Success Formula: మూడు సూత్రాలు... సక్సెస్ మంత్ర
ABN , Publish Date - Nov 23 , 2025 | 10:07 AM
‘హూ-రెన్-సో’ అనేది జపనీస్ వర్క్ కల్చర్‌లో ప్రాచుర్యం పొందిన సమాచార సిద్ధాంతం. ఈ ఫార్ములా ఆయా టీమ్‌ల మధ్య నమ్మకం, స్పష్టత, సహకారం పెంచుతూ మేనేజ్‌మెంట్, ఉద్యోగుల మధ్య అంతరాన్ని తగ్గిస్తోంది. ఒకరకంగా ఇది మోడ్రన్ ఆఫీస్‌కి న్యూ ఏజ్ కమ్యూనికేషన్ మంత్ర.
క్రమశిక్షణ, సమయపాలన, కమ్యూనికేషన్ అనగానే జపాన్ గుర్తుకొస్తుంది ఎవరికైనా. అనేక అంశాలకు సంబంధించి సరికొత్త పద్ధతులను కనిపెడుతున్న జపనీయులు ఇటీవల ‘హూ-రెన్-సో’ అనే సక్సెస్ ఫార్ములాకు శ్రీకారం చుట్టారు. వర్క్ ప్లేస్‌లో పనికొచ్చే ఈ నవతరం సూత్రాలు ఏమిటంటే...
‘హూ-రెన్-సో’ అనేది జపనీస్ వర్క్ కల్చర్‌లో ప్రాచుర్యం పొందిన సమాచార సిద్ధాంతం. ఈ ఫార్ములా ఆయా టీమ్‌ల మధ్య నమ్మకం, స్పష్టత, సహకారం పెంచుతూ మేనేజ్‌మెంట్, ఉద్యోగుల మధ్య అంతరాన్ని తగ్గిస్తోంది. ఒకరకంగా ఇది మోడ్రన్ ఆఫీస్‌కి న్యూ ఏజ్ కమ్యూనికేషన్ మంత్ర. ఇది ప్రధానంగా మూడు సూత్రాలపై ఆధారపడి ఉంటుంది.
1. హూ (హూకోకు):
రిపోర్ట్ చేయడం లక్ష్యం: రోజువారీ పనిలో పురోగతి, ఫలితాలు, సమస్యల గురించి మేనేజర్ లేదా టీమ్ సభ్యులకు తెలియజేయడం.

గుర్తుంచుకోవాల్సింది: కేవలం తప్పులు దొర్లినప్పుడే కాకుండా ఎప్పుటికప్పుడు వర్క్ స్టాటస్‌ను రిపోర్ట్ చేస్తుండాలి.
ఉదా: ‘సర్, ప్రాజెక్ట్ 80 శాతం పూర్తయింది. మిగిలింది వచ్చే సోమవారం కల్లా అయిపోతుంది’
2. రెన్ (రెన్‌రాకు):
సమాచారాన్ని పంచుకోవడం.
లక్ష్యం: టీమ్ మధ్య సరైన సమన్వయం ఉండడం.
గుర్తుంచుకోవాల్సింది: షెడ్యూల్ మార్పులు, క్లయింట్ అప్డేట్స్, మీటింగ్స్, ముఖ్యమైన నిర్ణయాలు వంటివి వెంటనే తెలియజేయాలి. సమాచారాన్ని సంబంధిత సభ్యులందరికీ చేరేలా చేయాలి.
ఉదా: ‘రేపటి క్లయింట్ మీటింగ్ మధ్యాహ్నం 3 గంటలకు మార్చడం జరిగింది. అందరూ ఈ విషయాన్ని గమనించగలరు.’
3. సో (సోడాన్): సలహా తీసుకోవడం
లక్ష్యం: పనిలో తప్పులు దొర్లకముందే దాని గురించి పూర్తిగా చర్చించి గైడెన్స్ తీసుకోవడం.
గుర్తుంచుకోవాల్సింది: ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవజ్ఞుల (మేనేజర్ లేదా టీమ్ లీడర్) సలహా తీసుకోవాలి.
ఉదా: ‘సర్, ఈ కొత్త టూల్‌ని ఉపయోగిస్తే ప్రాజెక్ట్ ఇంకా త్వరగా పూర్తి చేయొచ్చు. కానీ కొంత ట్రైనింగ్ అవసరం. మీరేమంటారు?’
ప్రయోజనాలివి...
- నిరంతర కమ్యూనికేషన్ వల్ల టీమ్ సభ్యులు, మేనేజర్ మధ్య పరస్పర నమ్మకం ఏర్పడుతుంది.
- సమస్యలు తొందరగా రిపోర్ట్ చేయడం వల్ల సమయం వృథా కాకుండా, నిర్ణయాలు వేగంగా తీసుకోవచ్చు.
- పనిపై స్పష్టత పెరుగుతుంది.
- ఉద్యోగులు సలహాలు తీసుకుంటూ నేర్చుకోవడం అలవాటు చేసుకుంటారు.
- రిపోర్టింగ్, కమ్యూనికేషన్ ద్వారా సమస్యలు పెద్దవికాక ముందే పరిష్కారం పొందొచ్చు.
- పారదర్శకత పెరుగుతుంది.
అమలుపర్చే విధానమిది...
- స్టేటస్ అప్‌డేట్ కోసం ప్రతీరోజూ లేదా వారానికోసారి టీమ్స్ మీటింగ్ నిర్వహించాలి.
- ఉద్యోగులు ప్రశ్నలు అడగడానికి లేదా సలహాలు కోరడానికి స్వేచ్ఛాపూరిత వాతావరణాన్ని కల్పించాలి.
- టీమ్ కమ్యూనికేషన్ కోసం స్లాక్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ లేదా అసన వంటి టూల్స్ ఉపయోగించడం బెటర్.
- మేనేజర్లు ఓపెన్‌గా స్పందించి కిందిస్థాయి ఉద్యోగులకు గైడెన్స్ ఇవ్వాలి.