బీజాపూర్ ఎన్‌కౌంటర్ మృతుల్లో ఐదుగురు మహిళలు
ABN , Publish Date - Jan 18 , 2025 | 04:57 AM
ఛత్తీ్‌సగఢ్ బీజాపూర్ జిల్లా పూజారికాంకేర్ అడవుల్లో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారని, మృతులను గుర్తిస్తున్నామని బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ తెలిపారు.

చర్ల, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): ఛత్తీ్‌సగఢ్ బీజాపూర్ జిల్లా పూజారికాంకేర్ అడవుల్లో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారని, మృతులను గుర్తిస్తున్నామని బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్‌కౌంటర్ వివరాలను వెల్లడించారు. సౌత్‌బస్తర్ డివిజన్‌లోని మల్లంపేట, మారేడుబాక అడవుల్లో పీఎల్‌జీఏ మొదటి బెటాలియన్ నాయకుడు హిడ్మాతో పాటు ఇతర సభ్యులు ఉన్నట్లు సమాచారం అందడంతో బీజాపూర్, సుకుమా, దంతెవాడ జిల్లాలకు చెందిన డీఆర్‌జీ, కోబ్రా బలగాలు కూబింగ్ చేపట్టాయన్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కాల్పులు జరిగాయని, అనంతరం ఘటనా స్థలాన్ని పరిశీలించగా 12 మంది నక్సలైట్ల మృతదేహాలు లభించాయని చెప్పారు. వీరిలో ఐదుగురు మహిళలు ఉన్నారని, మృతదేహాలను బీజాపూర్ తరలించామని తెలిపారు. కాగా, హిడ్మా కోసం బలగాలు అడవులను జెల్లెడ పడుతున్నాయి. ఇదిలా ఉండగా, ప్రజాస్వామ్యానికి అతి పెద్ద శత్రువైన నక్సలిజం అంతానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్రం హోం శాఖ శుక్రవారం ప్రకటించింది.