Share News

‘పొరుగింటి పుల్లకూర రుచి’ అన్నట్టుగా.. కుర్రకారు ‘కొరియన్‌’ క్రేజ్‌..

ABN , Publish Date - Sep 28 , 2025 | 10:32 AM

‘పొరుగింటి పుల్లకూర రుచి’ అన్నట్టుగా... కుర్రకారుకు ఇంట్లో చేసిన రుచులు నచ్చట్లేదు. బిర్యానీలు, నూడుల్స్‌, పిజ్జాలు ఓల్డ్‌ ట్రెండ్‌... ఇప్పుడంతా ‘కె’ ఫుడ్‌. ‘కొరియన్‌ చికెన్‌’, ‘కొరియన్‌ ఛీజ్‌ బన్‌’... గతేడాది ఫుడ్‌ యాప్స్‌లో ఎక్కువగా సెర్చ్‌ చేసిన పదాల్లో ఉన్నాయంటే ‘కె’ (కొరియన్‌) వంటకాల క్రేజ్‌ మనదేశంలో ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

‘పొరుగింటి పుల్లకూర రుచి’ అన్నట్టుగా.. కుర్రకారు ‘కొరియన్‌’ క్రేజ్‌..

‘పొరుగింటి పుల్లకూర రుచి’ అన్నట్టుగా... కుర్రకారుకు ఇంట్లో చేసిన రుచులు నచ్చట్లేదు. బిర్యానీలు, నూడుల్స్‌, పిజ్జాలు ఓల్డ్‌ ట్రెండ్‌... ఇప్పుడంతా ‘కె’ ఫుడ్‌. ‘కొరియన్‌ చికెన్‌’, ‘కొరియన్‌ ఛీజ్‌ బన్‌’... గతేడాది ఫుడ్‌ యాప్స్‌లో ఎక్కువగా సెర్చ్‌ చేసిన పదాల్లో ఉన్నాయంటే ‘కె’ (కొరియన్‌) వంటకాల క్రేజ్‌ మనదేశంలో ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నవతరం ఈ సరికొత్త రుచుల వెంట పరుగులు తీస్తోంది. నగరాల్లో హోరెత్తుతున్న ‘కె’ ఫుడ్‌ ట్రెండ్‌ విశేషాలే ఈవారం కవర్‌స్టోరీ.

ఇరవై ఏళ్ల క్రితం... నూడుల్స్‌ అంటే మ్యాగీనే. ఆ తర్వాత చైనీస్‌ నూడుల్స్‌ వెంటపడ్డారు. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా ‘కొరియన్‌ రామన్‌’ నూడుల్స్‌. మన దేశంలోనే కాదు... ప్రపంచమంతా వీటి వెంటే పరుగులు పెడుతోంది. ఇంకా కొరియన్‌ బీబీక్యూ, కొరియన్‌ ఫియరీ హాట్‌, కె- చౌ ఛీజ్‌, స్పైసీ రామన్‌... ఇలా సూపర్‌ మార్కెట్‌ నిండా వివిధ రకాల కొరియన్‌ నూడుల్స్‌ కొలువుదీరి కనిపిస్తున్నాయి... ఆకట్టుకుంటున్నాయి. గాఢమైన ఎరుపు రంగు మసాలా సాస్‌తో గాజులాంటి తెల్లని నూడుల్స్‌ తింటోన్న పిల్లల కళ్లు, ముక్కులోంచి నీళ్లు కారుతుంటే... చూసే తల్లులకి భయమేస్తోంది. కానీ పిల్లలు మాత్రం ఓ పక్క నీళ్లు తాగుతూనే, మరో పక్క కె- నూడుల్స్‌ను లాగిస్తుంటారు.


