Share News

సోలో టూర్‌... సో బెటరూ

ABN , Publish Date - Nov 02 , 2025 | 10:55 AM

ఓ వైపు 2025 ముగింపునకొచ్చింది... మరోవైపు సెలవుల సీజన్‌... ఏదైనా టూర్‌కు వెళ్లాలి. సముద్రతీరాలు.... శీతల మండలాలు... పర్వతాలు.. రారమ్మని ఆహ్వానిస్తుంటాయి. స్వదేశమో, విదేశమో... ఎటు వెళ్లినా, క్షణం కూడా తీరిక లేకుండా బిజీగా చుట్టొస్తారు చాలామంది. అయితే ‘జనరేషన్‌ జెడ్‌’ టూర్లు ఇందుకు భిన్నం.

సోలో టూర్‌... సో బెటరూ

ఓ వైపు 2025 ముగింపునకొచ్చింది... మరోవైపు సెలవుల సీజన్‌... ఏదైనా టూర్‌కు వెళ్లాలి. సముద్రతీరాలు.... శీతల మండలాలు... పర్వతాలు.. రారమ్మని ఆహ్వానిస్తుంటాయి. స్వదేశమో, విదేశమో... ఎటు వెళ్లినా, క్షణం కూడా తీరిక లేకుండా బిజీగా చుట్టొస్తారు చాలామంది. అయితే ‘జనరేషన్‌ జెడ్‌’ టూర్లు ఇందుకు భిన్నం. ‘ఎటు వెళ్లాలి? ఎక్కడ బస చేయాలి? ఏం చూడాలి? ఏం తినాలి? ఏం కొనాలి?... ఇలా అన్నింటి గురించి కచ్చితమైన సమాచారంతో, తమకు నచ్చిన విధంగా టూర్లను పర్సనలైజ్డ్‌గా మార్చుకుంటున్నారు. వేగంగా మారుతోన్న ‘ట్రావెల్‌ ట్రెండ్స్‌’ పై ఈ వారం కవర్‌ స్టోరీ..

తీర్థయాత్రలు, బిజినెస్‌ యాత్రలు, కుటుంబ యాత్రలు, హనీమూన్‌ యాత్రలు, ... ఇలా టూరు ఏదైనా... కాశీకి వెళితే విశ్వేశ్వరుడిని దర్శించుకోవడం, ఆగ్రాకు వెళితే తాజ్‌మహల్‌ దగ్గర ఫొటో దిగడం, కేరళ వెళితే హౌస్‌బోట్‌లో బసచేయడం లాంటివి మామూలే. బహుశా మన ముందుతరం వాళ్లు కూడా ఇలాగే చేసి ఉంటారు. ఎక్కడికి వెళ్లినా అక్కడి పర్యాటక ప్రదేశాలన్నింటినీ వరుసగా చూసేసి, ఆ జ్ఞాపకాలను ఫొటోల్లో బంధించి... సదరు సంతోషానికి తోడుగా కాస్త అలసటనీ పోగేసుకుని ఇంటికి వస్తుంటారెవరైనా. అయితే జనరేషన్‌ జెడ్‌, మిలీనియల్స్‌ దృష్టిలో ఈ యాత్రల అర్థం పూర్తిగా వేరు.


book6.2.jpg

లక్ష్యంతో...

కేవలం టూరిస్టు ప్రదేశాన్నే కాదు, తమని తాము తెలుసుకోవడానికి... బిజీ లైఫ్‌ నుంచి బ్రేక్‌ కోసం ‘జనరేషన్‌ జెడ్‌’ ట్రావెల్‌ చేస్తోంది. ఈవిధంగా ఏదో ఒక లక్ష్యంతో యాత్రలు చేస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రముఖ ట్రావెల్‌ సంస్థ ‘స్కై స్కానర్‌’ భారతీయ పర్యాటకులపై ఇటీవల ఓ సర్వే నిర్వహించింది. ‘2026 ట్రావెలర్స్‌ ట్రెండ్స్‌’ అంటూ ఆ వివరాలను తెలియజేసింది. అంటే రాబోయే కాలంలో టూర్లు ఎలా ఉంటాయనే ట్రెండ్‌ను ఈ సర్వే చూచాయగా తెలుపుతోంది. మనవాళ్లు ఎప్పటిలాగానే ‘కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌’కు తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకునే ట్రావెల్‌ చేస్తున్నారు. అయితే తమ ప్యాషన్స్‌, ప్రాధాన్యతల ఆధారంగా ట్రిప్స్‌ను రూపొందించుకొంటున్నారు. రొటీన్‌గా అందరూ వెళ్లే ప్రదేశాలకు వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. ఏ ప్రదేశానికి వెళ్లాలి? అక్కడ ఎంత సమయం గడపాలన్న విషయాలను ముందుగానే ప్రణాళిక చేసుకుంటున్నారు. ఆయా ప్రదేశాలకు వెళ్లాలని వారిని పురిగొల్పుతున్నవి ఏమిటంటే...


