Share News

Lifestyle: ‘అమ్మా... నా బ్యాగ్‌ ఎక్కడ?.. అమ్మా.. లంచ్‌కి ఏం చేస్తున్నావ్‌?..

ABN , Publish Date - Nov 09 , 2025 | 08:19 AM

అమ్మాయిలకు అమ్మే ఓ ఫ్యాషన్‌ ఐకాన్‌. నేటితరం అమ్మాయిలు అమ్మతో పేగుబంధాన్నే కాకుండా చీరబంధాన్ని, ఆభరణాలబంధాన్ని కూడా చాటుకోవాలని చూస్తున్నారు. అమ్మ పెళ్లినాటి చీర, నగలు దాచుకుని మరీ... సరికొత్త లుక్‌తో ధరిస్తున్నారు. తమ జీవితాల్లోని ముఖ్యఘట్టాల్లో వాటికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ మురిసిపోతున్నారు.

Lifestyle: ‘అమ్మా... నా బ్యాగ్‌ ఎక్కడ?.. అమ్మా.. లంచ్‌కి ఏం చేస్తున్నావ్‌?..

- ‘అమ్మ’ జ్ఞాపకం... సరికొత్తగా...

అమ్మాయిలకు అమ్మే ఓ ఫ్యాషన్‌ ఐకాన్‌. నేటితరం అమ్మాయిలు అమ్మతో పేగుబంధాన్నే కాకుండా చీరబంధాన్ని, ఆభరణాలబంధాన్ని కూడా చాటుకోవాలని చూస్తున్నారు. అమ్మ పెళ్లినాటి చీర, నగలు దాచుకుని మరీ... సరికొత్త లుక్‌తో ధరిస్తున్నారు. తమ జీవితాల్లోని ముఖ్యఘట్టాల్లో వాటికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ మురిసిపోతున్నారు. సెలబ్రిటీలు మొదలెట్టిన ఈ ట్రెండ్‌ ఇప్పుడు సామాన్యులదాకా చేరింది. చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది...

‘‘అమ్మా... నా బ్యాగ్‌ ఎక్కడ?.... అమ్మా... లంచ్‌కి ఏం చేస్తున్నావ్‌?... అమ్మా... కాలు బెణికింది, కాస్త బామ్‌ రాయి’’... ఇలా రోజుకి అమ్మని కనీసం కొన్ని పదుల సార్లయినా తలుస్తారు... పిలుస్తారు... పిల్లలు. ఇక ఆడపిల్లలైతే అమ్మ కొంగు పట్టుకునే తిరుగుతారు. వాళ్ల స్నేహం అమ్మతోనే, సంతోషం అమ్మతోనే, గొడవలూ అమ్మతోనే. అలాంటి అమ్మ అనుకోకుండా దూరమైతే... బెంగపడి, అమ్మ వస్తువుల్లో సాంత్వనను వెదుక్కుంటారు కొందరు. మరికొందరు అమ్మ తమతో ఉన్నప్పటికీ, ఆమె అనుబంధానికి గుర్తుగా వారి చీరలు, నగలు ధరిస్తూ మురిసిపోతారు. ఈమధ్య సెలబ్రిటీల పిల్లలు ఈ తరహా మదర్‌ ఫ్యాషన్స్‌ను రీక్రియేట్‌ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. పెళ్లిళ్లు, పేరంటాలకు, ఇతరత్రా ఫంక్షన్లకు అమ్మకు సంబంధించిన చీరనో, నగనో ధరిస్తూ సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా మారుతున్నారు.


‘అతిలోక సుందరి’ని గుర్తుకు తెస్తూ...

ఒకప్పటి ‘అతిలోక సుందరి’ వారసులుగా జాన్వీకపూర్‌, ఖుషీకపూర్‌లు కూడా కథానాయికలుగా ఇప్పుడిప్పుడే రాణిస్తున్నారు. తల్లి శ్రీదేవి ఆకస్మిక మరణం ఈ అక్కాచెల్లెళ్లకు తీరని వ్యథను మిగిల్చింది. ఆ బాధ నుంచి కోలుకుని, ఇప్పుడిప్పుడే సినిమాల్లో బిజీగా మారుతున్నారు. అయితే ప్రతీ ముఖ్యమైన సందర్భంలో అమ్మ చీరలు, స్కార్ఫ్‌, లాంగ్‌ ఫ్రాక్‌లను ధరించి ఆమె తమతో పాటే ఉందన్నట్టుగా అనుభూతి చెందుతున్నారు. ఇటీవల ముంబయిలో జరిగిన ‘హోమ్‌బౌండ్‌’ చిత్ర ప్రీమియర్‌కు శ్రీదేవి చీరను ధరించి జాన్వీకపూర్‌ వార్తల్లో నిలిచింది.


