Indian nationals : మళ్లీ సంకెళ్లతోనే..
ABN , Publish Date - Feb 17 , 2025 | 05:17 AM
సరైన పత్రాలు లేకుండా అక్రమంగా అమెరికాకు వెళ్లిన 228 మంది భారతీయులను తాజాగా ఆ దేశం వెనక్కి పంపింది. శని, ఆదివారాల్లో రెండు విడతలుగా అమెరికా సైనిక విమానాల్లో వీరిని భారత్‌కు తీసుకొచ్చారు. పంజాబ్‌లోని అమృత్‌సర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆ విమానాలు

తీరు మార్చుకోని అమెరికా.. మలి విడతలోనూ 228 మంది
భారతీయులకు సంకెళ్లు వేసి వెనక్కి పంపిన అగ్రరాజ్యం
తలపాగా కట్టుకోవడానికీ అనుమతించలేదన్న సిక్కు వలసదారులు
తీవ్రంగా ఖండించిన శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ
భారత్‌లో ఓటింగ్ పెంపునకు కేటాయించిన 182 కోట్ల రద్దు: డోజ్
చండీగఢ్, ఫిబ్రవరి 16: సరైన పత్రాలు లేకుండా అక్రమంగా అమెరికాకు వెళ్లిన 228 మంది భారతీయులను తాజాగా ఆ దేశం వెనక్కి పంపింది. శని, ఆదివారాల్లో రెండు విడతలుగా అమెరికా సైనిక విమానాల్లో వీరిని భారత్‌కు తీసుకొచ్చారు. పంజాబ్‌లోని అమృత్‌సర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆ విమానాలు ల్యాండ్ అయ్యాయి. తమ చేతులకు సంకెళ్లు వేసి, కాళ్లను గొలుసులతో బంధించి తీసుకువచ్చారని భారతీయ వలసదారులు వాపోయారు. విమానంలో ప్రయాణ సమయమంతా తమను ఇలాగే ఉంచారని, అమృత్‌సర్‌లో విమానం దిగిన తర్వాతనే సంకెళ్లు, గొలుసులు తొలగించారని చెప్పారు. తొలి విడతలో అమెరికా వెనక్కి పంపిన భారతీయులు కూడా ఇలాంటి ఆరోపణలే చేసిన విషయం తెలిసిందే. ట్రంప్ ప్రభుత్వం అక్రమ వలసదారులపై దేశ బహిష్కరణ చర్యల్లో భాగంగా తొలి విడతలో ఈ నెల 5న 104 మంది భారతీయులను సైనిక విమానం సీ-17లో వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. రెండో విమానం 116 మందితో శనివారం రాత్రి 11.30 గంటలకు, మూడో విమానం 112 మందితో ఆదివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో అమృత్‌సర్‌లోనే దిగాయి. శనివారం దిగిన వారి వివరాలు పరిశీలించిన తర్వాత ఆదివారం సాయంత్రం ఇళ్లకు పంపారు. ఇక ఆదివారం దిగిన వారి వివరాలు పరిశీలించే ప్రక్రియ మొదలైంది. రెండో విడత విమానంలో 65 మంది పంజాబ్, 33 మంది హరియాణాకు చెందినవారు ఎక్కువగా ఉన్నారు. ఇక మూడో విమానంలో హరియాణాకు చెందిన 44 మంది, గుజరాత్‌కు చెందిన 33 మంది, పంజాబ్ నుంచి 31 మంది ఉన్నారు. ఇదిలా ఉండగా, రెండో విమానంలో వచ్చిన సిక్కుల్లో ఎవరూ తలపాగా చుట్టుకోలేదు. అందుకు అమెరికా అధికారులు అనుమతించలేదని సిక్కు వలసదారులు తెలిపారు. దీనిపై శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. చట్ట ప్రకారం అమెరికాకు తీసుకెళ్తామని చెప్పి, తమ వద్ద పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుని ట్రావెల్ ఏజెంట్లు మోసం చేశారని వలసదారులు వెల్లడించారు. డైరెక్ట్ ఫ్లయిట్‌లో అమెరికాకు పంపిస్తామని ట్రావెల్ ఏజెంట్ నమ్మించి, ‘డంకీ రూట్’ ద్వారా తీసుకెళ్లారని పంజాబ్‌కు చెందిన దల్జీత్ సింగ్ చెప్పాడు. పిల్లల భవిష్యత్తు బాగుంటుందనే ఆశతో పొలాలు తాకట్టు పెట్టి కొందరు, పొలాలు, పశువులు అమ్మి మరికొందరు తల్లిదండ్రులు ఆ డబ్బుతో అమెరికాకు పంపారు.
ఎయిర్‌పోర్టులోనే ఇద్దరి అరెస్ట్
రెండో విడతలో అమెరికా నుంచి వచ్చినవారిలో ఇద్దరు యువకులు ఓ హత్య కేసులో నిందితులుగా ఉన్నారు. పంజాబ్‌లోని పటియాలా జిల్లా రాజ్‌పురాకు చెందిన సందీప్ సింగ్ అలియాస్ సన్నీ, ప్రదీప్ సింగ్‌లను పోలీసులు విమానాశ్రయంలోనే అరెస్ట్ చేశారు. 2023లో రాజ్‌పురా పోలీస్ స్టేషన్‌లో వారిపై హత్య కేసు నమోదైంది.
సంకెళ్లతో మోదీ కార్టూన్!
తమిళ వెబ్ పత్రిక ‘వికటన్’లో ప్రచురణ
బీజేపీ ఫిర్యాదుతో పత్రిక పోర్టల్‌ను
నిలిపివేసిన కేంద్ర ప్రసార శాఖ
చెన్నై, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): అమెరికా నుంచి భారతీయులను సంకెళ్లు వేసి తరలిస్తున్న ఘటనపై ప్రధాని మోదీ మౌనం వహించడాన్ని ప్రశ్నిస్తూ కార్టూన్ ప్రచురించిన తమిళ డిజిటల్ మ్యాగ్‌జైన్ ‘వికటన్’ పోర్టల్ ప్రసారాలు గత రెండు రోజులుగా నిలిచిపోయాయి. ఈనెల 10వ తేదీన వికటన్ వెబ్ మ్యాగజైన్‌లో... అమెరికా అధ్యక్షుడి ముందు ప్రధాని మోదీ సంకెళ్లతో కూర్చున్నట్లు కార్టూన్ ప్రచురితమైంది. ఇది మోదీని కించపరిచేలా ఆ కార్టూన్ ఉందంటూ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఈనెల 15న కేంద్ర సమాచార శాఖ మంత్రి ఎల్ మురుగన్‌కు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే, ఆ మ్యాగజైన్ పోర్టల్ ప్రసారాలు నిలిచిపోయాయి. వెబ్‌సైట్‌ను బ్లాక్ చేయడానికి గల కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ సంప్రదిస్తామని మ్యాగజైన్ నిర్వాహకులు పేర్కొన్నారు. వికటన్ వెబ్ పోర్టల్ ప్రసారాలను నిలిపివేయడాన్ని తమిళనాడు సీఎం స్టాలిన్, తమిళగ వెట్రి కళగం పార్టీ నేత, నటుడు విజయ్, కాంగ్రెస్ పార్టీ తమిళనాడు అధ్యక్షుడు సెల్వపెరుంతగై సహా పలువురు తమిళనాడు నేతలు తీవ్రంగా ఖండించారు. బీజేపీ ఫాసిస్టు ధోరణికి ఇదే నిదర్శనమని స్టాలిన్ అన్నారు.