Share News

Sri Krishnakanda: మట్టి పరిమళం.. ఆయన కళానైపుణ్యం..

ABN , Publish Date - Nov 02 , 2025 | 09:50 AM

ఆయన చేతిలో పడిన మట్టి మాట్లాడుతుంది. ఆ మట్టి చరిత్రను, భవిష్యత్తును కూడా చెబుతుంది.. ఆ అపురూప నైపుణ్యమున్న కుఢ్య చిత్ర కళాకారుడు ఒడిశాకు చెందిన శ్రీకృష్ణకందా. గోడలపై పెద్ద పెద్ద మట్టి చిత్రాలను అలవోకగా రూపొందించి ఆయన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు..

Sri Krishnakanda: మట్టి పరిమళం.. ఆయన కళానైపుణ్యం..

ఆయన చేతిలో పడిన మట్టి మాట్లాడుతుంది. ఆ మట్టి చరిత్రను, భవిష్యత్తును కూడా చెబుతుంది.. ఆ అపురూప నైపుణ్యమున్న కుఢ్య చిత్ర కళాకారుడు ఒడిశాకు చెందిన శ్రీకృష్ణకందా. గోడలపై పెద్ద పెద్ద మట్టి చిత్రాలను అలవోకగా రూపొందించి ఆయన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు..

- - -

‘‘నువ్వెప్పుడు చూడు.. కుంటలు, చెరువులు, మట్టిదిబ్బల చుట్టూనే తిరుగుతుంటావు..? ఏముంది మట్టిలో..? సంచులకు సంచులు నింపుకుని ఇంటికి తీసుకొస్తావ్‌? బంకమట్టితో ఇళ్లంతా ఒకటే వాసన వస్తోంది.. ’’ అంటూ కుటుంబసభ్యులు, ఇరుగుపొరుగు వాళ్లు విసుక్కునేవారు. అయినా సరే.. ‘‘మానవుడు.. మట్టిమనిషి. మట్టిలోనే పుట్టాడు.. మట్టిలోనే కలిసిపోతాడు. ఈ రెండింటి మధ్యనున్న కాలంలో కూడా ఇదే మట్టితో బతకాలి.. ఆస్వాదించాలి. ఆ పరిమళాన్ని కళలలోకి తర్జుమా చేయాలి’’ ఇలా ఏదేదో వేదాంతంలా మట్లాడేవారు శ్రీకృష్ణకందా. ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లా, మధునంద గ్రామానికి చెందిన ఆయన ఒకరకంగా మట్టి పరిమళాల మధ్య వికసించిన కుఢ్యచిత్ర కళాకారుడు.


మట్టితోనే జీవితం..

బంకమట్టి, ఎర్రమట్టి, నల్లరేగడి మట్టి, చౌడునేల మట్టి... ఏదైనా బంగారమే!. శ్రమించే రైతు చేతికి మట్టి దొరికితే తిండిగింజలు పండిస్తాడు. శ్రామికుడైతే ఇంటిని నిర్మిస్తాడు. అదే కళాకారుడైతే అద్భుత కళాఖండాలను తయారుచేస్తాడు. ఆ పనే చేశాడు శ్రీకృష్ణకందా. అందరు పేదపిల్లల్లాగే ఊరి పాఠశాలలోనే చదువుకున్నాడు. ఆ తర్వాత ఇరవై కి.మీ. సైకిల్‌పై వెళ్లి.. బాలాసోర్‌లోని కాలేజీలో చదువుకున్నాడు. సర్కారు అందించే ఉపకార వేతనాలతోనే తన కళాశాల విద్య సాగింది. ఇంట్లో తల్లిదండ్రులు నయాపైసా అందించే పరిస్థితి లేదు. తనకు చిన్నప్పటి నుంచీ కళలు అంటే ఇష్టం కాబట్టి.. గంజాం జిల్లాలోని కల్లికోట్‌లోని గవర్నమెంట్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌లో చదువుకున్నాడు.


