Share News

వీరికి పాఠశాలలే ప్రయోగశాలలు..

ABN , Publish Date - Oct 05 , 2025 | 10:34 AM

చరిత్ర, భూగోళశాస్త్రం, జీవశాస్త్రం వంటివి చదువుకుంటేనే సరిపోదు. ఈ రోజు ప్రపంచాన్ని శాసిస్తున్న రంగాల్లో శాస్త్ర సాంకేతిక విజ్ఞానమే ముందు వరుసలో ఉంటుంది అంటారు గుజరాత్‌, రాజ్‌కోట్‌లో పనిచేసే శ్రీస్వామినారాయణ్‌ గురుకుల్‌ విద్యాలయ ఉపాధ్యాయులు హితేష్‌కుమార్‌.

వీరికి పాఠశాలలే ప్రయోగశాలలు..

సామాజిక ప్రయోగశాల... పాఠశాల!. అందుకే ఈ టీచర్లు అందరూ వినూత్నంగా రకరకాల ప్రయోగాలతో జీవన పాఠాలు చెబుతున్నారు. మిగిలిన ఉపాధ్యాయుల కంటే విభిన్నంగా బోధిస్తూ తమ సృజనాత్మకతను చాటుకుంటున్నారు. దేశవ్యాప్తంగా అత్యుత్తమ పనితీరును కనబరిచిన పలువురు టీచర్లకు కేంద్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు అందజేసింది. వివిధ రాష్ట్రాలకు చెందిన వీరి ప్రతిభాసామర్థ్యాలు అందరు ఉపాధ్యాయులకు పనికొచ్చేవే. నేడు ‘వరల్డ్‌ టీచర్స్‌ డే’ సందర్భంగా ఆ విశేషాలు...

సైన్స్‌లో ప్రత్యేకం..

చరిత్ర, భూగోళశాస్త్రం, జీవశాస్త్రం వంటివి చదువుకుంటేనే సరిపోదు. ఈ రోజు ప్రపంచాన్ని శాసిస్తున్న రంగాల్లో శాస్త్ర సాంకేతిక విజ్ఞానమే ముందు వరుసలో ఉంటుంది అంటారు గుజరాత్‌, రాజ్‌కోట్‌లో పనిచేసే శ్రీస్వామినారాయణ్‌ గురుకుల్‌ విద్యాలయ ఉపాధ్యాయులు హితేష్‌కుమార్‌. మొదట్లో ఆయన జూనియర్‌ సైంటిస్ట్‌గా కెరీర్‌ను మొదలుపెట్టారు. సెన్స్‌ ఎడ్యుకేటర్‌, హెడ్‌మాస్టర్‌గా ఎదిగారు. అందుకే ఆయనకు సైన్స్‌ అంటే ప్రత్యేక శ్రద్ధ, అభిమానం. ఇరవై లక్షల రూపాయల ఖర్చుతో ప్రత్యేక ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు.


book4.2.jpg

పిల్లల్లో కుతూహలాన్ని రేకెత్తించి.. శాస్త్ర విజ్ఞానం పట్ల ఆసక్తిని కలిగించడమే పాఠశాల ఉద్దేశ్యం. ఎవరైతే సైన్సులో రాణిస్తారో వాళ్లు ఉద్యోగపరంగానే కాదు.. జీవితంలో హేతుబద్దతతో జీవిస్తారు. సైన్స్‌ ఒక్కటే మనో వికాసానికి దోహదం చేస్తుందన్నది ఆయన ఉద్ధేశ్యం. ఈ గురుకుల్‌లో చదివిన విద్యార్థులు సైన్స్‌లో అందరికంటే ముందున్నారు. రకరకాల పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు కూడా. జాతీయ, అంతర్జాతీయ అవార్డులకు సైతం ఎంపికవ్వడం విశేషం. వరల్డ్‌ బిగ్గెస్ట్‌ రోబోటిక్‌ ఒలింపియాడ్‌లో పాల్గొనడంతో ఈ పాఠశాలకు మరింత పేరొచ్చింది. ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా అభినందించింది.


book4.3.jpg

తరగతి గదులన్నీ స్మార్ట్‌..