ఈ ఏడాది మార్చిలో వచ్చిన కొరియన్‌ డ్రామా ‘వెన్‌ లైఫ్‌ గివ్స్‌ యూ టాంగెరిన్స్‌’ అత్యద్భుత ఫ్యామిలీ డ్రామాగా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. టాంగెరిన్‌ పదానికి అర్థం నారింజ. జీవితం నారింజలను ఇస్తే రసం చేసుకోవాలని అనుకుంటాం. కానీ అక్కడి ప్రసిద్ధ జెజు ద్వీప నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఆ ద్వీపంలో ఈ పదబంధానికి అర్థం- మీ కృషి, పట్టుదలకు కృతజ్ఞతలు. జీవితంలో అన్నీ ఎదుర్కొంటూ ముందుకు సాగుతోన్న వారి జీవితం స్ఫూర్తిదాయకం అన్నమాట. ‘కె’ సిరీస్‌లలో ఇలా తీపి, ఉప్పు, కారం, పులుపు, వగరు, చేదు... షడ్రుచులను, నవరసాలతో మేళవించి రూపొందిస్తారు. కాబట్టి అవి విశ్వవ్యాప్తంగా విశేష ఆదరణ పొందుతున్నాయి. ప్రతీ ఇంట్లో కొరియన్‌ సిరీస్‌లు ఎంత సాధారణమయ్యాయో అంతేలా కొరియన్‌ రుచులు నవతరం జీవితాల్లో భాగమయ్యాయి.


book4.jpg

పెరిగిన క్రేజ్‌...

ఇటీవలి కాలంలో ఫుడ్‌ డెలివరీ సంస్థల నివేదికలు ఆశ్చర్యం కలిగించే విషయాలను వెల్లడిస్తున్నాయి. 2025 జూలై నాటికి గతేడాదితో పోలిస్తే ఒక్క స్విగ్గీలోనే కొరియన్‌ వంటకాల ఆర్డర్లు 50 శాతం పెరిగాయట. అలాగే కొరియన్‌ ఫుడ్‌ ఆర్డర్‌ పెట్టుకుంటున్న వాళ్లలో 27 శాతం ‘జనరేషన్‌ జెడ్‌’ ఉండడం విశేషం. ఢిల్లీ, బెంగళూరు, ముంబయి, హైదరాబాద్‌ లాంటి మహానగరాలు ఈ ఆర్డర్లలో ముందున్నాయి. అయితే తిరువనంతపురం, వడోదరా, మంగళూరు, మైసూర్‌ లాంటి రెండో స్థాయి నగరాలలో కూడా ఈ ట్రెండ్‌ ఇటీవలి కాలంలో ఊపందుకుంది. ఈ నగరాల్లో కూడా కొరియన్‌ రుచులకు 59 శాతం గిరాకీ పెరిగిందట. ప్రస్తుతం చిన్‌ రమ్యున్‌, సాంయంగ్‌, నాంగ్‌సిమ్‌ లాంటి రామెన్‌ నూడుల్స్‌ రకాలన్నీ సూపర్‌మార్కెట్లలో కూడా విరివిగా దొరుకుతున్నాయి. 2024లో ప్రతి నెలా 7.5 మిలియన్‌ ప్యాకెట్లు అమ్ముడయ్యాయని మార్కెట్‌ విశ్లేషణలు లెక్కలు వేశారు.


book4.3.jpg

ప్రధానంగా ఆహార రంగం విషయానికొస్తే... భారత వినియోగదారుల్లో ఎక్కువ శాతం యువతే. వీరిపై కొరియన్‌ సినిమాలు, సిరీస్‌లు విపరీతమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. వాటిల్లో చూసే ‘కె’ బ్యూటీ ట్రెండ్స్‌, స్టయిల్స్‌, ఫుడ్‌ విషయాల్లో మనదేశంలో చాలా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వీళ్లు బయట తినే ఆహార పదార్థాల్లోనే కాదు... ఇళ్లల్లో వండుకునే వాటిల్లో కూడా కొరియన్‌ మార్క్‌ కనిపిస్తోంది. సహజంగానే యువతీయువకులతో పాటు చిన్నారులు కూడా ప్రపంచ రుచులను ఆస్వాదించడానికి ఉత్సాహపడుతున్నారు.