book6.3.jpg

పుస్తకాల్లో చదివి...

సోషల్‌ మీడియా కాలంలో కూడా ఇలాంటి యాత్రలు ఉంటాయా అన్న ఆశ్చర్యం కలుగుతుంది కానీ ఇది వాస్తవం. ఈ రోజుల్లో 84 శాతం మంది ట్రావెలర్స్‌ పుస్తకాలు చదివి, స్ఫూర్తి చెంది... వాటిలో చర్చించిన, లేదా పేర్కొన్న ప్రదేశాల్లో పర్యటిస్తున్నారు. ఉదాహరణకు ఒక నవలలోనో, పుస్తకంలోనో ఏదైనా ప్రాంతాన్ని రచయిత ప్రస్తావిస్తే... దాన్ని చూడాలనే కుతూహలం పెరిగిపోతోంది. అక్కడికి వెళ్తున్నారు కూడా. ఇదే విషయం సర్వేలో ప్రస్ఫుటంగా వెల్లడయ్యింది. అలాగే పుస్తకాలకు, ప్రయాణాలకు అవినాభావ సంబంధం ఉందనేది తెలిసిందే. ‘వెకేషన్‌లో ఉన్నప్పుడు పుస్తకాలు చదువుతాం’ అని చెప్పేవాళ్ల సంఖ్య బాగా పెరుగుతోంది. సముద్ర తీరంలో కూర్చుని ఆడియోబుక్స్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. స్విమ్మింగ్‌పూల్‌ పక్కన కూర్చుని పుస్తకాన్ని చేతిలోకి తీసుకుంటున్నారు. అంటే ఇంట్లో కన్నా యాత్రల్లో ఎలాంటి ఆటంకాలు ఉండవని కుర్రకారు ఫిక్సయిపోతున్నారు.


book6.4.jpg

ప్రాంతం కన్నా వసతి ముఖ్యం...

ఆ ఊరు భూతల స్వర్గం... అక్కడ విహరిస్తుంటే ఏదో లోకంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది.. ఇలాంటి మాటలు చక్కని డెస్టినేషన్స్‌ గురించి రకరకాల వర్ణనలతో విన్నాం. కానీ ‘మోడ్రన్‌ ఇండియన్‌ ట్రావెలర్స్‌’ మాటలు వింటే ఆశ్చర్యపోతాం. ‘ఫలానా బొటిక్‌ హోటల్‌లో మళ్లీ మళ్లీ గడిపేందుకే ఆ నగరం వెళతాను’... ‘అక్కడి బీచ్‌ ముందున్న విల్లాలో సూర్యోదయ వేళలో యోగా చేస్తే చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటుంది’... ‘ఆ బహుళ అంతస్తుల్లో బస చేస్తే మహానగరం అంతా నా కళ్ల ముందే నిలుస్తుంది’ అని చెబుతూ... అలాంటి అనుభూతుల కోసమే మళ్లీ మళ్లీ ఆయా ప్రదేశాలకు వెళుతున్నట్టుగా చెబుతున్నారు. అంటే... నగరంలో ఉన్న ల్యాండ్‌మార్క్‌లు, పాపులర్‌ ట్రావెల్‌ ప్లేసెస్‌ ఆధారంగా కాకుండా... తాము బసచేసే ప్రదేశాన్ని బట్టి యాత్రలు చేస్తున్నారు. సుమారు 82 శాతం మంది భారతీయులు ‘ఇలాంటి యాత్రలే చేస్తున్నామ’ని తెలిపారు.


