టాప్-20 కాలుష్య నగరాల్లో 13 భారత్‌లోనే
ABN , Publish Date - Mar 12 , 2025 | 05:55 AM
ప్రపంచంలోని 20 అత్యంత కాలుష్య నగరాల్లో 13 భారత్‌లోనే ఉన్నాయని తాజా నివేదిక వెల్లడించింది. వీటిలో మేఘాలయలోని బర్నిహాట్ నగరం అగ్రస్థానంలో ఉందని తెలిపింది.

న్యూఢిల్లీ, మార్చి 11: ప్రపంచంలోని 20 అత్యంత కాలుష్య నగరాల్లో 13 భారత్‌లోనే ఉన్నాయని తాజా నివేదిక వెల్లడించింది. వీటిలో మేఘాలయలోని బర్నిహాట్ నగరం అగ్రస్థానంలో ఉందని తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత కలుషిత రాజధాని ఢిల్లీ అని ఈ నివేదిక పేర్కొంది. స్విస్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ ‘ఐక్యూఎయిర్’.. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024ను మంగళవారం విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం 2024లో ప్రపంచంలోనే అత్యంత కాలుష్య దేశాల్లో భారత్ ఐదో స్థానంలో నిలిచింది. 2023తో పోలిస్తే (మూడో ర్యాంకు) పరిస్థితి కాస్త మెరుగైంది.
ప్రపంచంలోని టాప్-20 కాలుష్య నగరాల్లో నాలుగు పాకిస్థాన్‌లో ఉండగా, చైనా, కజకిస్థాన్, చాద్ దేశాల్లో ఒక్కో నగరం ఉన్నాయి. ఈ జాబితాలో భారత్‌లోని బర్నిహాట్‌తోపాటు ఢిల్లీ, ముల్లాన్‌పూర్, ఫరీదాబాద్, లోని, న్యూఢిల్లీ, గురుగావ్, గంగానగర్, గ్రేటర్ నోయిడా, భివాడి, ముజఫర్‌నగర్, హనుమాన్‌గఢ్, నోయిడా ఉన్నాయి. బర్నిహాట్ నగరం అసోం-మేఘాలయ సరిహద్దులో ఉంది. ఈ ప్రాంతంలో ఇనుము, ఉక్కు కర్మాగారాలు ఎక్కువగా ఉన్నాయి.