book4.8.jpg

అందుకే గోచుజాంగ్‌, నువ్వుల నూనె, కిమ్చి, కొరియన్‌ రామెన్‌ ప్యాకెట్లు మన సూపర్‌ మార్కెట్లలో కనిపిస్తున్నాయి. మెక్‌డొనాల్డ్స్‌, కెఎఫ్‌సీ, డొమినోస్‌ లాంటి ఫుడ్‌ అవుట్‌లెట్స్‌లో కూడా గోచుజాంగ్‌ బర్గర్లు, కె స్టయిల్‌ ఫ్రైస్‌, కొరియన్‌ యుజు - పాప్‌ స్పిరిట్‌ లాంటి ఫ్యూజన్‌ డ్రింక్స్‌ లభిస్తున్నాయి. మన రెస్టారెంట్లలో కొరియన్‌ బీబీక్యూ ప్లేటర్స్‌, బుల్గోయి రైస్‌ బౌల్స్‌, చీజీ కొరియన్‌ ఫ్రైడ్‌ చికెన్‌, కింబాప్‌లాంటివి ప్రధాన మెనూల్లోకి వచ్చేశాయి. ఇంకా వందలాది రెస్టారెంట్లలో స్థానిక దేశీ మసాలాలతో కిమ్చి ఫ్రైడ్‌ రైస్‌, పనీర్‌ బుల్గోయి, స్పైసీ తండూరీ బిబిమ్బాంప్‌లను తయారుచేస్తున్నారు. బర్గర్‌లను కూడా కొరియన్‌ సాస్‌లతో కొత్తగా టేస్టీగా చేస్తున్నారు. కిమ్చిని ఇళ్లలో చేసుకునేందుకు వీలుగా ‘ఫ్రైడ్‌ రైస్‌ కిట్స్‌’ లభిస్తున్నాయి. ఇక రెడీ టూ కుక్‌లో హాట్‌ సాస్‌లు, బీబీక్యూ మ్యారినేడ్లు అందుబాటులోకి వచ్చేశాయి.


book4.4.jpg

కారణాలు ఎన్నో...

కొంచెం ఘాటు, కాస్త తీపి, కొంచెం పులుపు, కాస్త వగరు, కొంచెం కారం, కాస్త ఉప్పుతో పాటు ఎంతో రుచిగా ఉంటాయి కొరియన్‌ వంటకాలు. తాజా కూరగాయలు, అన్నం, సోయా సాస్‌, చిల్లీ పేస్టు, అల్లం, వెల్లుల్లి, పులియబెట్టిన బీన్స్‌ వాళ్ల ఆహారంలో ఎక్కువగా కనిపించే పదార్థాలు. ఏదైనా సరే నెమ్మదిగా ఉడికించి వండడం వాళ్లకు అలవాటు. అందుకే మిలీనియల్స్‌, జనరేషన్‌ జెడ్‌ కుర్రకారు కొరియన్‌ వంటకాలని ఇంతలా ఆస్వాదిస్తున్నారు. అయితే భౌగోళికంగా మనకు చాలా దూరంలో ఉన్న కొరియా వంట రుచులు ఇక్కడిదాకా రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.


book4.5.jpg

కె - డ్రామాలు: ఇటీవల కాలంలో భారతీయ యూత్‌ అంతా ‘కె’ మంత్రాన్నే జపిస్తోంది. కె డ్రామాలు, సినిమాలు, సిరీస్‌లు, కొరియన్‌ కల్చర్‌ను బాగా ఫాలో అవుతున్నారు. సినిమాల్లో వేడి ఆవిర్లు చిమ్ముతూ కనిపిస్తోన్న రేమియాన్‌ నూడుల్స్‌, ఫ్రైడ్‌ చికెన్‌ వీక్షకుల చూపుల్ని కట్టిపడేస్తూ సదరు కె రుచులను టేస్ట్‌ చేసేలా ప్రేరేపిస్తున్నాయి.

కళ్లకు సొంపు: కొరియన్‌ వంటకాలు చాలా మటుకు ఆకర్షించే రంగులతో ఉంటాయి. కన్నుల పండుగగా వంటకాలను అలంకరించడంలో కొరియన్లది అందెవేసిన చేయి. అందుకే వాళ్ల వంటకాలన్నీ ఇన్‌స్టా పేజీలను నింపేస్తూ సోషల్‌ మీడియాలో నవతరాన్ని తమ వైపు తిప్పుకుంటున్నాయి.