స్థానిక రుచులు

బస తరవాత ఎవరైనా ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేది ఆహారానికే. ‘ఉత్తరదేశ యాత్రల్లో అస్తమానం రొట్టెలు తినలేం. కాస్త అటుకులూ ముర్మరాలూ తీసుకువెళదాం’... ‘కూడా చిన్న కుక్కర్‌ తీసుకువెళ్లి అన్నం వండుకుందాం’ అనే రొటీన్‌ మాటలు మిలినియల్స్‌ డిక్షనరీల్లో లేవు. ఈ తరం కుర్రకారు స్థానిక రుచులను ఆస్వాదించడానికి కూడా యాత్రలు చేస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా స్థానిక ఫుడ్‌ స్ట్రీట్‌లు, ఫుడ్‌కోర్ట్‌లను విజిట్‌ చేస్తున్నారు. కిరాణ షాపులు, సూపర్‌ మార్కెట్లలో దొరికే స్నాక్స్‌, స్వీట్లను కొనుగోలు చేస్తున్నారు. విదేశీ యాత్రలు చేసే వారిలో 73 శాతం మంది స్థానిక రుచుల కోసం లోకల్‌ షాపుల దగ్గర ఆగుతున్నారని సర్వే తెలియజేస్తోంది. వీటిల్లో తాజా వంటకాలే కాదు... కొంగొత్త ఫ్లేవర్‌లో ఉన్న చాక్లెట్లు, సోడాలు, సాస్‌లు ...ఇలా ప్యాకేజ్డ్‌ ఆహార పదార్థాల లేబుల్స్‌ చూసి మరీ కొంటున్నారు. వాటిని ఆస్వాదిస్తున్నారు.


మేని మెరుపుల కోసం...

బస, ఆహారంతో పాటు మిలినియల్స్‌ టూర్లలో సౌందర్యం కూడా ప్రధాన పాత్ర వహిస్తోందంటే ఆశ్చర్యమేస్తుంది. మునుపెన్నడూ లేని విధంగా ప్రపంచవ్యాప్తంగా ‘బ్యూటీ సెన్స్‌’ బాగా పెరిగింది. మనవాళ్లు వాటికి మినహాయింపు ఏమీ కాదు. టూర్లలో కూడా బ్యూటీ ఉత్పత్తుల్ని కొనడం ఇటీవల ఎక్కువైంది. ముఖ్యంగా ఎయిర్‌పోర్ట్‌లలో డ్యూటీ ఫ్రీ షాపుల్లో మేకప్‌, స్కిన్‌ కేర్‌, వివిధ సుగంధ భరిత ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. పదిమంది భారతీయ ప్రయాణికుల్లో ఎనిమిది మంది ఇలాంటి ఎయిర్‌పోర్ట్‌, టూర్‌ షాపింగ్‌ చేస్తున్నారని సర్వే చెబుతోంది. 48 శాతం మంది ఆయా దేశాల బ్యూటీ కల్ట్‌ షాపులకి కూడా వెళుతున్నారట. 45 శాతం మంది స్థానిక బ్యూటీ పార్లర్లు, స్పాలు, సెలూన్లను తప్పక విజిట్‌ చేస్తున్నారు. స్టయిల్‌గా తయారవుతున్నారు. ఇక విదేశీ పర్యటనల్లో సౌందర్య పోషణ ఓ కీలక పరిణామంగా మారింది. యువతీ యువకులు సౌందర్య సాధనాలపై చూపుతున్న ఆసక్తికి అనుగుణంగా ఆయా బ్రాండ్లు తమ ఉత్పత్తులను మార్కెట్లోకి వదులుతున్నాయి.


book6.6.jpg

హలో ఏఐ...

