ఆయన.. మూగజీవుల దాహం తీరుస్తున్నాడు..
ABN , Publish Date - Sep 28 , 2025 | 12:03 PM
ఆయన మూగజీవాలు, పక్షులఫొటోలు, వీడియోలు తీసి ముచ్చటపడలేదు. వాటి ఆక్రందన, ఆవేదన విన్నాడు... చూశాడు.. చలించాడు.. రాజస్థాన్‌లోని తాల్‌చప్పర్ లోని మెట్టపొలాలు, అటవీప్రాంతాలలో జంతుజాలం దాహం తీర్చేందుకు కృత్రిమ సరస్సుల్ని నిర్మించాడు.
ఆయన మూగజీవాలు, పక్షులఫొటోలు, వీడియోలు తీసి ముచ్చటపడలేదు. వాటి ఆక్రందన, ఆవేదన విన్నాడు... చూశాడు.. చలించాడు.. రాజస్థాన్‌లోని తాల్‌చప్పర్ లోని మెట్టపొలాలు, అటవీప్రాంతాలలో జంతుజాలం దాహం తీర్చేందుకు కృత్రిమ సరస్సుల్ని నిర్మించాడు.. సామాజిక మాధ్య మాలలో రొజుకొక రూపాయి వసూలుచేసి.. ఇంత మంచి పనిచేస్తున్న ఆ రాజస్థాన్‌వాసి శర్వన్ పటేల్...
‘‘అసలే రాజస్థాన్.. అందులో ఎడారి ప్రాంతం. మనుషులకు దాహం వేస్తే గొంతు తడుపుకోవడానికి చుక్క నీరు లేదు.. ఇక మూగజీవాల పరిస్థితి? వాటికి దిక్కెవరు..? భగభగమండే ఎండల ధాటికి పిట్టల్లా రాలి పోతున్న ఆజంతుజాలాన్ని బతికించేదిఎలా?...’’
రాజస్థాన్‌లోని తాల్‌చప్పర్ అటవీప్రాంతంలో ఫొటోలు తీసే వన్యప్రాణి ఫొటోగ్రాఫర్ శర్వన్‌ను ప్రతిరోజూ వేధించే సమస్య అది.. తాల్‌చప్పర్ .. వాయువ్య రాజస్థాన్‌లో ఉన్న షెఖావతి ప్రాంతంలోని చురు జిల్లాలో ఉంటుంది. జైపూర్ నుంచి వెళితే 210 కి.మీ.దూరం. రతన్‌నగర్ నుంచి సుజన్‌నగర్ వెళ్లే మార్గంలో వస్తుంది. అక్కడన్నీ మెట్ట భూములు.. వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు కనిపిస్తాయి.

అతి తక్కువ వర్షపాతం నమోదు అవుతుంటుంది. తాల్ చప్పర్ ప్రాంతంలోని వన్యప్రాణులనుఫొటోలు, వీడియోలు తీస్తుండేవాడు శర్వన్ పటేల్. ఒక రోజు తన మిత్రుడైన బ్యాంకు ఉద్యోగితో కలిసి పల్లెల్లో తిరిగాడు. అక్కడున్న నీటి సమస్య తనను కదిలించింది. అడవుల్లోకి వెళ్లినప్పుడు అందమైన నెమళ్లు కుంటల దగ్గర నిల్చుని దాహంతో అరుస్తుండేవి. కృష్ణజింకలు అయితే పగుళ్లుబారిన నీటిమడుగుల వద్ద నాలుక తడుపుకునే ప్రయత్నం హృదయాన్ని కదిలించింది. ఎడారి ప్రాంతం కావడంతో పల్లెల్లో మనుగడ సాగించడానికే పోరాటం చేయాల్సి వస్తుంది. అలాంటిది మూగజీవాల గురించి ఆలోచించే పరిస్థితి లేదు.
అపురూప దృశ్యాలు..
ఏదో ఒకటి చేయాలి? శర్వన్ బుర్రలో ఆలోచనలు మొదలయ్యాయి. ముందుగా చుట్టుపక్కలున్న పల్లెల్లోని పది మంది యువ తీయువకులతో ఒక బృందాన్ని కూడగట్టాడు. తన ఆలోచనల్ని పంచుకున్నాడు. ‘‘మనప్రాంత అస్తిత్వం అభయారణ్యం. రకరకాల మూగ జీవాలకు ఆలవాలం.జంతువులు, పక్షులను కాపాడుకోలేకపోతే.. మన పల్లెలకుపుట్టగతులు ఉండవు. ఆఖరికి మనం బతకడమే కష్టం అవుతుంది.. ఆలోచించండి..’’ అంటూ హెచ్చరి కలతో కూడిన చైతన్యం తీసుకొచ్చాడు శర్వన్ పటేల్. ఆయన మాటలకు ఎడారి హృదయాల పై చిరుజల్లులు రాలినంత అనుభూతి కలిగింది.