రీగల్‌ బ్లూ, నలుపు రంగుల ఆ చీరను అప్పట్లో ప్రసిద్ధ ఫ్యాషన్‌ డిజైనర్‌ సవ్యసాచి డిజైన్‌ చేశారు. విరాట్‌కోహ్లీ రిసెప్షన్‌లో శ్రీదేవి ధరించింది ఈ చీరే. అదే చీరను ఫంక్షన్‌కు కట్టుకొచ్చి జాన్వీకపూర్‌ తన తల్లిని గుర్తుచేసింది. అంతకుముందు కూడా ఓ అవార్డు ఫంక్షన్‌లో శ్రీదేవి చీరలో తళుక్కున మెరిసింది జాన్వీ. గులాబీ అంచు తెల్లని ఆ చీరను రామ్‌చరణ్‌ వివాహంలో శ్రీదేవి ధరించడం విశేషం. 2023లో ‘ద ఆర్చీస్‌’ చిత్ర స్పెషల్‌ స్ర్కీనింగ్‌కు బంగారు మెరుపుల లాంగ్‌ ఫ్రాక్‌ను వేసుకుంది ఖుషీకపూర్‌. ఇలా తల్లి దుస్తులను ఆమె జ్ఞాపకాల గుర్తుగా అప్పుడప్పుడూ ధరిస్తూ ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు ఈ అక్కాచెల్లెళ్లు.


ఇదోరకం సెంటిమెంట్‌...

అమ్మ, అత్తమ్మలను ఒకే రీతిన చూడమంటారు పెద్దలు. ఉత్తరాదిలా ఇద్దరినీ ‘మా’ అనే పిలుస్తారని తెలుసు కదా. కరీనా కపూర్‌ ఒక అడుగు ముందుకేసి, పెళ్లిలో సైఫ్‌ అలీఖాన్‌ తల్లి, తన అత్తగారైన షర్మిలా ఠాగూర్‌ అప్పట్లో ఆమె వివాహంలో ధరించిన ఘరారానే కరీనా కూడా వేసుకుంది. బంగారు ఎంబ్రాయిడరీ ఉన్న ఈ సంప్రదాయ ఘరారాను షర్మిలా ఠాగూర్‌ 1962లో టైగర్‌ పటౌడీతో నిఖాలో ధరించారు. సాధారణంగా అత్తగారి పెళ్లి చీరను భారతీయ పెళ్లి కూతుర్లు తమ పెళ్లిళ్లలో ధరించరు. అయితే డిజైనర్‌ రితూ కుమార్‌తో దశాబ్దాల నాటి ఆ ఘరారాకు సరికొత్త మెరుగులు దిద్దించి కరీనా వేసుకున్నారు. అలా తన పెళ్లి లుక్‌కు సెంటిమెంట్‌ను కూడా జోడించింది కరీనా.


చీరే... దుపట్టాలాగా...

అంబానీల గారాలపట్టి ఈషా అంబానీ రిలయన్స్‌ రీటైల్‌ వెంచర్స్‌కి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌. 2018లో ఆనంద్‌ పిరమల్‌తో ఈషా వివాహం వైభవంగా జరిగింది. ఆ పెళ్లికి అతిరథమహారథులంతా హాజరయ్యారు. వజ్రాభరణాలలో పెళ్లికూతురు ఈషా మెరిసిపోయింది. ఆమె ధరించిన ఛోళీ, లెహంగాను కూడా వజ్రాలతో పొదిగారు. ఈషా ‘ఐవరీ రంగు’ దుస్తులకు మ్యాచ్‌ అయ్యేలా ఆనంద్‌ కూడా అదే రంగు షేర్వానీ ధరించడం విశేషం. అయితే అందరి దృష్టిని మాత్రం ఆకర్షించింది ఈషా భుజమ్మీద నుంచి జారుతోన్న ఎర్రని దుపట్టా. అది కేవలం దుపట్టా కాదు... ఓ చీర. అప్పటికి 35 ఏళ్ల క్రితం తల్లి నీతా అంబానీ ఆమె పెళ్లిలో ధరించిన చీర. అమ్మ మీద ఉన్న మమకారంతో ఆమె పెళ్లి చీరనే ఈషా తన పెళ్లిలో దుపట్టాగా ధరించి అందరినీ ఆశ్చర్యపరచింది. ఈషా స్టెయిలిస్ట్‌ అమీ గుప్తా తన ఇన్‌స్టాలో ఈ విషయాన్ని తెలియజేయడంతో అందరికీ తెలిసింది.


