Coffee: అక్కడ.. కప్పు కాఫీ... రూ.60 వేలు!
ABN , Publish Date - Oct 26 , 2025 | 01:43 PM
చేతిలో యాభై రూపాయలుంటే సాధారణ హోటల్‌లో కాఫీ తాగొచ్చు. పర్సులో ఐదొందలుంటే స్టార్‌బక్స్‌లో కాఫీ రుచి చూడొచ్చు. అయితే దుబాయ్‌లోని ఒక కేఫ్‌లో కప్పు కాఫీ తాగాలంటే... అరలక్షకు పైగా చెల్లించాల్సిందే. ఎందుకంటే... ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ అదే మరి.
చేతిలో యాభై రూపాయలుంటే సాధారణ హోటల్‌లో కాఫీ తాగొచ్చు. పర్సులో ఐదొందలుంటే స్టార్‌బక్స్‌లో కాఫీ రుచి చూడొచ్చు. అయితే దుబాయ్‌లోని ఒక కేఫ్‌లో కప్పు కాఫీ తాగాలంటే... అరలక్షకు పైగా చెల్లించాల్సిందే. ఎందుకంటే... ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ అదే మరి.
దుబాయ్ అంటేనే విలాసవంతమైన నగరం. ఆకాశాన్ని తాకేలా భవనాలు, కళ్లు చెదిరే షాపింగ్‌మాల్స్‌తో భూతలస్వర్గంగా పేర్కొంటారు పర్యాటకులు. అలాంటి దుబాయ్ నగరం తాజాగా కాఫీ ధరతోనూ వార్తల్లోకెక్కింది. అక్కడి ‘రోస్టర్స్ స్పెషాలిటీ’ కాఫీ హౌజ్‌లో ఒక కప్పు కాఫీ తాగాలంటే తక్కువలో తక్కువగా అర తులం బంగారం అమ్మాలి! ఇటీవల సదరు కాఫీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీగా ప్రపంచ రికార్డుల్లోకి ఎక్కింది. విలాసవంతులకు మాత్రమే అందుబాటులో ఉండే ‘పనామా ఎస్మెరల్డా గిషియా బీన్స్’తో ఈ కాఫీ తయారుచేస్తారు.

ఈ కాఫీ అందించే గ్లాసుకు కూడా ప్రత్యేకత ఉందండోయ్... కాఫీ ప్రియులకు ఎడో కిర్కో క్రిస్టల్ గ్లాస్‌లో కాఫీని అందిస్తారు. వేడి వేడి ఈ కాఫీ సిప్ చేస్తే... ఆ రుచికి ఎవ్వరైనా ఫిదా కావాల్సిందేనని అంటున్నారు నిర్వాహకులు. ఈ కాఫీతో పాటు టిరమిసు, చాక్లెట్ ఐస్‌క్రీమ్, ప్రత్యేకంగా తయారుచేసిన చాక్లెట్‌ను అందిస్తారు.
‘రోస్టర్స్ స్పెషాలిటీ’ కాఫీ తయారీ కోసం వీ 60 డ్రిప్పర్‌ను ఉపయోగిస్తారు. టెంపరేచర్ కంట్రోల్‌లో ఉండే కెటెల్‌ను మాత్రమే వాడతారు. దుబాయ్ మాల్‌లో ఉన్న రోస్టర్స్ స్పెషాలిటీ కాఫీ హౌజ్‌కు అద్భుతమైన కాఫీ రుచులు అందిస్తుందన్న పేరుంది.
అరుదైన కాఫీ గింజలతో...
పనామా ఎస్మెరల్డా గిషియా బీన్స్ అనే కాఫీ గింజలు ఎత్తైన ప్రదేశాల్లో మాత్రమే పండుతాయి. దీనివల్ల కాఫీ గింజలకు ప్రత్యేకమైన రుచి వస్తుందంటారు. ఇలాంటి కాఫీ గింజల తోటలు పనామాలోని బోక్వెట్ వ్యాలీలో ఉన్నాయి. గింజలు బాగా పక్వానికి వచ్చిన తరువాత నిపుణులు వాటిలో మేలురకం గింజలను ఒక్కొక్కటిగా ప్రత్యేకంగా సేకరిస్తారు. ఈ కాఫీ గింజల దిగుబడి చాలా తక్కువ పరిమాణంలో ఉంటుంది. అలాంటి అరుదైన కాఫీ గింజలతో తయారుచేసిన కాఫీ కాబట్టే అంత ధర ఉంటుంది. దుబాయ్‌లో బిలియనీర్లకు కొదువ లేదు కాబట్టి వేలకు వేలు చెల్లించైనా రుచికరమైన కాఫీ తాగుతుంటారు. కాఫీ సిప్ చేసేందుకు రోస్టర్స్ స్పెషాలిటీ కాఫీ హౌజ్‌కు వచ్చే విఐపీల కోసం ప్రత్యేక లాంజ్‌లున్నాయి. ఈ కాఫీ అత్యంత ఖరీదైన కాఫీగా ఇటీవలే గిన్నిస్ బుక్‌లోకి కూడా ఎక్కి, తన రికార్డు ఘుమఘుమలను ప్రపంచానికి చాటింది.