Drass Coldest Place: ప్రపంచంలో 2వ అత్యంత శీతల ప్రదేశం ఈ భారతీయ గ్రామమే..
ABN , Publish Date - Nov 17 , 2025 | 05:17 PM
ప్రపంచంలో రెండవ అత్యంత శీతల ప్రదేశం మన భారత్‌లోనే ఉందని మీకు తెలుసా? మరి ఈ ప్రదేశం ఎక్కడుందో, ఇక్కడి విశేషాలు ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం పదండి.
ఇంటర్నెట్ డెస్క్: ఈసారి చలికాలం జనాలకు చుక్కలు చూపిస్తోంది. రాత్రి వేళ ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతుండటంతో ప్రజలు వణికిపోతున్నారు. మరి మన దేశంలోని ఓ గ్రామంలో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు మైనస్ 40 డిగ్రీలకు చేరుకున్నాయంటే గుండెలు అదరాల్సిందే. ప్రపంచంలోనే రెండవ అత్యంత శీతల ప్రదేశంగా ఈ గ్రామానికి పేరుంది. మరి ఇదెక్కడుందో, విశేషాలు ఏమిటో తెలుసుకుందాం పదండి (Drass - Second Coldest Place on Earth).
లద్దాఖ్‌లోని ద్రాస్ సెక్టర్‌లో హిమాలయాల ఒడిలో ఉండే ఈ గ్రామం పేరు ద్రాస్. ప్రపంచంలోనే రెండవ అత్యంత శీతల ప్రదేశంగా దీనికి పేరుంది. శ్రీనగర్ నుంచి కార్గిల్‌కు వెళ్లే దారిలో ఉంటుందీ ప్రదేశం. ఇక్కడ శీతాకాలంలో ఉష్ణోగ్రతలు మైనస్ 40 డిగ్రీలకు చేరుకుంటాయి. గ్రామం మొత్తం మంచు దుప్పటి కప్పుకున్నట్టు మారిపోతుంది. జొజిలా పాస్ మొదట్లో ఈ గ్రామం ఉంది. అయితే, ఎండాకాలంలో ఇక్కడి ప్రకృతి అందాలను తిలకించేందుకు దేశం నలుమూలల నుంచి పర్యాటకులు క్యూ కడుతుంటారు. అమర్‌నాథ్ గుహ, సురు వ్యాలీకి ట్రెక్కింగ్ కూడా ఇక్కడి నుంచే ప్రారంభం కావడంతో పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా ఉంటోంది.

కార్గిల్ యుద్ధం స్మారక నిర్మాణాలున్న టైగర్ హిల్, టోటోలింగ్ వ్యూపాయింట్స్‌కు సమీపంలోనూ ఈ గ్రామం ఉండటంతో చారిత్రక ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక్కడి మన్మాన్ టాప్ వ్యూపాయింట్ నుంచి చూస్తే నియంత్రణ రేఖ కనిపిస్తుంది. ఈ గ్రామాన్ని సందర్శించే వారు సమీపంలోని బ్రిగేడ్ వార్ గ్యాలరీకి తప్పనిసరిగా వెళుతుంటారు. కార్గిల్ యుద్ధానికి సంబంధించిన ఎన్నో చిత్రాలు, ఇతర విశేషాలను ఈ గ్యాలరీలో చూడొచ్చు. కార్గిల్ యుద్ధంలో అమరులైన వారి కోసం నిర్మించిన ద్రాస్ యుద్ధ స్మారక స్థూపం ఇక్కడే ఉంది.
సుదూరాన హిమాలయాల్లో ద్రాస్ ఉన్నప్పటికీ జనాలు పెద్ద సంఖ్యలో ఇక్కడకు క్యూ కడుతుంటారు. పర్యాటకుల కోసం ఇక్కడ చిన్న చిన్న హోటల్స్ అనేకం అందుబాటులో ఉన్నాయి. ఎండాకాలంలో వెళితే హిమాలయాల అందాలను, జమ్మూకశ్మీర్ వాసుల ఆతిథ్యాన్ని ఆస్వాదించొచ్చని పర్యాటకులు చెబుతుంటారు. జూన్ -సెప్టెంబర్ మధ్య కాలం ద్రాస్ పర్యటనకు అత్యంత అనుకూలం. అటు హిమాలయాలు, ఇటు పచ్చదనం కలగలిసి ఆ ప్రదేశం స్వర్గాన్ని తలపిస్తుందని అంటుంటారు. ఇక సాహసోపేత పర్యటనలను కోరుకునే వారు చలికాలంలోనూ వెళుతుంటారు. విమానాల్లో వెళ్లే వారు లేహ్ ఎయిర్‌పోర్టులో దిగి ఆపై రోడ్డు మార్గంలో ద్రాస్‌కు వెళ్లొచ్చు. జమ్మూ తవీ స్టేషన్ వరకూ రైల్లో వెళ్లి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ద్రాస్‌కు చేరుకోవచ్చు. శ్రీనగర్, కార్గిల్ పాస్ మధ్య ద్రాస్ సెక్టర్ మీదుగా అనేక బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
ఇవి కూడా చదవండి:
పర్యటనలపై వెళ్లే భారతీయులు అత్యధికంగా మర్చిపోయే వస్తువులు ఏవో తెలుసా
టూర్‌లపై వెళ్లే వారు తమ సూట్‌కేసుల్లో పెట్టకూడని వస్తువులు ఇవీ