రైలుబండి... బాగా నెమ్మదండీ...
ABN , Publish Date - Aug 31 , 2025 | 07:44 AM
పేరులోనే ఎక్స్‌ప్రెస్ ఉంది కానీ ఇది గూడ్సు కన్నా నెమ్మదిగా ప్రయాణిస్తుంది. అందుకే ప్రపంచంలోనే అత్యంత నెమ్మదిగా వెళ్లే రైలుగా గుర్తింపు పొందింది. ఎంత నెమ్మదిగా వెళ్తుందంటే... మొత్తం 290 కిలోమీటర్ల ప్రయాణానికి సుమారు 8 గంటల సమయం పడుతుంది. దీని సగటు వేగం గంటకు కేవలం 37 కిలోమీటర్లు మాత్రమే.
ఒకవైపు బుల్లెట్ ట్రైన్స్, స్పీడ్ రైళ్లు పట్టాలపై పరుగులు తీస్తుంటే... ఈ కాలంలో నత్తనడకను గుర్తుకుతెచ్చే ఓ రైలు ఉందంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. దాని పేరు ‘గ్లేసియర్ ఎక్స్‌ప్రెస్’.
పేరులోనే ఎక్స్‌ప్రెస్ ఉంది కానీ ఇది గూడ్సు కన్నా నెమ్మదిగా ప్రయాణిస్తుంది. అందుకే ప్రపంచంలోనే అత్యంత నెమ్మదిగా వెళ్లే రైలుగా గుర్తింపు పొందింది. ఎంత నెమ్మదిగా వెళ్తుందంటే... మొత్తం 290 కిలోమీటర్ల ప్రయాణానికి సుమారు 8 గంటల సమయం పడుతుంది. దీని సగటు వేగం గంటకు కేవలం 37 కిలోమీటర్లు మాత్రమే. ఈ వింత రైలు స్విట్జర్లాండ్‌లోని ఆల్ఫ్స్ పర్వతాల్లో... అండర్‌మాట్ మీదుగా జెర్మాట్, సెయింట్ మోరిట్జ్ రైల్వేస్టేషన్లను కలుపుతుంది.

ఈ మార్గంలో 291 వంతెనలు, 91 సొరంగాల గుండా వెళ్తూ ప్రయాణికులకు థ్రిల్లింగ్ అనుభూతిని పంచుతుంది. అందుకే ఇందులో ప్రయాణించేందుకు పర్యాటకులు తెగ ఉత్సాహం చూపుతారు. ‘గ్లేసియర్ ఎక్స్‌ప్రెస్’ ప్రయాణించే మార్గంలో పచ్చని పట్టుతివాచీ పరిచినట్లుండే లోయలు, ఎత్తైన కొండలు, గలగలమని పారే సెలయేళ్లు, మంచు దుప్పటి కప్పుకున్న పర్వతాలు... ఇలా ఎటు చూసినా ప్రకృతి అందాలతో అలరారే దృశ్యాలు ప్రయాణికుల మదిని దోచుకుంటాయి.
ఇందులో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్‌తో పాటు ప్రత్యేకంగా ఎక్స్‌లెన్స్ క్లాస్ కోచ్ కూడా ఉంది. ఎక్స్‌లెన్స్ కోచ్‌లో ప్రయాణించేవారికి ఫైవ్‌స్టార్ సర్వీస్‌ను అందిస్తారు. ఆహారం, పానీయాలు సహా అన్ని సదుపాయాలు ఉంటాయి. ఈ ట్రైన్ ఎయిర్ కండీషనింగ్, వివిధ భాషల్లో ఆడియో గైడ్ వంటి అత్యాధునిక సౌకర్యాలను కలిగి ఉంటుంది. దారి పొడవునా ఆయా ప్రాంతాల చరిత్ర, సంస్కృతిని ప్రయాణికులకు వివరిస్తుంది. పర్యాటకులు ఆయా ప్రదేశాల విశిష్టతలు తెలుసుకుంటూ, కిటిలోంచి ప్రకృతి దృశ్యాలను ఆస్వాదిస్తూ... సరికొత్త ప్రపంచంలో విహరిస్తారు.
1930 నుంచి...
మొదటి గ్లేసియర్ ఎక్స్‌ప్రెస్ 1930 జూన్‌లో జెర్మాట్‌లో ప్రారంభమైంది. రెండో ప్రపంచయుద్ధం కారణంగా కొన్నేళ్లు ఈ రైలు నడవలేదు. తర్వాత మళ్లీ సేవలు ప్రారంభమయ్యాయి. అయితే 1982 వరకు కేవలం వేసవిలోనే నడిచేది. ప్రస్తుతం అక్టోబర్ నుంచి డిసెంబర్ (మొదటివారం)వరకు 2 నెలలు మినహా ఏడాది పొడవునా నడుస్తుంది. శీతాకాలంలో (డిసెంబర్ మధ్య నుంచి ఏప్రిల్) అయితే రోజుకు ఒకసారి, వేసవిలో(మే చివరి నుంచి అక్టోబర్ మధ్య వరకు) రోజుకు రెండుసార్లు నడుస్తుంది. ‘జీవితంలో ఒక్కసారైనా ఈ రైలు ప్రయాణాన్ని అనుభూతి చెందాల్సిందే’ అంటూ అందుకు సంబంధించిన ఫొటోలను ప్రయాణికులు సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ ‘సో’్ల ట్రైన్ సంగతులు కాస్త.. జనాల్లోకి చాలా స్పీడ్‌గా వెళ్లాయి.