Share News

Currency: సంపన్న దేశం... అయినా సొంత కరెన్సీ లేదాయో...

ABN , Publish Date - Nov 09 , 2025 | 09:36 AM

లిక్టన్‌స్టైన్‌... స్విట్జర్లాండ్‌, ఆస్ట్రియాల నడుమ ఓ రత్నంలా వెలుగులీనుతోందీ బుల్లి దేశం. చాలామందికి ఈ దేశం ఉన్నట్టే తెలియదు. దేశం మొత్తం సుమారు 160 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంటుంది. అంటే తిప్పికొడితే... మన హైదరాబాద్‌ నగరమంత కూడా ఉండదు.

Currency: సంపన్న దేశం... అయినా సొంత కరెన్సీ లేదాయో...

ఆ దేశానికి సొంత కరెన్సీ లేదు. సొంత భాష ఉండదు. దేశంలో ఒక్కటంటే ఒక్క విమానాశ్రయం కనిపించదు. అయినా అక్కడ నిరుద్యోగం, పేదరికం అనే మాటే ఉండదు. పేరుకు చిన్న దేశమే... కానీ ప్రపంచంలోని అత్యంత ధనిక దేశాల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. ఇంతకీ ఎక్కడుంది?

లిక్టన్‌స్టైన్‌... స్విట్జర్లాండ్‌, ఆస్ట్రియాల నడుమ ఓ రత్నంలా వెలుగులీనుతోందీ బుల్లి దేశం. చాలామందికి ఈ దేశం ఉన్నట్టే తెలియదు. దేశం మొత్తం సుమారు 160 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంటుంది. అంటే తిప్పికొడితే... మన హైదరాబాద్‌ నగరమంత కూడా ఉండదు. జనాభా 30 వేలు మాత్రమే. అక్కడి ప్రజలకు ప్రత్యేకంగా భాష ఏమీ లేదు. జర్మన్‌ భాషనే మాట్లాడతారు. అంతెందుకు విమానాశ్రయం కూడా లేదంటే నమ్ముతారా? చిన్నదేశం, అందులోనూ పర్వత ప్రాంతం కావడం వల్ల విమానాశ్రయ నిర్మాణానికి వీలు కాలేదట. ప్రజలు వేరే దేశాలకు వెళ్లాలనుకుంటే మాత్రం సమీపంలో ఉన్న స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌ (120 కి.మీ.) లేదా జర్మనీలోని ఫ్రెడ్రిచ్‌షాఫెన్‌ (89 కి.మీ.) విమానాశ్రయాలకు చేరుకోవాల్సి ఉంటుంది. ఈ దేశానికి సొంత కరెన్సీ కూడా లేదు. స్విట్జర్లాండ్‌ కరెన్సీ స్విస్‌ ఫ్రాంక్‌నే అక్కడ కూడా ఉపయోగిస్తారు. రాజధాని వడూజ్‌ కేంద్రంగా పాలన సాగుతుంది.


100 మంది పోలీసులే...

లిక్టన్‌స్టైన్‌లో ఎటుచూసినా మధ్యయుగం నాటి కట్టడాలే కనిపిస్తాయి. దేశంలో క్రైం రేటు చాలా తక్కువ. దేశం మొత్తం మీద కేవలం ఏడుగురు నేరస్థులు మాత్రమే జైల్లో ఉన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. శాంతిభద్రతలను కాపాడేందుకు కేవలం 100 మంది పోలీసులే ఉన్నారు. ప్రజలు రాత్రిపూట ఇంటికి తాళాలు కూడా వేయరట. ఈ దేశానికి సైనికదళం లేకపోవడం మరో ప్రత్యేకత. అయితే రాచరిక పాలన కొనసాగుతుంది. ఆ రాజ కుటుంబీకుల వంశం పేరు మీదే ఈ దేశానికి ‘లిక్టన్‌స్టైన్‌’ అనే పేరు వచ్చింది.

book5.jpg


‘ట్యాక్స్‌ హెవెన్‌’ దేశం...

ఇది ప్రపంచంలోని అత్యంత చిన్న దేశాల్లో ఆరోది. అయితేనేం... ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన బ్యాంకులు, ఫైనాన్షియల్‌ కంపెనీలు అక్కడ బోలెడు. ప్రధానంగా పర్యాటకం, ఐటీ, తయారీ రంగాల ద్వారా ఈ దేశానికి ఆదాయం సమకూరుతుంది. అందుకే ప్రపంచంలోని ధనిక దేశాల్లో లిక్టన్‌స్టైన్‌ ఒకటిగా నిలిచింది. పన్నులు కూడా నామమాత్రంగానే ఉంటాయి. అందుకే ఈ దేశాన్ని ‘ట్యాక్స్‌ హెవెన్‌’ దేశం అని అంటారు. పేదరికం, నిరుద్యోగం ఊసే ఉండదు.


ఓటుతో పౌరసత్వం

ఈ దేశ పౌరసత్వం పొందడం అంత సులువేమీ కాదు. మామూలుగా జన్మత:, వివాహం ద్వారా, సాధారణ నేచురలైజేషన్‌ కింద పౌరసత్వం పొందుతారు. వీటితో పాటు ‘కమ్యూనిటీ ఓటు’ ద్వారా కూడా పౌరసత్వం పొందొచ్చు. ఇందులో భాగంగా లిక్టన్‌స్టైన్‌లో 10-15 ఏళ్లు నివసించినవారు మొదటగా అక్కడి స్థానిక మున్సిపాలిటీకి పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆపై సదరు వ్యక్తి నిజాయితీగా జీవిస్తున్నారా? సమాజంలోని వ్యక్తిగా కలిసిపోయారా?? వంటి అంశాల మీద వారున్న కమ్యూనిటీలో పోలింగ్‌ నిర్వహిస్తారు. పాల్గొన్నవాళ్లలో 2/3 వంతు ప్రజలు ‘యస్‌’ అని ఓటు వేస్తే.. అప్పుడు ఆ దరఖాస్తును ప్రభుత్వం ఆమోదించి పౌరసత్వం మంజూరు చేస్తుంది. ఇలా ప్రజల ఓటుతో పౌరసత్వం కల్పిస్తున్న ఏకైక దేశం ఇదే కావడం విశేషం.


స్టాంప్స్‌... ఫేమస్‌..

ఈ దేశపు పోస్టల్‌ స్ట్టాంప్స్‌ ప్రపంచంలోనే చాలా ప్రసిద్ధి. వీటికి చాలా డిమాండ్‌ కూడా. ప్రతీ స్టాంప్‌ ఒక చిన్న ఆర్ట్‌ పీస్‌లా ఉంటుంది. అక్కడి సంస్కృతి, పర్వతాలు, కోటలు, ప్రకృతి దృశ్యాలు, జంతువులు, రాజ కుటుంబం వంటి అంశాలను ప్రతిబింబించేలా ఇప్పటికే ఎన్నో స్టాంప్స్‌ను విడుదల చేశారు. 1912 నుంచి ఇప్పటి వరకు విడుదలైన అన్ని స్టాంపులను, వాటి చరిత్రను.. వడూజ్‌లో ఉన్న పోస్ట్‌ మ్యూజియంలో చూడొచ్చు. మొత్తానికి అభివృద్ధి చెందేందుకు దేశ పరిమాణం, సొంత నియమాలు అవసరం లేదని నిరూపిస్తూ.. అనేక వింతలు, విశేషాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Updated Date - Nov 09 , 2025 | 09:42 AM