్ బాబు మీడియాకు వెల్లడించారు. ఒడిషా చిత్రకొండప్రాంతానికి చెందిన దేబేంద్ర జోడియా అలియాస్ శ్రీను.. గంజాయి నుంచి హ్యాష్ ఆయిల్ తీసి దానిని తెలుగు రాష్ట్రాల్లో పెడ్లర్లకు సరఫరా చేస్తుంటాడు. పోలీసులకు చిక్కకుండా గంజాయి, హ్యాష్ ఆయిల్ రవాణా చేసేందు కు దేబేంద్ర మైనర్లను వాడుతుంటాడు. పెద్ద మొత్తంలో డబ్బు ఆశ చూపి మైనర్లతో తన పని చేయించుకుంటుంటాడు. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన ఓ మైనర్ బాలుడు (17) కూడా దేబేంద్ర మాయలో పడ్డాడు. ఆరో తరగతి దాకా చదివి ప్రస్తుతం తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయ పనులు చేసుకుంటున్న ఆ బాలుడితో పరిచయం పెంచుకున్న దేబేంద్ర అతడిని డ్రగ్స్ సరఫరా నెట్‌వర్క్‌లో చేర్చుకున్నాడు. చిన్నచిన్న ప్యాకెట్లలో హ్యాష్ ఆయిల్ ఇచ్చి వైజాగ్, విజయవాడ వంటి ప్రాంతాలకు పంపించేవాడు. ఇదే క్రమంలో హైదరాబాద్‌కు 5.10 కిలోల హ్యాష్ ఆయిల్‌ను ఆ బాలుడితో పంపాడు. ఓ స్కూల్ బ్యాగులో హ్యాష్ ఆయిల్ ప్యాకె ట్లు పెట్టుకుని వైజాగ్‌లో రైలు ఎక్కిన బాలుడు పలు రైళ్లు మారి బుధవారం ఉదయం ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్‌లో దిగాడు. సరుకు తీసుకొనే వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఎస్‌ఓటీ పోలీసులు.. బాలుడిని అదుపులోకి తీసుకుని, 5.10 కిలోల హాష్ ఆయిల్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఆ బాలుడు హ్యాష్‌ఆయిల్‌తో హైదరాబాద్ రావడం ఇదే తొలిసారి. కాగా, డ్రగ్స్ సరఫరా చేస్తూ మైనర్లు పట్టుబడితే కఠిన శిక్షలుండవని, వారిని సులభంగా బయటకు తేవచ్చనే ఆలోచనతో డ్రగ్స్ ముఠాలు పిల్లలను వాడుతున్నాయని సీపీ సుధీర్ బాబు పేర్కొన్నారు. కానీ, డ్రగ్స్ సరఫరా చేస్తున్న మైనర్లకూ కఠిన శిక్షలు పడుతున్నాయని సీపీ హెచ్చరించారు. ప్రస్తుత కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు దేబేంద్రను త్వరలోనే అరెస్టు చేస్తామని ప్రకటించారు.