Gallantry Service Medals : ఈ ఏడాది 1090 మంది సిబ్బందికి శౌర్య, సేవా పతకాలు
ABN , Publish Date - Aug 14 , 2025 | 11:24 AM
ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది కేంద్రం 1,090 మంది సిబ్బందికి శౌర్య, సేవా పతకాలు ప్రదానం చేయనుంది. పోలీసు, అగ్నిమాపక సేవలు, హోమ్ గార్డ్, సివిల్ డిఫెన్స్, కరెక్షనల్ సర్వీసెస్ రంగాలకు సంబంధించి..
న్యూఢిల్లీ, ఆగస్టు 14 : 2025 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్రం 1,090 మంది సిబ్బందికి శౌర్య, సేవా పతకాలు ప్రదానం చేయనుంది. పోలీసు, అగ్నిమాపక సేవలు, హోమ్ గార్డ్, సివిల్ డిఫెన్స్, కరెక్షనల్ సర్వీసెస్(జైళ్ల శాఖ) నుండి మొత్తం 1,090 మంది సిబ్బందికి ఈ అవార్డులు ప్రదానం చేయనున్నారు. వారి అసాధారణ కృషి, విధుల పట్ల అంకితభావం చూపించిన వారికి ఈ శౌర్య, సేవా పతకాలు ప్రదానం చేస్తారు.
ఈ గౌరవాలలో 233 శౌర్య పతకాలు (GM), 99 రాష్ట్రపతి విశిష్ట సేవ పతకాలు (PSM), 758 మెరిటోరియస్ సర్వీస్ పతకాలు (MSM) ఉన్నాయి. విధి నిర్వహణలో ఎదుర్కొనే ప్రమాదాలను పరిగణనలోకి తీసుకుని.. ప్రాణాలను కాపాడటం, ఆస్తిని రక్షించడం, నేరాలను నిరోధించడం లేదా నేరస్థులను పట్టుకోవడంలో అరుదైన లేదా స్పష్టమైన ధైర్యసాహసాలకు శౌర్య పతకాన్ని ప్రదానం చేస్తారు.
ఈ ఏడాది ఇవ్వబోతున్న 233 శౌర్య పురస్కారాలలో 152 మంది జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి చెందినవారు. 54 మంది వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల నుండి, ముగ్గురు ఈశాన్య ప్రాంతాల నుండి, 24 మంది ఇతర ప్రాంతాల నుండి ఉన్నారు. గ్రహీతలలో 226 మంది పోలీసు సిబ్బంది, ఆరుగురు అగ్నిమాపక సేవల నుండి, ఒకరు హోమ్ గార్డ్ అండ్ సివిల్ డిఫెన్స్ నుండి ఉన్నారు.
ఇక, మెరిటోరియస్ సర్వీస్ పతకం విధుల పట్ల అంకితభావం చూపించిన వారికి ప్రదానం చేస్తారు. 99 PSM గ్రహీతలలో, 89 మంది పోలీసు సేవల నుండి, ఐదుగురు అగ్నిమాపక సేవల నుండి, ముగ్గురు సివిల్ డిఫెన్స్ ఇంకా హోమ్ గార్డ్ నుండి, ఇద్దరు కరెక్షనల్ సర్వీసెస్ నుండి ఉన్నారు. 758 మంది ఎంఎస్ఎం గ్రహీతలలో, 635 మంది పోలీస్ సర్వీసెస్‌కు, 51 మంది ఫైర్ సర్వీసెస్‌కు, 41 మంది సివిల్ డిఫెన్స్ ఇంకా హోమ్ గార్డ్‌కు, 31 మంది కరెక్షనల్ సర్వీసెస్‌కు చెందినవారు.