Share News

విమానాల కోసం ‘యుద్ధమే’ చేశాడు...

ABN , Publish Date - Oct 05 , 2025 | 08:42 AM

ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అభిరుచి ఉంటుంది. కొందరు నాణేలు సేకరిస్తే, మరి కొందరు స్టాంపులు సేకరిస్తారు. అవన్నీ మామూలే. అయితే ఫ్రాన్స్‌లోని బుర్గుండీ ప్రాంతానికి చెందిన 87 ఏళ్ల మైఖెల్‌ పాంట్‌ మాత్రం ప్రపంచంలోనే ఎవరూ తలపెట్టని అభిరుచిని ఎంచుకున్నాడు.

విమానాల కోసం ‘యుద్ధమే’ చేశాడు...

అదొక వైన్‌యార్డ్‌. అందులోకి అడుగిడితే... ఎకరాల్లో విస్తరించి ఉన్న ద్రాక్ష తోటలు కనువిందు చేస్తాయి. మరోవైపు అధిక సంఖ్యలో కొలువుదీరిన యుద్ధవిమానాలు కనిపిస్తాయి. కనుచూపు మేరలో ఎయిర్‌పోర్టు, ఎయిర్‌బేస్‌ లేవు. విమానాలు ఎగిరేందుకు రన్‌వే లేదు. మరి ద్రాక్షతోటలో యుద్ధ విమానాలు ఎందుకు ఉన్నాయి? అది తెలుసుకోవాలంటే ముందుగా మైఖెల్‌ పాంట్‌ గురించి తెలుసుకోవాలి.

ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అభిరుచి ఉంటుంది. కొందరు నాణేలు సేకరిస్తే, మరి కొందరు స్టాంపులు సేకరిస్తారు. అవన్నీ మామూలే. అయితే ఫ్రాన్స్‌లోని బుర్గుండీ ప్రాంతానికి చెందిన 87 ఏళ్ల మైఖెల్‌ పాంట్‌ మాత్రం ప్రపంచంలోనే ఎవరూ తలపెట్టని అభిరుచిని ఎంచుకున్నాడు. అవును... ఆయన పాత యుద్ధ విమానాలు సేకరిస్తాడు. ఆయన వైన్‌యార్ట్‌లో అలా సేకరించిన యుద్ధ విమా నాలు ఒకటి కాదు రెండు కాదు... వందకు పైగా ఉన్నాయి.


book3.2.jpg

యుద్ధ విమానాలు సేకరించడం వెనక పాంట్‌ శ్రమ చాలా ఉంది. 30 ఏళ్ల క్రితం... స్ర్కాప్‌నకు తరలిస్తున్న యుద్ధవిమానాన్ని కొన్నాడు. ఇక అప్పటి నుంచి పనికిరాని ఫైటర్‌ జెట్‌ ఉందని తెలిస్తే చాలు. అక్కడ వాలిపోయి దాన్ని చేజెక్కించుకుని వచ్చాడు పాంట్‌. అలా ఇప్పటిదాకా 110 యుద్ధవిమానాలను సేకరించాడు. ‘‘యుద్ధ విమానాలను చూస్తే నాకు ఉద్వేగంగా ఉంటుంది. అందుకే స్ర్కాప్‌కు పంపించే విమానాలను డబ్బులు చెల్లించి కొనుగోలు చేసేవాడిని.


అలా కొన్ని ఏళ్లుగా ఒక్కొక్కటిగా 110 విమానాలు కొనుగోలు చేశాను’’ అని వాటిని చూస్తూ గర్వంగా చెప్పేవాడు పాంట్‌. ప్రపంచంలో మరెక్కడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఇన్ని యుద్ధ విమానాలు లేవు. అందుకే ‘గిన్నిస్‌ బుక్‌ రికార్డు’ల్లోనూ స్థానం సంపాదించాడు పాంట్‌. మరో విశేషమేమిటంటే... కార్‌ రేసర్‌ అయిన పాంట్‌ దగ్గర విమానాలతో పాటు కార్లు, మోటరు బైక్స్‌ కూడా ఉన్నాయి.


book3.3.jpgదశాబ్దాల కల...