గుబాళింపు: భారతీయ వంటకాలకు, కొరియన్‌ వంటకాలకూ కొన్ని పోలికలు లేకపోలేదు. రెండింట్లోనూ ఘాటు, కారం ఎక్కువ. రెండూ పరిమళభరితమే. అలాగే మనలాగే పులియబెట్టిన పచ్చళ్లు, స్పైసెస్‌ను వాళ్లు ఎక్కువగా వాడతారు.

మన వంటకాల్లో రోగనిరోధకశక్తి, అరుగుదలను పెంచే యాంటీఆక్సిడెంట్లు అధికం. అలాగే కొరియన్‌ వంటల్లో ‘గట్‌’ ఆరోగ్యానికి మంచి చేసే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.

అయితే కొరియన్‌ వంటకాలు ఇంతలా మన ప్లేట్‌లను తాకడంలో షెఫ్‌ల పాత్ర కూడా ఎంతో ఉంది. కొత్త కొత్త ప్రయోగాలతో భారతీయుల అభిరుచికి దగ్గరయ్యే కొరియన్‌ వంటల్ని వండి వడ్డిస్తున్నారు. గోచుజాంగ్‌ సాస్‌లో తేనే, కెచప్‌లను కలిపి కారం పాళ్లని తగ్గిస్తున్నారు. కొరియన్‌ ఫ్రైడ్‌ రైస్‌, బిబిమ్బాంప్‌లలో మాంసానికి బదులుగా పనీర్‌ను చేర్చి అందరికీ నచ్చేలా తీర్చిదిద్దుతున్నారు. అలాగే బింగ్షు లాంటి డెజర్ట్‌లలో భారతీయ పళ్లు, యాలకుల పొడి, రోజ్‌ సిరప్‌లను కలిపి మన రుచులను కాస్త మిక్స్‌ చేస్తున్నారు. రోటీలు, నాన్‌లకూ సైడ్‌ డిష్‌లుగా కొరియన్‌ కూరల్నీ వడ్డిస్తూ విభిన్నమైన కాంబోలను తేవడంలో మన పాకశాస్త్ర పండితులు విజయం సాధిస్తున్నారు.


book4.6.jpg

యువతరం అభిరుచులకు అనుగుణంగా స్థానిక రుచుల్లో కొరియన్‌ మసాలాలను దట్టించి వంటకాలను సిద్ధం చేస్తూ... కొత్త తరహా వంటలకు శ్రీకారం చుడుతున్నారు. తమ సృజనాత్మకతను మేళవించి మెనూలను కొత్త వంటకాలతో నింపేస్తున్నారు. థాయి, కాంటినెంటల్‌, మెడిటరేనియన్‌, చైనీస్‌ వంటల్లా కొరియన్‌ రుచులు కూడా పూర్తి స్థాయిలో మన నేల మీద స్థిరపడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ప్రత్యేక కొరియన్‌ రెస్టారెంట్లు కూడా వివిధ నగరాలలో పుట్టుకొస్తున్నాయి. భిన్న రుచులను ఆస్వాదించాలనే యువత అభిరుచులకు అనుగుణంగా జరుగుతోన్న మార్పులే ఇవన్నీ. ఈ ట్రెండ్‌ జోరు చూస్తోంటే... మన భారతీయ రుచులకు కాస్త దగ్గరగా ఉండే ‘కె’ రుచులకు మరికొంత కాలం తిరుగులేదనిపిస్తోంది.

- డి.పి. అనురాధ


హాల్యూ.. ద కొరియన్‌ వేవ్‌

కరోనా మహమ్మారి తరవాత ‘కె’ డ్రామాల పాపులారిటీ ఊహించనంతగా పెరిగింది. దాంతో పాటు ‘కె’ పాప్‌ మ్యూజిక్‌, ‘కె’ బ్యూటీ, ‘కె’ వంటకాలు ప్రపంచాన్నంతా చుట్టుముట్టాయి. దీన్నే ‘హాల్యూ’ - ద కొరియన్‌ వేవ్‌గా పిలుస్తున్నారు. ఈ ‘కె’ తాకిడికి మనదేశం మినహాయింపు కాదు.