ఇంత కచ్చితంగా మోడర్న్‌ ట్రావెలర్స్‌ ఎలా ప్రయాణిస్తున్నారు? అంటే... వాళ్ల దగ్గర ఉంది అబ్రకదబ్ర లాంటి మ్యాజికల్‌ ‘ఏఐ’. మునుపైతే ట్రావెల్‌ ఏజెంట్‌కు ఫోన్‌ చేసి ‘ఎక్కడెక్కడ ఏయే ప్రదేశాలున్నాయి’ అని వాకబు చేసేవారు. ఇప్పుడు అంతా ఏఐ... ‘హలో ఏఐ’ అంటే క్షణాల్లో ఏ నగరం గురించైనా సమాచారం వచ్చేస్తుంది. అంతే కాదు... ఎప్పుడు ఎక్కడికి వెళ్లాలి? ఎక్కడ బస చేయాలి? ఏం తినాలి? ఏ షాపింగ్‌ చేయాలి? అనేవి ముందుగానే తెలుసుకుంటున్నారు.. దాని ఆధారంగా బుకింగ్‌ చేసుకుంటున్నారు. అంటే నేడు ‘ఏఐ’ సరికొత్త ‘ట్రావెల్‌ ఏజెంట్‌’గా మారుతోంది. అయితే ‘ఏఐ’ ఎంత కచ్చితమైన సమాధానం ఇస్తోందన్నది తెలియడానికి మరికొంత సమయం పడుతుంది. ట్రావెలింగ్‌కి, టికెట్స్‌ను బుక్‌ చేయడానికి, ఖర్చులను సరిపోల్చడానికి ఏఐ టూల్స్‌ను వినియోగిస్టున్నట్టుగా 86 శాతం మంది సర్వేలో తెలిపారు. అయితే రాబోయే ఏడాది పర్యాటక రంగంలో ‘ఏఐ’ అత్యంత కీలకంగా మారుతుందని పరిశోధకులు చెబుతున్నారు.


ఈ పరిమాణాలన్నింటి వల్ల భవిష్యత్తులో పర్యాటకుల సంఖ్య పెరుగుతుందే కానీ తగ్గదని నిపుణులు లెక్కలేస్తున్నారు. యాత్రల్ని కూడా ఓ మోస్తరు పెట్టుబడిలా అంటే... తమ మీద, తమ కోసం, తమతో తాము సమయం గడిపేందుకు వెచ్చిస్తున్న పెట్టుబడిగా ‘జనరేషన్‌ జెడ్‌’ భావిస్తోంది. ఈ ‘న్యూ ఏజ్‌ ట్రావెల్‌’లో ఎన్ని ప్రదేశాలు, దేశాలు తిరిగామన్నది ముఖ్యం కాదు... ఎలాంటి అనుభూతుల్ని మూటకట్టుకున్నాం అన్నదే ముఖ్యం. నవతరం యాత్రల్లో కచ్చితంగా ఇదో మేలిమలుపే.

- డి.పి.అనురాధ


టాప్‌ 7

ఇంటర్నెట్‌ సెర్చ్‌ ఆధారంగా 2026లో మనవాళ్లు ఎక్కడికెళ్లాలని ప్రణాళికలు రచిస్తున్నారో ట్రావెల్‌ సంస్థలకు ఇట్టే తెలిసిపోతుంది. ఆ విధంగా 2026 టాప్‌ డెస్టినేషన్‌ లిస్టును ‘స్కై స్కానర్‌’ రూపొందించింది. ఆశ్చర్యంగా ఆయా ప్రాంతాలన్నీ కొత్తవే కావడం విశేషం. అందులోని టాప్‌ 7 ఇవే...

1. సాంస్కృతిక కేంద్రం ‘జొహ్రాత్‌’

మునుపెన్నడూ లేని విధంగా ప్రస్తుతం అసోమ్‌లోని ‘జొహ్రత్‌’ గురించి ఆన్‌లైన్‌లో తెగ వెదుకుతున్నారు. ఈ సెర్చింగ్‌లో ఒకేసారి 493 శాతం పెరుగుదల కనిపిస్తోంది. అసోమ్‌ సాంస్కృతిక కేంద్రం ‘జొహ్రాత్‌’. ప్రపంచంలోనే అతి పెద్ద నదీ ద్వీపం ‘మాజులి’ ఇక్కడే ఉంది. ‘టక్లాయి టీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌’ కూడా జొహ్రత్‌లో ఉండడం విశేషం. అటు చరిత్ర, ఇటు పచ్చని తేయాకు తోటలు జొహ్రాత్‌ను రంగులమయం చేస్తున్నాయి. ఆ వర్ణాల్లో హాయిగా గడిపాలని టూరిస్టులు ఆశపడుతున్నారు.