చదువుకున్న వాళ్లకే విద్య విలువ తెలుస్తుంది!. అలాంటి ఉన్నత విద్యావంతులు ఉపాధ్యాయులైతే ఆ విద్యార్థులు అదృష్టవంతులే అవుతారు. పంజాబ్‌, జండియాలిలోని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నరీందర్‌సింగ్‌ను చూస్తే అలాగే అనిపిస్తుంది. ఆయన డబుల్‌ ఎంఏతోపాటు బీఈడీ చేశారు. 2006 నుంచి అధ్యాపక వృత్తిలో కొనసాగుతున్నారు. ‘‘ఎంతోమంది గొప్ప గొప్ప టీచర్లు మన దేశంలో ఉన్నారు కానీ.. కొందరే ప్రత్యేకం. వాళ్లల్లో నేనొకణ్ణి కావాలన్నదే లక్ష్యం. ఇన్నేళ్ల నుంచి పడుతున్న కష్టాన్ని ప్రభుత్వం గుర్తించింది..’’ అంటారు నరీందర్‌సింగ్‌.


book4.4.jpg

1986 నుంచి ఈ పాఠశాల రెండు గదులతోనే నడిచేది. నరీందర్‌ వచ్చాక బడి స్వరూపమే మారిపోయింది. పదిహేను స్మార్ట్‌ క్లాసులు వచ్చేశాయి. వీటి వెనుక ఆయన కృషి వెలకట్టలేనిది. కంప్యూటర్‌ ల్యాబ్‌, సైన్స్‌ల్యాబ్‌, మల్టిపుల్‌ లెర్నింగ్‌ పార్క్‌, మొబైల్‌ లైబ్రరీ, హానెస్టీషాప్‌ వంటివన్నీ పాఠశాలకు అందించారు సింగ్‌. ‘‘సర్కారు బడికి అనేక వనరులను సమకూర్చుకోవచ్చు. మనలో అంకితభావం ఉంటే ఎంతోమంది దాతలు ముందుకు వస్తారు. అందుకు నిదర్శనమే మా పాఠశాల’’ అంటారీ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత.


జవహర్‌ నవోదయలో రికార్డు..

book4.8.jpg

ఉదయం వచ్చి.. సాయంత్రం వెళ్లిపోయి.. అటెండెన్స్‌ చూసుకోవడమే టీచర్ల బాధ్యత కాదు. పేద పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించగలిగే వృత్తిలో ఉండటం అదృష్టంగా భావించాలి.. అంటారు శశిపౌల్‌. హిమాచల్‌ప్రదేశ్‌లోని సోలన్‌ ప్రాంతానికి చెందిన శశి కరోనా సమయంలో కూడా పేదపిల్లలకు ఉచితంగా ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించారు. ‘‘చదువు అనేది నిరంతర ప్రక్రియ. పేదపిల్లలకు ఏమాత్రం అడ్డంకులు ఎదురైనా కూలీలుగా మారే పరిస్థితి. అందుకే వాళ్లను నిత్యం కంటికిరెప్పలా కాపాడుకోవాలి..’’ అంటారు పౌల్‌.


స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌లో పాఠ్యాంశాల రూపకల్పనలో పౌల్‌ భాగస్వామ్యం ఉంది. ఆ నైపుణ్యంతో అద్భుతమైన బోధనాపద్ధతులను అనుసరిస్తూ.. విద్యార్థులను మెరికల్లా తీర్చిదిద్దారు. అందుకే ఈ పాఠశాల నుంచి 220 మంది పిల్లలకు జవహర్‌ నవోదయ విద్యాల యాల్లో సీట్లు వచ్చేలా చేశారు. ఒక పాఠశాల నుంచి ఇంతమంది విద్యార్థులు అర్హత సాధించడం ఒక అద్భుతమనే చెప్పాలి. తల్లిదండ్రుల కమిటీలు, రోటరీక్లబ్‌, లయన్స్‌క్లబ్‌, గ్రామ పంచాయతీల సహాయంతో కంప్యూటర్‌ల్యాబ్‌, మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయం కల్పించారు. ఇప్పుడిది ఆదర్శ పాఠశాలగా మారింది.


వరల్డ్‌ టీచర్స్‌ డే ఎందుకంటే..

