Reporting Dirty Toilets: అపరిశుభ్ర మరుగుదొడ్డి ఫొటోకు రూ.1,000 ఫాస్టాగ్ బహుమతి
ABN , Publish Date - Oct 14 , 2025 | 05:29 AM
టోల్ ప్లాజాల వద్ద పరిశుభ్రత పాటించేలా ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత జాతీయ రహదారుల ప్రాధికార.....
ఈ నెల 31 వరకు అమలు..ఎన్‌హెచ్‌ఏఐ ప్రకటన
న్యూఢిల్లీ, అక్టోబరు 13: టోల్ ప్లాజాల వద్ద పరిశుభ్రత పాటించేలా ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) పలు చర్యలు తీసుకుంటోంది. టోల్ ప్లాజాల వద్ద తమ నిర్వహణలోని మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉన్నాయన్న సమాచారం పంపేవారికి బహుమతి ఇవ్వనున్నట్టు ప్రకటించింది. రూ. వెయ్యి విలువ చేసే మొత్తాన్ని ఫాస్టాగ్ అకౌంట్‌లో రీఛార్జి చేయనుంది. జాతీయ రహదారిపై ప్రయాణించేవారు అపరిశుభ్రంగా ఉన్న మరుగుదొడ్లను గమనిస్తే అందుకు సంబంధించిన ఫొటోనే ‘రాజ్ మార్గ్ యాత్ర’ యాప్‌లో పోస్టు చేయాల్సి ఉంటుంది. వినియోగదారుడి పేరు, లొకేషన్, వాహనం రిజిస్ట్రేషన్ నెంబరు, ఫోన్ నెంబరు వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. అర్హత సాధించిన ఫొటోను ఎంపిక చేసిన అనంతరం రూ. వెయ్యి సంబంధిత వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబరు (వీఆర్‌ఎన్)కు అనుసంధానమైన ఫా స్టాగ్‌కు జమ అవుతాయి. ఈ కార్యక్రమం ఈ నెల 31 వరకు అమల్లో ఉంటుంది.