Share News

Ujjwala Yojana: ఉజ్వలకు రూ.12 వేల కోట్లు

ABN , Publish Date - Aug 09 , 2025 | 05:15 AM

కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. శుక్రవారం ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన

Ujjwala Yojana: ఉజ్వలకు రూ.12 వేల కోట్లు

  • 2025-26 సంవత్సరానికి కేటాయింపు

  • సాంకేతిక విద్యా సంస్థల అభివృద్ధికి ఎంఈఆర్‌ఐటీఈ.. రూ.4,200 కోట్లు

  • ప్రభుత్వరంగ చమురు సంస్థలకు 30 వేల కోట్లు.. కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయాలు

న్యూఢిల్లీ, ఆగస్టు 8: కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. శుక్రవారం ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్‌ ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై)ను కొనసాగించేందుకు ఆమోదం తెలిపింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ పథకానికి రూ.12,000 కోట్లు కేటాయించింది. పీఎంయూవైతో దేశవ్యాప్తంగా 10.33 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. దేశంలోని పేద మహిళలకు ఎల్పీజీ కనెక్షన్లు అందించేందుకు గాను 2016 మేలో ఈ పథకాన్ని ప్రారంభించారు. 14.2 కిలోల వంట గ్యాస్‌ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ ఇస్తూ, ఏడాదికి 9 సిలిండర్ల వరకు అందజేస్తున్నారు. మరోవైపు సాంకేతిక విద్యా సంస్థల అభివృద్ధికి ఉద్దేశించిన ‘మల్టీడిసిప్లినరీ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ఇన్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఎంఈఆర్‌ఐటీఈ)’ పథకానికి కూడా కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. 2025-26 నుంచి 2029-30 ఆర్థిక సంవత్సరం వరకు ఈ పథకం అమలు కోసం రూ.4,200 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. దీనికి తోడు మరో రూ.2100 కోట్లు ప్రపంచ బ్యాంకు నుంచి రుణంగా తీసుకోనుంది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా ఉన్న 275 ప్రభుత్వ, ఎయిడెడ్‌ సాంకేతిక విద్యా సంస్థలకు సాయం అందించనున్నారు. నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలను పెంచడమే ప్రధాన లక్ష్యంగా చేపడుతున్న ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 7.5 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనున్నట్లు అంచనా. వీటితోపాటు అసోం, త్రిపురలకు రూ.4,250 కోట్లతో ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ, తమిళనాడులో ‘మరక్కానం-పుదుచ్చేరి’ నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి క్యాబినెట్‌ ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు.

Updated Date - Aug 09 , 2025 | 05:15 AM