ఒక ఊరు, ఒక ప్రాంతం, ఒక దేశం ఆర్థికంగా.. సామాజికంగా ఎదగడమే కాదు. సాంస్కృతిక, సారస్వత ఔన్నత్యాన్ని సాధించి.. అత్యుత్తుమ పౌరులను తీర్చిదిద్దడానికి ఆదర్శవంతమైన విద్యావిధానం అవసరం. అందుకు సామాజిక శాస్త్రవేత్తల్లాంటి ఉపాధ్యాయులు ఇంకా అవసరం. పిల్లలకు బాల్యం నుంచే విద్యాబుద్ధులు నేర్పించి, నైతిక విలువలను పెంపొందించి.. మంచి పౌరులుగా తీర్చిదిద్ది.. సమాజానికి అందించే గురుతర బాధ్యత వారిది!. అందుకే అన్ని రంగాలకంటే అధ్యాపక వృత్తి అత్యంత పవిత్రమైనదని..


ఈ విషయాన్ని యావత్తు ప్రపంచం గుర్తుపెట్టుకోవాలంటుంది అక్టోబర్‌ 05. ఉపాధ్యాయులను గౌరవించుకోవడానికి ఆ రోజును ‘వరల్డ్‌ టీచర్స్‌ డే’గా 1994లో యునెస్కో ప్రకటించింది. సమాజానికి మేలు చేస్తున్న ఉపాధ్యాయులను అభినందించడానికి, వారి సమస్యలు తెలుసుకోవడానికి ఈ రోజు వేదిక అయ్యింది. ఒక్కో దేశంలో ఒక్కో టీచర్స్‌డే ఉండొచ్చు కానీ... ప్రపంచమంతా జరుపుకొనే ఉపాధ్యాయ దినోత్సవం మాత్రం ఇదే కావడం విశేషం.


నిరంతర నివేదికలతో..

ఒక గంట సోషల్‌.. మరో గంట సైన్సు..

book4.9.jpg

ఆపై మాతృభాష.. ఇంతేనా? ఇంతమాత్రం చదువుకు బడికి ఎందుకు రావాలి? అంటారు ఉత్తరాఖండ్‌, చంపావత్‌ జిల్లాలోని చైరానీ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు మంజుబాల. ఆ రాష్ట్రంలో జాతీయ అవార్డు అందుకున్న తొలి టీచర్‌ ఆమె. ఉత్తరాఖండ్‌ పర్వత ప్రాంతం. ఇక్కడున్న పిల్లల్లో హుషారు ఎక్కువ. ఆటలు, పజిల్స్‌, క్విజ్‌, స్టోరీటెల్లింగ్‌.. ఇలా రకరకాల ప్రక్రియలతో అలరిస్తున్నారు మంజు. ఉత్తమ సామాజిక సేవకురాలు, జాతీయ మానవ హక్కుల సంఘం వంటి పురస్కారాలను అందుకున్న ఆమె..


book4.10.jpg

పాఠశాలలో చైతన్యవంతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పిల్లల ప్రతిభా సామర్థ్యాలపై ఎప్పటికప్పుడు రిపోర్టులు తయారుచేసి.. తల్లిదండ్రులను భాగస్వాములను చేస్తున్నారు. చురుగ్గా లేని విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మెరుగుపరుస్తున్నారు. బాలసభ పేరుతో స్మార్ట్‌ క్లాస్‌రూంలను నిర్వహిస్తూ ప్రయోగాలు చేస్తున్నందుకు ప్రభుత్వ ప్రశంసలు అందుకున్నారు. బాల్యవివాహాలు, బాల కార్మికులు, సైబర్‌నేరాలు, సామాజిక సేవా దృక్పథం వంటి అంశాలను తెలియజేస్తూ.. చైతన్యం నింపుతున్నందుకు ఈ పాఠశాలకు ఎంతో పేరొచ్చింది. దీంతో మంజుబాలకు జాతీయస్థాయి అవార్డొచ్చింది.


ఆడుతూ.. పాడుతూ..