పెద్ద పెద్ద రెస్టారెంట్లు వివిధ దేశాల వంటకాలతో పాటు ‘కె’ రుచులను అందించడం క్రమంగా మొదలైంది. మెట్రో నగరాల్లో ప్రత్యేక కొరియన్‌ రెస్టారెంట్లూ వచ్చేశాయి. ‘కొరీస్‌’, ‘గంగ్‌ ద ప్యాలెస్‌’, ‘సియోల్‌’, ‘హాన్స్‌ కిచెన్‌’, ‘ద షిమ్‌ తూ’... ఈ కొరియన్‌ రెస్టారెంట్లలో అడుగుపెడితే ఆ దేశానికి వెళ్లి, వాళ్ల రుచులను తాపీగా ఆస్వాదిస్తోన్న ఫీలింగ్‌ కలుగుతుంది. హైదరాబాద్‌, విశాఖలలో కూడా కొరియన్‌ రెస్టారెంట్లు, కెఫేలు వచ్చేశాయి.


కొరియన్‌ వంటకాలు చూడటానికి భారీగా ఉంటాయి కానీ, వాటిని తింటే కడుపులో తేలికగా ఉంటూనే, చక్కని భోజనం ఆరగించామనే అనుభూతి కలుగుతుంది. కొరియన్‌ వంటకాలను తొలిసారి చూసినప్పుడు ‘అబ్బో ఇలాంటి వంటకాలను ఇళ్లలో అస్సలు చేసుకోలేం’ అనిపిస్తుంది. కానీ కొన్ని రకాల వంటలను సులభంగా ఇళ్లల్లో తయారుచేయొచ్చు. ఇన్‌స్టంట్‌ రామెన్‌ నూడుల్స్‌కి చూడచక్కని టాపింగ్స్‌ వేస్తే లుక్కే మారుతుంది. అలాగే కిమ్చితో ఫ్రైడ్‌ రైస్‌ను కలిపితే బాగుంటుంది. నువ్వుల నూనెతో తోఫును గ్రిల్‌ చేస్తే లుక్కే కాదు టేస్టూ మారుతుంది. ఆదివారం మధ్యాహ్నం కొత్త వంటలకు బదులుగా రోజూ వండేవే వండేసి కీరా కిమ్చి, స్కాలియన్‌ ప్యాన్‌కేక్స్‌ ను జత చేస్తే పెద్దలే కాదు... పిల్లలూ సర్‌ప్రైజ్‌గా ఫీలవుతారు.


ఆన్‌లైన్‌ సేల్స్‌లో కొరియన్‌ రుచులు గతేడాది కన్నా ఈ ఏడాది 50 శాతం వృద్ధిని సాధించాయి. అంటే భారతీయులు కొరియన్‌ రుచులను ఎంతగా ఆస్వాదిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. మన దేశంలో పాపులర్‌ అయిన కొన్ని కొరియన్‌ వంటకాలివి...

- కిమ్చి: ఆవకాయలాంటి మన నిలువ పచ్చళ్లతో దీన్ని సరిపోల్చవచ్చు. కాకపోతే ఇందులో క్యాబేజీ, ముల్లంగిని వాడతారు. అలాగే సీజనింగ్‌ కోసం మిర్చి, అల్లం, వెల్లుల్లి, చేపల సాస్‌ను ఉపయోగిస్తారు. పుల్లని సలాడ్‌ లేదా పచ్చడిగా కిమ్చిని పేర్కొనాలి. కాస్త ఘాటుగా, మరికాస్త పుల్లగా ఉంటుంది. అందుకే ఎక్కువగా సైడ్‌ డిష్‌గా లాగిస్తుంటారు. కొరియా ఆహారంలో ప్రధానమైనదిగా కిమ్చిని పేర్కొనాలి. ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్స్‌లో ఈ కొరియన్‌ డిష్‌ లభిస్తోంది. కాకపోతే స్థానిక రుచులను జొప్పించేందుకు కొద్దిగా బెల్లం, కారం అదనంగా కలుపుతున్నారు. పోషకాలపరంగా వీటిల్లో విటమిన్స్‌, యాంటీఆక్సిడెంట్లతో పాటు ప్రోబయాటిక్‌ లభిస్తాయి.


