Sabarimala Temple: శబరిమల చోరీలో 400 గ్రాముల పసిడి స్వాధీనం
ABN , Publish Date - Oct 26 , 2025 | 05:30 AM
శబరిమల అయ్యప్ప ఆలయ ద్వారపాలక విగ్రహాల బంగారు తాపడానికి వినియోగించిన పసిడి చోరీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) భారీ పురోగతి సాధించింది.
న్యూఢిల్లీ/బెంగళూరు/బళ్లారి, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): శబరిమల అయ్యప్ప ఆలయ ద్వారపాలక విగ్రహాల బంగారు తాపడానికి వినియోగించిన పసిడి చోరీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) భారీ పురోగతి సాధించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, అయ్యప్ప ఆలయ పూజారిగా ప్రచారం చేసుకున్న ఉన్నికృష్ణన్ పొట్టి ఇంటి నుంచి రూ.2 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. పొట్టి నుంచి పసిడిని కొనుగోలు చేసిన బళ్లారికి చెందిన వ్యాపారి గోవర్ధన్ నుంచి 400 గ్రాముల బంగారంతో పాటు కొన్ని పసిడి నాణేలను కూడా స్వాధీనం చేసుకున్నారు. బళ్లారిలో ‘రొద్దమ్ జ్యువెలరీ’ పేరుతో వ్యాపారం చేస్తున్న గోవర్ధన్‌ను అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నట్టు సిట్ ఎస్పీ శశిధరన్ తెలిపారు. సిట్ కథనం ప్రకారం.. 2019లోనే 476 గ్రాముల బంగారాన్ని గోవర్ధన్‌కు పొట్టి విక్రయించారు. వీరిద్దరి మధ్య పలు ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు ఖాతాలు స్పష్టం చేశాయి. వీరు ప్రత్యేక నెట్ వర్క్‌ను ఏర్పాటు చేసుకుని లావాదేవీలు సాగించారు. చెన్నైకి చెందిన ‘స్మార్ట్ క్రియేషన్స్’ మధ్యవర్తిగా వ్యవహరించింది. కల్పేష్ అనే వ్యక్తి పొట్టి సూచనల మేరకు ఈ వ్యవహారాన్ని నడిపించారు. అయితే, పొట్టి అభ్యర్థన మేరకు అయ్యప్ప ఆలయం ద్వారానికి మరమ్మతులు చేశానని, ద్వారపాలకుల మరమ్మతుల గురించి తనకేమీ తెలియదని ‘రొద్దమ్ జ్యువెలరీ’ యజమాని గోవర్ధన్ సిట్‌కు చెప్పారు.