2. చలో ‘జాఫ్నా’

భారతీయుల్లో చాలామంది ఒక్కసారైనా మన పొరుగున ఉన్న శ్రీలంకకు వెళ్లాలని అనుకుంటారు. ప్రస్తుతం శ్రీలంకలో ఉత్తరాన ఉన్న ‘జాఫ్నా’పై అందరి దృష్టి ఎక్కువగా పడుతోంది. నక్షత్రాకార జాఫ్నా పోర్టు, బంగారు తాపడాలతో మెరిసే నల్లూరు కందస్వామి ఆలయం, స్వచ్ఛమైన నీటి మడుగులు, సముద్ర తీరాలను కాపలా కాస్తున్నట్టు ఉండే కొబ్బరి, తాటి చెట్లు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. మొన్నటిదాకా అంతర్యుద్ధం వల్ల అతలాకుతలమైన ఈ ప్రాంతం పర్యాటకంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. అక్కడి సంస్కృతి, రుచులు, వాస్తుపై దక్షిణ భారత ప్రభావం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అందుకే జాఫ్నా గురించి వెదుకుతున్న వారి సంఖ్య అమాంతం 325 శాతానికి పెరిగింది.


3. పెళ్లిళ్లకు కేరాఫ్‌...

ఒమాన్‌ రాజధాని నగరం మస్కట్‌. ఒమాన్‌ అగాధతంలో ఉన్న ఈ నగరం చుట్టూ పర్వతాలు, ఎడారి. ఓ పక్క అరేబియా సముద్ర తీరంలో పదహారో శతాబ్దపు పోర్చుగీసు పోర్టులు, మరోవైపు ఆధునిక షాపింగ్‌ మాల్స్‌ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంటాయి. పూర్తి చలువరాతి నిర్మాణమైన సుల్తాన్‌ కబూస్‌ గ్రాండ్‌ మాస్క్‌, అతి పెద్ద డోమ్‌ ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. డెస్టినేషన్‌ వెడ్డింగ్‌లకు మస్కట్‌ను ఎంచుకుంటున్న భారతీయుల సంఖ్య పెరుగుతోంది. మస్కట్‌ గురించి వాకబు చేస్తున్న భారతీయుల శాతం 211కి చేరుకుని మూడో స్థానంలో నిలిచింది.


4. సాహసాల ‘క్వీన్స్‌టౌన్‌’

పొరుగు దేశాలే కాకుండా... కాస్త దూరంగా ఉన్న న్యూజీలాండ్‌పై కూడా మనవాళ్ల దృష్టి మళ్లింది. ముఖ్యంగా అక్కడి ‘క్వీన్స్‌టౌన్‌’ని చూడాలని కలలు కంటున్నారు. క్వీన్స్‌టౌన్‌ గురించి సెర్చ్‌ చేస్తున్న వారి సంఖ్య 151 శాతానికి పెరిగింది. సాహసాలు కోరుకునే వాళ్లకి ఇది అతి పెద్ద ప్లేగ్రౌండ్‌. బంగీ జంప్‌, సీనిక్‌ ట్రెయిల్స్‌తో పాటు వైనరీలు, స్పాలు పర్యాటకుల్ని సేదతీరుస్తాయి.

5. కళల కాణాచి...

అటు కళలు, ఇటు ఆధ్యాత్మికతల మేలుకలయిక ‘చియాంగ్‌ రాయ్‌’. అందుకే థాయిలాండ్‌లోని ఈ నగరం కుర్రకారుకు ట్రావెల్‌ డెస్టినేషన్‌గా మారింది. ‘వైట్‌ టెంపుల్‌’, ‘గ్రీన్‌ టెంపుల్‌’. ఇంకా తేయాకు తోటలు అదనపు ఆకర్షణ. రెగ్యులర్‌ బ్యాంకాక్‌, పటాయా సందడిని పక్కన పెట్టి, కాస్త ప్రశాంతతను కోరుకునేవాళ్లు ‘చియాంగ్‌ రాయ్‌’ వైపు చూస్తున్నారు. అందుకే ఈ థాయి నగరం గురించి సెర్చ్‌ చేస్తున్న వారి సంఖ్య 133 శాతానికి చేరుకుంది.