విద్య ఎందుకు? ఉపాధి కోసమా.. లేదంటే.. జీవననైపుణ్యాల కోసమా? అంటే రెండూ అవసరమే అంటారు సునీత దౌల్‌. హర్యానా, సోనిపట్‌లో ఉన్న ముర్తాల్‌అడ్డా బాలికల పాఠశాలలో పనిచేస్తున్న ఆమె బోధనా ప్రక్రియ విభిన్నం.. ప్రత్యేకం. విద్యార్థులకు కేవలం మార్కులే ప్రధానం కాదు.. జీవితంలో ఎలా బతకాలనేది నేర్చుకోవడమూ ముఖ్యమేనన్నది ఆమె ఆలోచనావిధానం. అందుకే బడిలో ప్రథమచికిత్స దగ్గర నుంచి ప్రమాదాల వరకు తమనుతాము ఎలా కాపాడుకోవాలో ప్రత్యేక తరగతుల ద్వారా బోధిస్తారు. నిరంతరం విద్యార్థులను ఆటలతో చురుగ్గా ఉంచే ప్రయత్నం చేస్తారు.


ప్రాజెక్ట్‌ బేస్డ్‌ లర్నింగ్‌, టెక్నాలజీ, కల్చరల్‌ ఈవెంట్స్‌తో పిల్లల్లో నూతనోత్తేజం నింపుతారు. రెడ్‌క్రాస్‌, హిందుస్తాన్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ సహాయంతో పిల్లల్లో మానసిక, శారీరక వికాసానికి కృషి చేస్తున్నారు. ఈ పాఠశాలలోని విద్యార్థులు చుట్టుపక్కలున్న మిగిలిన పిల్లలతో పోలిస్తే.. చాలా ఆత్మవిశ్వాసంతో అన్ని విభాగాల్లో రాణిస్తుండటం విశేషం. దేశభక్తి, సామాజిక సేవా దృక్పథం, చైతన్యం తీసుకొచ్చేందుకు ఆటపాటలతో బడిని నడిపిస్తున్న టీచర్‌ సునీత. ఆమె వినూత్న బోధనా పద్ధతులను ఇతర ఉపాధ్యాయులు సైతం అనుసరిస్తూ.. పాఠశాలలను అభివృద్ది చేస్తున్నారు.


ప్రశ్నలకు స్వేచ్ఛ!

మీరెన్ని ప్రశ్నలు వేస్తే అంత చైతన్యం వస్తుంది. మీరెన్ని సందేహాలు అడిగితే అంత జ్ఞానం అబ్బుతుంది.. దయచేసి ప్రతి ఒక్కరూ ఒక్క ప్రశ్న అడిగితే చాలు.. ఆ సమాధానంతో అందరూ నేర్చుకుంటారు.. అంటారు అవదేశ్‌ కుమార్‌ ఝా. విద్యార్థులు స్వేచ్ఛగా ఏదైనా సరే అడగండంటూ దిల్‌ కీ బాత్‌ కార్యక్రమాన్ని పాఠశాలలో ఏర్పాటు చేయడం ఒక ప్రయోగం. బిహార్‌లో పుట్టి పెరిగిన ఆయన ఢిల్లీలోని ఎస్‌కెవి రోహిణి సెక్టర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఎంఈడీ పూర్తి చేసిన ఆయన అధ్యాపకవృత్తిలో విప్లవాత్మక మార్పుల్ని తీసుకొచ్చారు. అవదేశ్‌కు పాఠశాలనే ప్రపంచం. ఎప్పుడో కానీ సెలవు తీసుకోరు.


నిత్యం విద్యార్థులు కొత్త విషయాలు నేర్చుకుంటూ.. సందేహాలను నివృత్తి చేసుకుంటూ.. సంతోషంగా చదువుకుంటే సంతృప్తి చెందుతారాయన. బడిలో నిరంతరం చదువుకునే పిల్లల కోసం ‘శోభిత్‌ రీడింగ్‌ రూమ్‌’ ఏర్పాటు చేశారు. ఇక, జీరోవేస్ట్‌ సిటిజన్‌ బ్యాంక్‌ను నెలకొల్పి.. పిల్లల ఇళ్లలోని ప్లాస్టిక్‌, పేపర్‌, పనికిరాని వస్తువులను సేకరిస్తూ.. పునర్వినియోగానికి కృషి చేస్తున్నారు. దీనిద్వారా విద్యార్థులకు చిన్నప్పటి నుంచే జీరోవేస్ట్‌ పైన అవగాహన కలుగుతుంది.