110 యుద్ధ విమానాల సేకరణకు నలభై ఏళ్లకు పైగా సమయం పట్టిందంటారు పాంట్‌. రెండో ప్రపంచయుద్ధంలో సేవలు అందించిన ఫైటర్‌ జెట్స్‌ కూడా పాంట్‌ సేకరించిన వాటిలో ఉన్నాయి. అయితే ఈ యుద్ధ విమానాలు ఏవీ కూడా ఎగిరే స్థితిలో లేవు. కాకపోతే చూడటానికి మాత్రం చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఫ్రాన్స్‌లోని బుర్గుండీ ప్రాంతం వైన్‌ తయారీకి ప్రసిద్ధి. అక్కడ వైన్‌మేకర్‌ అయినటువంటి మైఖెల్‌ పాంట్‌కు 29 ఎకరాల ద్రాక్ష తోట ఉంది. మధ్యలో ఒక విలాసవంతమైన క్యాజిల్‌ కూడా ఉంది. ఒక వైపు వైన్‌ తయారీ కోసం ద్రాక్ష తోట, మరోవైపు వరుసగా నిలబెట్టిన యుద్ధ విమానాలతో చూపరులను ఆ ప్రాంతం విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇందులో రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన యుద్ధ విమానం, ఎఫ్‌ 16 ఫాల్కన్‌ వంటి జెట్స్‌ ఉన్నాయి. సైనిక హెలికాప్టర్లు, మిరేజ్‌ 2 ఫైటర్లు ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధంలో సేవలు అందించిన యూకే మొదటి ఫైటర్‌ జెట్‌నూ చూడొచ్చు.


‘‘మెకానిక్‌ టీమ్‌ని తీసుకుని విమానాలు కొనుగోలు చేసేందుకు వెళ్లే వాణ్ణి. వాటిని వివిధ భాగాలుగా విడగొట్టి, క్రేన్‌ సహాయంతో తరలించే వాణ్ణి’’ అని చెప్పేవారు పాంట్‌. వియత్నాం వార్‌లో ఉపయోగించిన రిపబ్లిక్‌ ఎఫ్‌ - 105 థండర్‌చీఫ్‌ యూ.ఎస్‌ ఎయిర్‌ఫోర్స్‌ జెట్‌ సైతం వైన్‌యార్ట్‌లో ఉంది. ఆయన కొంతకాలం రేసింగ్‌కార్ల డ్రైవర్‌గా పనిచేశాడు. పాంట్‌కి విమానాలతో పాటు కార్లను సేకరించే హాబీ కూడా ఉంది. పాంట్‌ వైన్‌యార్డ్‌లో ఉన్న యుద్ధ విమానాలను సందర్శకులు వీక్షించవచ్చు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, తిరిగి 2 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు సందర్శకులను అనుమతిస్తారు.


అరుదైన యుద్ధ విమానాలను సేకరించిన పాంట్‌ నాలుగేళ్ల క్రితం (2021) చనిపోయారు. ప్రస్తుతం ఆయన కొడుకు క్రిస్టోఫ్‌ పాంట్‌ వైన్‌యార్డ్‌ బాధ్యతలను చూస్తున్నాడు. ‘‘నా తండ్రి 1968 నుంచి 73 దాకా కార్‌రేసర్‌గా ఉన్నాడు. ఆయన ఉపయో గించిన కార్లన్నీ భద్రంగా ఉన్నాయి. వాటిలో ఎక్కువ భాగం స్ర్కాప్‌గానే దొరికాయి. ఆయన సేకరించినవన్నీ ఈ కాలానికి చాలావిలువైనవి. అందుకే ఆయన అభిరుచిని గౌరవిస్తూ వాటిని కాపాడే ప్రయత్నం చేస్తున్నా’’ అంటాడు క్రిస్టోఫ్‌ పాంట్‌. ఈ అరుదైన మ్యూజియాన్ని ఏటా వేలాది మంది సందర్శిస్తున్నారు... ఆశ్చర్యచకితులవుతున్నారు.

Updated Date - Oct 05 , 2025 | 08:57 AM