అందరూ ఏకమయ్యారు. అభయా రణ్యంలోకెళ్లి... ఎక్కడైతే వర్షపు నీటి నిల్వకు అవకాశం ఉందో.. అక్కడ చిన్నపాటి కృత్రిమ సరస్సును ఏర్పాటు చేశారు. కుంటల్లో దొరికే బంకమట్టి, కాల్చిన ఇటుకలు, కాస్త సిమెంటు కలగలిపి చిన్న చిన్న సరస్సుల్ని నిర్మించడం మొదలుపెట్టారు. వర్షం వచ్చినప్పుడుఅందులో నీళ్లు నిండుకుంటాయి.. మూగజీవాలకుదాహం తీరుతుందన్నది మిత్రుల ఆలోచన. నిర్మాణం జరిగింది కానీ జీవాలు మాత్రం రాలేదు. కొన్ని కెమెరాలు ఏర్పాటు చేశారు. కొన్నాళ్లకు మెల్లగా కృష్ణ జింకలు, నెమళ్లు, కుందేళ్లు, ముంగిసలు రావడం మొదలైంది. ఒక్కోరోజు ఒక్కో అద్భుత దృశ్యం..
ఆ సరస్సు చుట్టూ నేషనల్ జియో గ్రఫిక్ ఛానల్స్‌లో కనిపించే దృశ్యాల్లాంటివే దర్శనమిచ్చాయి. కడుపు నిండా నీళ్లు తాగిన నెమళ్లు సంతృప్తితో నాట్యమాడుతూ.. దాహం తీరిన కుందేళ్లు గంతులేస్తూ.. ముంగిసలు ఆట లాడుతూ కనువిందు చేశాయి. ఈ అపురూప దృశ్యాలన్నింటినీ వీడియోలు, ఫొటోలుగా చిత్రీకరించి.. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు చేయడం మొదలుపెట్టాడు శర్వన్ పటేల్. ఇన్‌స్టాగ్రామ్‌లో థార్ డిజర్ట్ ఫొటోగ్రఫీ పేరుతో వీటిని అప్‌లోడ్ చేస్తున్నారాయన. దేశ వ్యాప్తంగా ఉన్న వన్యప్రాణి ప్రేమికుల నుంచి మంచి స్పందన వచ్చింది. రాజస్థాన్‌లో అయితే అనేకమంది శర్వన్ వద్దకెళ్లి ప్రశంసలు కురిపిం చారు. సహాయం చేయడానికిముందుకొచ్చారు.
ఇదొక ఉద్యమంలా...
శర్వన్‌పటేల్ కల ఫలించింది. తాల్‌చప్పర్ ప్రాంతంలో చిన్న చిన్న సరస్సులు తవ్వడానికి ప్రజల మద్దతు లభించింది. అడవుల సంరక్షణకు రోజుకొక రూపాయి... పేరుతో వాట్సాప్ గ్రూప్ పెట్టాడు. అందులో చుట్టు పక్కలున్న ఊర్లవాళ్లు వెయ్యి మంది చేరారు. ప్రతీ ఒక్కరు రోజుకు ఒక రూపాయి ఇవ్వడం ప్రారంభమైంది. ఇది చిన్న మొత్తమే కావొచ్చు.. కానీ క్రమబద్ధంగా జరిగే అభివృద్ది అతి పెద్ద ప్రగతికి దారి తీస్తుంది.. అన్నది పటేల్ విశ్వాసం. ఎందుకంటే అభయారణ్యాలు, మూగజీవుల సంరక్షణకు స్థానికుల్ని ఎప్పుడైతే భాగస్వాములను చేస్తామో అప్పుడే ఫలితం లభిస్తుంది అంటాడాయన. తాల్‌చప్పర్‌లో సుమారు ముప్పయి నుంచి నలభై కృత్రిమ సరస్సుల్ని నిర్మించాడీ ఫొటోగ్రాఫర్.
ఈ సరస్సు లన్నీ మూగజీవులు, పక్షులకు ఆవాసంగా మారాయి. సందడి ఏర్పడింది. వీటన్నిటినీ సామాజిక మాధ్యమాల్లో తిలకించిన రాజస్థాన్ లోని ఇతర ప్రాంతాల వాసులు సైతం కదిలారు. బికనీర్, జోధ్‌పూర్, జైసల్మేర్‌లలోని అటవీప్రాంతాల్లో కూడా ఇలాంటి కృత్రిమ సర స్సులను ఏర్పాటు చేశారు. ఇదొక జలసంరక్షణ ఉద్యమంలా విస్తరించింది. రంగంలోకి దిగిన రాజస్థాన్ ప్రభుత్వం... తాల్‌చప్పర్‌ను పర్యాటక ప్రాంతంగా గుర్తించింది.. నిధులప్రోత్సాహమూ అందించింది. మూగజీవుల్ని ఫొటోలు, వీడియోలు తీసుకుని, జంతుప్రదర్శనశాలల్ని కాలక్షేపం కోసం తిలకించడం కాదు.. వాటి ఆక్రందనల్ని, ఆకలినీ, దాహాన్నీ అర్థంచేసుకుని.. సంరక్షిస్తే అప్పుడే మనిషిలోని మానవత్వానికి అర్థం ఉంటుందని చెప్పిన శర్వన్ పటేల్ జంతుప్రేమికులకు స్ఫూర్తిదాయకం.