కళలకు మార్గం..

book4.7.jpg

రాజస్థాన్‌లోని అల్వార్‌ జిల్లా.. తపుకారా ఒక చిన్న పట్టణం.. అందులో ఉంటుంది ఒక ప్రభుత్వ పాఠశాల. అక్కడ చదువుకునే ఒక అమ్మాయి ఏకంగా కెనడాలో జరిగిన అతి పెద్ద ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌కు అర్హత సాధించింది. దీనికి కారణం? అక్కడ పనిచేసే టీచర్‌ నీలం యాదవ్‌. భారత్‌ కళలకు ప్రసిద్ధి. ఒకప్పుడు ప్రపంచ గుర్తింపు పొందిన ఆర్టిస్టులు ఉండేవారు. ఆ మాటకొస్తే చిత్రలేఖనం, శిల్పకళ, సంగీతం, సాహిత్యానికి ఏ దేశానికీ తీసిపోనంత సారస్వత సంపద మన సొంతం అని చెప్పుకోవాలి.. అంటారు నీలం.


బడిలో చదివే పిల్లలకు కూడా భారతీయ కళల ఔన్నత్యాన్ని తెలియజేయాలన్న ఉద్దేశ్యంతో ఆర్ట్‌ను ప్రోత్సహించిందామె. తను సొంత ఖర్చు పెట్టి విద్యార్థులకు బొమ్మలు గీయడం, పెయింటింగ్స్‌ వేయడంలో తర్ఫీదునిచ్చారు. దాంతో పాటు బడి మానేసిన పిల్లల్ని తిరిగి చేర్పించేందుకు ప్రత్యేక కృషి చేశారామె. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ నిధుల్ని సమకూర్చుకుని.. డిజిటల్‌ టీచింగ్‌ ప్రవేశపెట్టారు. 60 ట్యాబ్‌లెట్స్‌ సహాయంతో తరగతుల్ని స్మార్ట్‌గా తీర్చిదిద్దారు. సర్కారు బడుల్ని ఇలా మార్చేయడం వల్ల విద్యార్థులు పోటీ ప్రపంచంతో దూసుకెళుతున్నారు. ఈ పాఠశాల విద్యార్థిని కెనడా ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌కు ఎంపికవ్వడం అందుకు నిదర్శనం.


బొమ్మలతో పాఠాలు..

book4.6.jpg

పిల్లలే ఆమె ప్రపంచం.. అందుకేనేమో అతి పెద్ద భూగోళంలాంటి గ్లోబును బడి ఆవరణలో ఏర్పాటు చేశారు. ఇజ్రాయెల్‌-పాలస్తీనాల మధ్య యుద్ధం జరిగినా.. రష్యా-ఉక్రెయిన్‌ల నడుమ పోరు తలెత్తినా.. నేపాల్‌లో అల్లర్లురేగినా.. ఇలా ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా ఆయా దేశాలు వార్తల్లో ఉంటాయి. ఆ ప్రాంతాలు గ్లోబులో ఎక్కడున్నాయో గుర్తించేందుకు విద్యార్థుల్ని ప్రోత్సహిస్తారామె. అలా వర్తమాన విషయాలపై ఆసక్తి కలుగుతుంది. పిల్లల్లో జనరల్‌ నాలెడ్జి పెరుగుతుంది. ఇంతేకాదు.. తరగతి గదుల్లో బొమ్మలతో పాఠాలు చెబుతూ ఆకట్ట్టుకుంటున్న ఆ ఉపాధ్యాయిని పర్వీన్‌ కుమారి.


చండీగఢ్‌లోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో పనిచేస్తున్న ఆమె బోధనా పద్దతులు స్ఫూర్తిదాయకం. పర్వీన్‌ మేడం వచ్చిందంటే చాలు.. విద్యార్థుల్లో ఎక్కడలేని ఉత్సాహం. ఆమె చక్కటి హావభావాలతో పాఠాలను సినిమాలా దృశ్యమానం చేస్తారు. ఎంత క్లిష్టమైన అంశాలను అయినా సరే సులభంగా అర్థమయ్యేలా విడమరచి చెబుతారు. సంప్రదాయ రీతిలో కాకుండా.. ఆరుబయట గ్లోబు, తరగతి గదిలో బొమ్మల సహాయంతో పాఠాలు చెబుతున్నందుకు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.

Updated Date - Oct 05 , 2025 | 10:34 AM