‘అ’సాధారణమే...

book3.4.jpg

‘జటాధర’తో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది సోనాక్షి సిన్హా. అలనాటి మేటి బాలీవుడ్‌ హీరో శత్రుఘ్నసిన్హా కూతురైన సోనాక్షి ప్రేమ పెళ్లి గత ఏడాది జరిగింది. ఆ పెళ్లిలో సోనాక్షి ధరించిన చీర చాలా సింపుల్‌గా ఉందని బాలీవుడ్‌ జనాలు, సాధారణ ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ‘ఐవరీ’ లక్నో చికన్‌కారీ చీరలో పెళ్లి కూతురుగా సోనాక్షి లుక్‌ అదిరింది. స్టార్స్‌ తమ పెళ్లిళ్లలో అత్యంత ఖరీదైన కాంచీవరం, బెనారస్‌ పట్టు మెరుపులు, డిజైనర్‌ అవుట్‌ఫిట్లనే ధరిస్తారని భావిస్తారెవరైనా. అయితే సోనాక్షి బ్రైడల్‌ లుక్‌ వెనక ఓ లెక్కుంది. అది కొన్నేళ్ల క్రితం వాళ్ల అమ్మ పూనమ్‌ సిన్హా ... ఆమె పెళ్లికి ధరించిన చీర. అమ్మ, ఆమె పెళ్లి చీర, అందులో పెనవేసుకున్న బంధాలు, ఆత్మీయతలను గుర్తుచేసుకుంటూ సోనాక్షి సెంటిమెంట్‌గా తన కొత్త జీవితంలోకి అడుగులు వేసింది. ఇప్పుడర్థమయ్యిందా? సోనాక్షి సింపుల్‌ లుక్‌ వెనక ఎన్నో అనుబంధాలు పెనవేసుకున్నాయని.


ఒకవైపు ప్రేమ ... మరోవైపు నివాళి...

book3.2.jpg

ఏ పెళ్లిలో అయినా సందడంతా పెళ్లికూతురి స్నేహితురాళ్లదే ఉంటుంది. వాళ్ల దుస్తులు, మేకప్‌, ఆభరణాలు... పెళ్లి కూతురితో కాస్త మ్యాచ్‌ అయ్యేట్టుగా డిజైన్‌ చేసుకుంటారు. దీనికి ‘లైగర్‌’ సుందరి అనన్యా పాండే కూడా మినహాయింపు కాదు. గతేడాది నవంబరులో స్నేహితురాలు దియాష్రాఫ్‌ పెళ్లికి ‘టర్కోయిస్‌’ రంగు చుడీదార్‌ సూట్‌ ధరించింది అనన్య. అయితే ఆ డ్రెస్‌ వాళ్ల అమ్మ భావనది కావడం విశేషం. దివంగత డిజైనర్‌ రోహిత్‌ బాల్‌ ఈ చుడీదార్‌ సూట్‌ను 21 ఏళ్ల క్రితం రూపొందించారు. 2024 నవంబరు 1న ఆయన చనిపోయారు. అదే మాసంలో ఈ దుస్తులు ధరించడం ద్వారా... ఓవైపు అమ్మపై ప్రేమను చాటుతూ, మరో వైపు ఆ ఐకానిక్‌ డిజైనర్‌కు నివాళులు అర్పించింది అనన్య.


అమ్మ, అమ్మమ్మల గుర్తుగా...

book3.3.jpg

టీవీ సీరియల్స్‌ ద్వారా బాలీవుడ్‌లో సెటిల్‌ అయిన నటి యామీ గౌతమ్‌. ‘యురి- ది సర్జికల్‌ స్ట్రయిక్స్‌’లో చక్కని అభినయాన్ని ప్రదర్శించిన యామి, ఆ చిత్ర దర్శకుడు ఆదిత్యధార్‌ను 2021లో వివాహం చేసుకుంది. తళుకుబెళుకుల డిజైనర్‌ చీరలని కాదని సంప్రదాయ లుక్‌లో యామి అందరినీ ఆశ్చర్యపరచింది. ఆమె తన పెళ్లిలో ధరించిన మెరూన్‌ రంగు పట్టుచీర 33 ఏళ్ల నాటిదంటే ఆశ్చర్యమేస్తుంది. అది వాళ్ల అమ్మ అంజలి చీర. తలపైన ధరించిన దుపట్టా వాళ్ల అమ్మమ్మదని తెలిసి అంతా ముక్కున వేలేసుకున్నారు. దీన్ని బట్టి యామికి అమ్మ, అమ్మమ్మలతో ఉన్న అనుబంధాన్ని, ఎమోషన్‌ను అర్థం చేసుకోవచ్చు. ఆ చీరకున్న బంగారు ఎంబ్రాయిడరీ దారాలకు సరితూగేలా సంప్రదాయ బంగారు ఆభరణాలు ధరించి చూడచక్కని పెళ్లికూతురిగా మారింది యామి. సింపుల్‌ మేకప్‌, సంప్రదాయ దుస్తులకు సాటి మరేదీ లేదని యామీ నిరూపించింది.

Updated Date - Nov 09 , 2025 | 08:19 AM