- కొరియన్‌ ఫ్రైడ్‌ చికెన్‌: మనదేశంలో చాలా పాపులరైన కొరియన్‌ వంటకమిది. చికెన్‌ తాజాగా, కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటుంది. స్టిక్కీ స్వీట్‌ స్పైస్‌ సాస్‌లో అద్దుకుని ఈ చికెన్‌ను తింటుంటారు. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌లలో ప్రత్యేక కొరియన్‌ ఫ్రైడ్‌ చికెన్‌ అవుట్‌లెట్స్‌ కూడా వచ్చేశాయి. ఫ్రైడ్‌ చికెన్‌ రుచిలో భిన్నమైనది ట్రై చేయాలంటే ఈ కొరియన్‌ రుచిని ఆస్వాదించొచ్చు.

- రేమియాన్‌: ఇన్‌స్టంట్‌ నూడుల్స్‌లో కొరియా రకానికి చెందినవి ఇవి. ముందే ఉడికించి, ఎండబెట్టిన నూడుల్స్‌. కాబట్టి ఉడకడానికి తక్కువ సమయం పడుతుంది. రంగు, కారం, ఘాటు ఎక్కువ. వీటిల్లో ఎన్నో రకాలున్నాయి. సామ్యాంగ్‌ స్పైసీ నూడుల్స్‌ కూడా ఈ రకానికి చెందినవే. కోడిగుడ్డు, ఉల్లికాడల టాపింగ్స్‌తో ఎక్కువగా ఆరగిస్తుంటారు.


- గోచుజాంగ్‌: కొరియా సంప్రదాయ రుచుల్లో ముఖ్యమైనది. ఘాటైన మసాలాగా పేర్కొనవచ్చు. సోయాబీన్స్‌, ఎండు మిర్చి, బియ్యం, ఉప్పును కలిపి పులియబెట్టడం వల్ల గోచుజాంగ్‌ తయారవుతుంది. స్పైసీగా ఉంటుంది. వాసన కూడా ఘుమఘుమలాడుతుంది. ఏ వంటకంలో వేసినా రుచి అద్దిరిపోతుంది. మన దేశంతోపాటు అనేక దేశాల్లో ఫేమస్‌.

- కింబాప్‌: ఇదో స్టార్టర్‌. అన్నం, కూరగాయలను ఉడికించి... అందులో గుడ్డు, చేపలు లేదా మాంసం చేర్చి సీవీడ్‌లో ర్యాప్‌ చేస్తారు. కొరియాలోనే కాదు ఇండియాలో కూడా పాపులర్‌ స్నాక్‌గా కింబాప్‌ పేరు తెచ్చుకుంది. రెడీమేడ్‌ రోల్స్‌గా కూడా వీటిని అమ్ముతున్నారు.


- హడ్డాక్‌: కొరియన్‌ స్వీట్‌ ప్యాన్‌కేక్‌. పల్లీల పొడి, దాల్చిన చెక్క, బ్రౌన్‌ షుగర్‌తో దీన్ని తయారుచేస్తారు. క్రేజీ స్ట్రీట్‌ఫుడ్‌గా పేరుంది. భారతీయ రెస్టారెంట్లలో కూడా కనిపిస్తోంది.

- ట్టొక్‌బోకీ: కంటికి ఇంపుగా అనిపించే కొరియన్‌ స్ట్రీట్‌ ఫుడ్‌ ఇది. స్పైసీ స్వీట్‌సాస్‌లో అద్దుకుని తినే రైస్‌ కేక్‌ ట్టొక్‌బోకీ. నములుతుంటే ఆ రుచే వేరు. సూపర్‌ మార్కెట్లలో ‘రెడీ టూ కుక్‌’ ప్యాకెట్లలో లభిస్తోంది. ఇళ్లల్లో సులభంగా తయారుచేస్తూ కొరియన్‌ రుచులను ఆస్వాదిస్తోంది కుర్రకారు.

Updated Date - Sep 28 , 2025 | 10:32 AM