శిల్పకళలు ఆయన ప్రత్యేక సబ్జెక్టు. ‘‘ఎక్కువమంది కళాకారులు చిత్రలేఖనం, శిల్పకళలలో రాణించాలనుకుంటారు.. కానీ నేను మాత్రం మా ఊర్లోని మట్టితోనే అద్భుతాలు చేయాలనుకున్నాను...’’ అంటున్న శ్రీకష్ణ తమ ఊరి చుట్టుపక్కలున్న రకరకాల మట్టిని సేకరించి అనేక ప్రయోగాలు చేశాడు. కొన్ని విజయవంతమయ్యాయి.. మరికొన్ని విఫలం అయ్యాయి. అయినా నిరుత్సాహపడలేదు. ఎర్రమట్టిలోకి మరిన్ని రకాల మట్టిని కలిపి.. బొమ్మల్ని చేయడం ప్రారంభించాడు. అలా చేయగా చేయగా.. ఒక ఫార్ములా దొరికింది. రెండు రకాల మట్టిని కలిపి కుఢ్యచిత్రాలను చేయడం మొదలెట్టాడు. శ్రీకృష్ణ ప్రత్యేకత ఏంటంటే.. ఇళ్లు, కార్యాలయాలు, భవనాల గోడలకు మట్టితో కూడిన కుఢ్య చిత్రాలను వేయడం. ఇదివరకు ఇలాంటి బొమ్మలను రూపొందించే వారున్నా తక్కువే!. ఆ వెలితిని భర్తీ చేశారాయన.


book5.2.jpg

అరుదైన గుర్తింపు...

మట్టితో కూడిన కుఢ్య చిత్రాలను రూపొందించడంలో ఆరితేరారు శ్రీకృష్ణ. గోడలపై అతి పెద్ద చిత్రాలను సృష్టించే నైపుణ్యం అబ్బింది. అందులోనూ త్రీడైమెన్షన్‌ కోణంలో తీర్చిదిద్దడం ఆయన ప్రత్యేకత. ఒడిశాలోని ఓ పట్టణంలో మట్టితో కూడిన అతి పెద్ద కుఢ్య చిత్రాన్ని తయారుచేశాక శ్రీకృష్ణ పేరు పదిమందికి తెలిసింది. జైపూర్‌ జిల్లాలో కూడా బుద్ధుడి జాతక కథలపై ఆయన చేసిన భారీ కుఢ్య చిత్రం ఆకట్టుకుంది. జజత్రి కేశ్రీ వైద్యకళాశాలలో ఇప్పటికీ ఆయన భారీ చిత్రం అందరి మెప్పూ పొందుతూనే ఉంది. ఆ రోజుల్లో ఇండోనేషియా నాయకులను రక్షించడానికి.. డకోటా విమానాన్ని నడిపాడు పట్నాయక్‌.


ఆ రెస్క్యూ మిషిన్‌ దృశ్యాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు శ్రీకృష్ణ. ఇక, పంజాబ్‌లోని సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా సంగూర్‌ జిల్లా ధూరిలోని తేజ్‌ బహదూర్‌ పబ్లిక్‌స్కూల్‌లోని గోడపై అచ్చెరువొందే చిత్రాన్ని చిత్రీకరించారాయన. ‘‘నేను ఔత్సాహికుల అవసరాన్ని బట్టి.. ఆలోచనను బట్టి బొమ్మ తయారుచేయాలనుకుంటాను. ఆ క్రమంలోనే రెండుమూడు రకాల మట్టిని ఎంత శాతంలో మిళితం చేయాలో నిర్ణయించుకుని.. పని పూర్తి చేస్తాను’’ అంటాడాయన. శ్రీకృష్ణ ఇలా కేవలం కుఢ్య చిత్రాలతోనే కాకుండా.. మట్టి గ్లాసులు, ప్లేట్లు వంటివన్నీ తయారుచేసి విక్రయిస్తుంటాడు.


పనిలో పనిగా ఉత్సాహవంతులైన యువతీ యువకులకు కుఢ్యచిత్రాల రూపకల్పనలో శిక్షణ ఇస్తున్నారు. ఆ మధ్య ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ చేతుల మీదుగా అవార్డు సైతం అందుకున్నాడు. ‘‘మన దేశంలో సింధూ నాగరికత కాలం నుంచి కూడా మట్టి కళాకృతులు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో మట్టి కాళాకృతులు, గోడలపైన వర్ణచిత్రాలు వెలుగుచూశాయి. కాబట్టి ఈ కుఢ్యచిత్రకళ అత్యంత విలువైనది, ప్రాచీనమైనది. దీనిని మనందరం కాపాడుకోవాలి’’ అంటున్న శ్రీకృష్ణ కళాభిలాషను అభినందించాలి.

Updated Date - Nov 02 , 2025 | 09:50 AM