6. ఆధ్యాత్మిక కేంద్రం

భారతదేశ ఆధ్యాత్మిక రాజధాని వారణాసి. జీవితంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్లాలని పర్యాటకులు ఆరాటపడతారు. ఇప్పటికీ ఈ ప్రాచీన నగరంలో ఏదో మహాత్మ్యం ఉందనేవాళ్లే అధికం. గంగా స్నానం, విశ్వేశ్వరుడి దర్శనం, గంగా హారతిని చూడడానికి నిత్యం భక్తులు వస్తూనే ఉంటారు. ఇంటర్నెట్‌లో కాశీ గురించి సెర్చ్‌ చేస్తున్న వాళ్ల సంఖ్య 120 శాతానికి పెరిగింది.

zzzz.jpg

7. వెలుగుల నగరం

మనవాళ్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తోన్న మరో టూరిస్టు డెస్టినేషన్‌ ‘మనీలా’. ఫిలిప్పీన్స్‌ రాజధాని నగరం మనీలా ఆది నుంచీ ‘గ్లోబల్‌ నగరం’గా పేరు తెచ్చుకుంది. అప్పట్లో ఆసియా, యూరోప్‌ల మధ్య వాణిజ్యం వేగంగా జరగడానికి మనీలా తోడ్పడింది. స్పానిష్‌ కొలోనియల్‌ భవనాలతో, ఆధునిక ఆకాశహర్మ్యాలు పోటీపడుతుంటాయి. విభిన్నమైన రుచులు, షాపింగ్‌ మాల్స్‌, నైట్‌ లైఫ్‌ మనీలాను కాంతివంతంగా మారుస్తున్నాయి. మనీలా గురించి వెదుకుతున్న వారి సంఖ్య 108 శాతానికి చేరుకుంది.


book6.5.jpg

సీన్‌ మారింది...

భారతీయ ట్రావెల్‌ రంగంలో మహిళల పాత్ర కీలకంగా మారుతోంది. గతంలో మగవాళ్లు ట్రిప్‌ ప్లాన్‌ చేస్తే... మహిళలు వారిని అనుసరించేవారు. ఇప్పుడు సీన్‌ మారింది... ‘సోలో ట్రిప్‌’ లేదా ‘గ్రూప్‌ టూర్స్‌’ అయినా యాత్రలను మహిళలే డిజైన్‌ చేస్తున్నారు. ట్రిప్‌ ప్లానింగ్‌లో మునుపెన్నడూ లేనంతగా మహిళల పాత్ర పెరిగిందని ‘బుకింగ్‌.కామ్‌’ వార్షిక రిపోర్టు (2025) తెలియజేస్తోంది. పది మంది మహిళల్లో నలుగురు ట్రావెల్‌ ప్లానింగ్‌లో చురుకుగా పాలుపంచుకుంటున్నారు. 33 శాతం కుటుంబ, గ్రూప్‌ ట్రావెల్స్‌ను మహిళలే స్వయంగా బుక్‌ చేస్తున్నారట. ఫ్యామిలీ టూర్లలో దాదాపు 16 శాతం టూర్లను మహిళలే రూపొందిస్తున్నారని సర్వేల్లో తేలింది. 26 నుంచి 55 ఏళ్ల మధ్య ఉన్న మహిళలు తమ కుటుంబ యాత్రలకు ట్రిప్‌ ఆర్కిటెక్ట్‌లుగా మారారు. అలాగే దిల్లీ లాంటి నగరాలలో సోలో బుకింగ్స్‌లో 70 శాతం మహిళలే ఉన్నారని ‘ద హాస్టలర్‌’ స్డడీ వెల్లడిస్తోంది. వారణాశికి మహిళల ఆధ్యాత్మిక ట్రిప్‌లు పెరుగుతున్నాయట. ఇవన్నీ యాత్రా రంగంలో వస్తున్న మార్పులకు ఉదాహరణలు.

Updated Date - Nov 02 , 2025 | 10:55 AM