Share News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ చరిత్ర మీకు తెలుసా? ఈ విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

ABN , Publish Date - Aug 07 , 2025 | 10:30 AM

రక్షా బంధన్ ఒక పవిత్రమైన పండుగ. ఇది సోదరి, సోదరుల మధ్య ప్రేమ, అనుబంధాన్ని తెలియజేసే పండుగ. కానీ, ఈ పండుగ చరిత్ర మీకు తెలుసా? పురాణాలలో ఈ పండుగకు సంబంధించిన నాలుగు కథలను ఇప్పుడు తెలుసుకుందాం..

Raksha Bandhan 2025:  రక్షా బంధన్ చరిత్ర మీకు తెలుసా? ఈ విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
Raksha Bandhan 2025

ఇంటర్నెట్ డెస్క్‌: రక్షా బంధన్ ఒక ఆత్మీయమైన పండుగ. అన్న చెల్లెళ్ల మధ్య ప్రేమ, రక్షణ అనే బంధాన్ని గుర్తుచేస్తుంది. ఈ సంవత్సరం ఈ పండుగ ఆగస్టు 9న జరుపుకుంటారు. దీన్ని రాఖీ పండుగ అని కూడా అంటారు. ఇది సోదరి, సోదరుల మధ్య ఉన్న ప్రత్యేకమైన బంధాన్ని గుర్తు చేస్తుంది. రాఖీ అంటే రక్షణ అని అర్థం. ఈ పండుగలో సోదరి తన సోదరుడికి రాఖీ కట్టి, అతని జీవితంలో సుఖ సంతోషాలు, శ్రేయస్సును కోరుకుంటుంది.

Raksha Bandhan

అలాగే, సోదరుడు తన సోదరికి రక్షణగా ఉంటానని చెబుతూ బహుమతులు ఇస్తాడు. ఈ పండుగ సోదరి, సోదరులిద్దరికీ ఆనందం, శ్రేయస్సును తెస్తుంది. ఈ పండుగను కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి జరుపుకుంటారు. రక్షా బంధన్‌ను కేవలం భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా జరుపుకుంటారు. అయితే, ఈ పండుగ చరిత్ర మీకు తెలుసా? పురాణాలలోని ఈ పండుగకు సంబంధించిన నాలుగు కథలను ఇప్పుడు తెలుసుకుందాం..


ద్రౌపది, శ్రీకృష్ణుడి బంధం

మహాభారతం ప్రకారం, శ్రీకృష్ణుడు శిశుపాలుడిని చంపేటప్పుడు అతని వేలికి గాయం అవుతుంది. ఆ సమయంలో ద్రౌపది తన చీర కొంగును చించి కృష్ణుడి వేలకు కడుతుంది. ఆమె చేసిన ఈ కృషికి ప్రతిఫలంగా, శ్రీకృష్ణుడు ఆమెకు.. ఎప్పటికీ నీకు రక్షణగా ఉంటానని మాట ఇస్తాడు. ఆ తరువాత దుశ్శాసనుడు ద్రౌపదిని సభలోకి లాక్కెళ్లి, ఆమె చీరను తీయడానికి ప్రయత్నించాడు, కాని శ్రీకృష్ణుడు ఆమెకు అంతులేని చీరను ప్రసాదించి ఆమెను రక్షించాడు. ఇది రక్షా బంధన్ పండుగకు మూలమని నమ్ముతారు.

Draupadi.jpg


ఇంద్రుడు - ఇంద్రాణి

పురాణకాలంలో వృత్రాసురునితో యుద్ధంలో ఇంద్రుడు ఓడిపోతున్న సమయంలో, అతని భార్య ఇంద్రాణి రక్షా దారాన్ని కట్టి అతనికి శక్తిని అందిస్తుంది. ఈ రక్షా దారం అతనికి విజయాన్ని ఇచ్చిందని నమ్ముతారు. ఇదే సాంప్రదాయం నేటి రాఖీ రూపంలో మారి, చెల్లెలు సోదరునికి రాఖీ కడుతుంది. అతని భద్రత, విజయాన్ని కోరుతుంది.


కర్ణావతి - హుమాయున్

మేవార్ రాణి కర్ణావతి, గుజరాత్ సుల్తాన్ బహాదూర్ షా దాడి చేస్తున్న సమయంలో, తన రాజ్యాన్ని రక్షించడానికి మొఘల్ చక్రవర్తి హుమాయున్‌కు రాఖీ పంపుతుంది. హుమాయున్ మతపరమైన తేడాలు పక్కనపెట్టి, రాఖీ బంధాన్ని గౌరవించి తన సేనలతో ఆమెకు సహాయం చేయడానికి బయలుదేరుతాడు. అతను ఆలస్యంగా రాగలిగినప్పటికీ, ఆమె కుమారుడిని సింహాసనంపై కూర్చోబెడతాడు. ఈ కథ.. రాఖీ బంధం మతాలను దాటి ఎంత బలంగా ఉంటుందో చూపిస్తుంది.

Rakhi.jpg


ఠాగూర్ రాఖీ ఉద్యమం

1905 సంవత్సరం బెంగాల్ విభజన సమయంలో, బ్రిటిష్ వారు హిందూ–ముస్లిం ప్రజల మధ్య చిచ్చు పెడతారు. అప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ రాఖీ పండుగను ఐక్యతకు ప్రతీకగా ఉపయోగించాలని నిర్ణయిస్తారు. ప్రజలు ఒకరికి ఒకరు రాఖీలు కడుతూ, మతపరమైన విభేదాలు లేకుండా సంఘీభావాన్ని చాటారు. ఇలా రాఖీ సామరస్యానికి నిలువెత్తు ఉదాహరణగా నిలిచింది.

ఈ కథలు రాఖీ పండుగ వెనక ఉన్న అర్థాన్ని మరింత లోతుగా మనకు తెలియజేస్తాయి. ఇది కేవలం ఒక చెల్లెలు సోదరునికి రాఖీ కట్టే పండుగ మాత్రమే కాదు. ఇది ప్రేమ, భద్రత, ఐక్యత, సమరస్యం అనే విలువల్ని మనం గుర్తు చేసుకునే సందర్భం కూడా.


Also Read:

గర్భిణీ స్త్రీలు వరమహాలక్ష్మి పూజ చేయవచ్చా? ఈ ముఖ్య విషయాలు తెలుసుకోండి.

బెల్లం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

For More Lifestyle News

Updated Date - Aug 07 , 2025 | 10:47 AM