Worms in Tomato: టమాటాలు కొన్న సన్నీ లియోనీకి షాకింగ్ అనుభవం.. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలంటే..
ABN , Publish Date - Aug 15 , 2025 | 10:06 PM
ఇంటికి తెచ్చుకున్న టమాటాల్లో పురుగు కనబడటంతో ప్రముఖ నటి సన్నీ లియోనీ షాకైపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో కూడా షేర్ చేసింది. మరి ఇలాంటి పరిస్థితిల్లో ఏం చేయాలనే విషయంలో అనుభవజ్ఞులు ఏం చెబుతున్నారో, మంచి టమాటాలను ఎలా ఎంచుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: ప్రతి ఒక్కరికీ తాజా కూరలు, పండ్లు తినాలని ఉంటుంది. కానీ ఒక్కోసారి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూరగాయల్లో పురుగులు ఉంటాయి. ప్రముఖ నటి సన్నీ లియోనీకి తాజాగా ఇలాంటి అనుభవమే ఎదురైంది. తనకు ఎదురైన అనుభవాన్ని వివరిస్తూ ఆమె నెట్టింట వీడియో పోస్టు పెట్టింది. టమాటాను రెండు ముక్కలు చేయగానే అందులోంచి పురుగు బయటకొచ్చిన వైనాన్ని ఆమె వీడియోలో చూపించింది.
వాస్తవానికి టమాటాలు, ఇతర కూరగాయల్లో పురుగులు సాధారణమే. ఫ్రూట్ వార్మ్, లీఫ్ మైనర్స్ వంటి పురుగులు వీటిల్లో గుడ్లు పెడతాయి. ఆ తరువాత అవి టామాటాలోపలే లార్వా దశకు చేరుకుంటాయి. ఈ క్రమంలో పండులోని గుజ్జును తిని విసర్జిస్తాయి. ఫలితంగా ఆ ప్రాంతంలో నల్ల మచ్చలు ఏర్పడతాయి. అయితే, ఈ పురుగులు పక్షులకు ఉపయోగకరమని నిపుణులు చెబుతున్నారు. పక్షులకు ఈ పురుగులే ఆహారమని అంటున్నారు. ఈ పురుగుల వల్ల మనుషులకు పెద్దగా ఇబ్బంది లేకపోయినప్పటికీ వాటిపై ఉండే క్రిమిసంహారకాలు కడుపులోకి వెళితే రకరకాల అనారోగ్యాలు కలుగుతాయని హెచ్చరిస్తున్నారు.
నిపుణులు చెప్పే దాని ప్రకారం, పురుగు ఉన్న టమాటాను మరో ఆలోచన లేకుండా పారేయాలి. మిగతా టమాటాల్లో పురుగు ఉన్నదీ లేనిదీ క్షుణ్ణంగా చెక్ చేసుకోవాలి. టమాటాలను ఇంటికి తెచ్చుకున్న వెంటనే నీటితో బాగా కడగాలి. వెనిగర్ వేసిన నీటితో బాగా కడిగితే వాటిపై ఉన్న క్రిమి సంహారకాలన్నీ తొలగిపోతాయి. ఇక టమాటాలను మంచి వేడిపై వండితే బ్యాక్టీరియాతో పాటు ఇలాంటి పురుగుల వల్ల కలిగే దోషాలు కూడా తొలగిపోతాయి.
ఇక టమాటాల్లో పురుగులు రాకుండా ఉండాలంటే మంచివి ఎంచుకోవాలి. టమాటాపై ఎలాంటి మచ్చలు లేకుండా ఉండాలి. మిగల పండిన వాసన అస్సలు ఉండకూడదు. చేతితో తాకితే కాస్త గట్టిగా ఉండాలి. మరీ మృదువుగా మెత్తగా ఉందంటే లోపలు ఇలాంటి పురుగులు ఏమైనా ఉంటాయేమో అని సందేహించాలి. ఇలాంటి వాటిని ఎంచుకోకపోవడమే మంచిది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బందీ ఉండదని అనుభవజ్ఞులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
ఆరోగ్యానికి భారీ కసరత్తులు తప్పనిసరి అని భావిస్తున్నారా.. ఈ ప్రొఫెసర్ ఏం చెబుతున్నారంటే..
బీపీ ఔషధాలు పని చేయట్లేదా.. కారణాలు ఇవే..