Share News

విమానం... చదువుల బడిగా...

ABN , Publish Date - Sep 14 , 2025 | 10:48 AM

సాధారణంగా పిల్లలు బడికి వెళ్లే సమయంలో మారాం చేస్తూ ఏడుస్తుంటారు. అదే సాయంత్రం స్కూల్‌ నుంచి ఇంటికొచ్చే సమయంలో అరుస్తూ సంతోషంగా ఉంటారు. అయితే ఈ స్కూలు మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. సాయంత్రం పిల్లల్ని తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళుతుంటే ‘ఇక్కడే ఉంటాం’ అంటూ ఏడుస్తుంటారు.

విమానం... చదువుల బడిగా...

సాధారణంగా పిల్లలు బడికి వెళ్లే సమయంలో మారాం చేస్తూ ఏడుస్తుంటారు. అదే సాయంత్రం స్కూల్‌ నుంచి ఇంటికొచ్చే సమయంలో అరుస్తూ సంతోషంగా ఉంటారు. అయితే ఈ స్కూలు మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. సాయంత్రం పిల్లల్ని తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళుతుంటే ‘ఇక్కడే ఉంటాం’ అంటూ ఏడుస్తుంటారు. ఎందుకంటే... ఒక విమానాన్నే కిండర్‌గార్టెన్‌ స్కూలుగా మార్చి చదువు చెబుతున్నారక్కడ.

చిన్న పిల్లల్ని స్కూల్‌కి పంపించడమంటే తల్లిదండ్రులకు ప్రతీరోజూ ఒక అగ్నిపరీక్షే. కొంతమంది పిల్లలు స్కూల్‌కి వెళ్లనని మొండికేస్తే, మరికొందరు పిల్లలు తరగతి గదిలో టీచర్‌ మాట అస్సలు వినరు. అలాంటి పిల్లల కోసం జార్జియాలోని రుస్తావికి చెందిన ఉపాధ్యాయుడు ‘గ్యారి చాపిడ్‌’్జ వినూత్న ప్రయోగం చేశారు. విమానాశ్రయంలో ఒక మూలకున్న పాత విమానాన్ని కొనుగోలు చేసి, దానినే కిండర్‌గార్టెన్‌ స్కూలుగా మార్చారు.


పిల్లలకు ప్రాథమిక విద్యను వినూత్నంగా అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా పిల్లలు కొత్త వాతావరణానికి తొందరగా అలవాటు పడరు. పాఠశాలకు వెళ్లడానికి మంకు పట్టు పడతారు. అలాంటి పిల్లలకు వినోదాన్ని అందించి... తద్వారా విద్య పట్ల ఆసక్తి పెంచాలనే ఆలోచనతో విమానాన్ని ఎంచుకు న్నారాయన. ఆ మాస్టారు నిర్ణయం సత్ఫలితాలను ఇచ్చిందనే చెప్పాలి. పిల్లలు ఆ ఫ్లైట్‌ బడిలో కూర్చుని పాఠాలు వింటూ తెగ సంతోషడిపోతున్నారు.


book7.2.jpg

ఆలోచన సూపర్‌ హిట్‌

టీచర్లు చెప్పే పాఠాన్ని పిల్లలు శ్రద్ధగా వినాలంటే ప్రాథమికంగా తరగతి గది ఆకట్టు కునేలా ఉండాలి. ఇంకా చెప్పాలంటే ఆ గదిలో పిల్లలకు ఇష్టమైనవి ఉండాలి. అందుకే చాపిడ్జ్‌ జార్జియన్‌ ఏయిర్‌వేస్‌ నుంచి ఒక విమానాన్ని కొనుగోలు చేశారు. విమానం పాతదే అయినా పూర్తి స్థాయిలో పనిచేస్తున్న యాకోవ్లెక్‌ యాక్‌ 42 ప్లేన్‌ను కొని, దానినే తరగతి గదిగా తీర్చి దిద్దారు. ‘కిండర్‌గార్టెన్‌కి పిల్లలు సంతోషంగా వెళ్లాలన్న ఆలోచనే నన్ను విమానం కొనుగోలు చేసేలా ప్రేరేపించింద’ని అంటారు చాపిడ్జ్‌.


పాత విమానం కొనుగోలు చేశాక లోపల ఉన్న రెగ్యులర్‌ ఇంటీరియర్‌ను తొలగించి విద్యాసంబంధ వస్తువులు, టాయ్స్‌, రకరకాల ఆట వస్తువులతో తీర్చిదిద్దారు. కిటికీల దగ్గర పిల్లలు కూర్చునేందుకు అనువుగా కుర్చీలు, టేబుల్స్‌ వేశారు. కాక్‌పిట్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ని మాత్రం తొలగించలేదు. పిల్లలకు ప్లేటూల్స్‌గా ఉపయోగపడు తుందని కాక్‌పిట్‌ని వదిలేశారు. కాక్‌పిట్‌లో సుమారు 1500 బటన్స్‌ ఉన్నాయి. పిల్లలు కాక్‌పిట్‌లో కూర్చుని నిజమైన పైలట్లుగా ఆడుకుంటున్న సమయంలో వాళ్ల ముఖంలో సంతోషం చూసి తీరాల్సిందే.


book7.3.jpg

‘‘విమానం లోపలి భాగాలు తొలగించి తరగతి గదిగా మార్చడానికి నాలుగైదు నెలల సమయం పట్టింది. మొదట ఈ ఆలోచనను పిల్లల తల్లిదండ్రులు ఒప్పుకుంటారో లేదో అని ఆందోళన చెందాను. కానీ పిల్లలకే కాకుండా వారి పెద్దలకు కూడా ఇది బాగా నచ్చింది. ప్లేన్‌ కిండర్‌గార్టెన్‌ క్లాస్‌రూమ్‌ హిట్‌ కావడంతో పేరెంట్స్‌ అందరూ పిల్లలను మా దగ్గరకి పంపడానికి ఆసక్తి చూపుతున్నారు’’ అంటారు చాపిడ్జ్‌. ఇలాంటి స్కూలు మరెక్కడా లేదని గర్వంగా ఫీలవుతుంటారు స్థానికులు.

Updated Date - Sep 14 , 2025 | 10:48 AM