Share News

మా పెళ్లికి రండి..

ABN , Publish Date - Sep 14 , 2025 | 08:29 AM

పెళ్లిళ్లకు ఆర్భాటంగా ఖర్చుచేసి, బంధుమిత్రులను ఆహ్వానించడం తెలిసిందే. అయితే ఎదురు డబ్బిచ్చి పెళ్లిళ్లకు హాజరయ్యే అతిథుల ట్రెండ్‌ మొదలయ్యింది. విదేశీ టూరిస్టులు మనదేశంలోని ఆయా ప్రాంతాల్లో పర్యటించాలని అనుకున్నట్టే... వివిధ రాష్ట్రాల్లో విభిన్న సంస్కృతీ సంప్రదాయాలతో జరిగే పెళ్లి వేడుకల్లో పాలుపంచుకోవాలని ఉత్సాహం చూపుతున్నారు.

మా పెళ్లికి రండి..

పెళ్లిళ్లకు ఆర్భాటంగా ఖర్చుచేసి, బంధుమిత్రులను ఆహ్వానించడం తెలిసిందే. అయితే ఎదురు డబ్బిచ్చి పెళ్లిళ్లకు హాజరయ్యే అతిథుల ట్రెండ్‌ మొదలయ్యింది. విదేశీ టూరిస్టులు మనదేశంలోని ఆయా ప్రాంతాల్లో పర్యటించాలని అనుకున్నట్టే... వివిధ రాష్ట్రాల్లో విభిన్న సంస్కృతీ సంప్రదాయాలతో జరిగే పెళ్లి వేడుకల్లో పాలుపంచుకోవాలని ఉత్సాహం చూపుతున్నారు. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుని, పెళ్లి వేదిక వద్ద వాలిపోయి తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. ‘జాయిన్‌ మై వెడ్డింగ్‌’ తరహా ఆన్‌లైన్‌ ఆహ్వానాలపై ఓ లుక్కేద్దాం...

భారతీయ పెళ్లిళ్లను చూడాలనుకునే విదేశీ అతిథుల్ని, వారిని ఆహ్వానించే వారినీ ఒకేదగ్గరకు తీసుకువస్తున్నాయి ‘జాయిన్‌ మై వెడ్డింగ్‌’ తరహా వేదికలు. తమ పెళ్లి సంప్రదాయాల్ని పరిచయం చేయాలనుకున్న భారతీయులు... ఆయా వెబ్‌సైట్‌లలో రిజిస్టర్‌ చేసుకుంటున్నారు.పెళ్లికి సుమారు పదిమంది దాకా విదేశీ అతిథులు హాజరైతే వధూవరులు లక్ష రూపాయలకు పైగానే పొందొచ్చు. పెళ్లికి విదేశీ అతిథులు కూడా వచ్చినట్టు ఉంటుంది. వారి నుంచి ఆదాయం పొందడంతో పాటు అదొక గౌరవంగానూ భావిస్తున్నారు.


వధూవరుల ఫొటోలు, పెళ్లితేదీ, ఎన్నిరోజులు వేడుకలు జరుగుతాయి? ఏ రోజు ఏ కార్యక్రమాలు నిర్వహిస్తారు? వారికి కల్పించే సౌకర్యాలు... ఇలాంటి విషయాలు నమోదు చేయాల్సి ఉంటుంది. పెళ్లిలో పెట్టే భోజనం... వెజ్‌, నాన్‌వెజ్‌, మందు, చిందు ఉంటే ముందుగానే తెలియజేయాలి. ఇవేగాక డ్రెస్‌కోడ్‌, అక్కడ మాట్లాడే భాష, వేడుక జరిగే ప్రదేశంతో పాటు ఫోన్‌ నంబర్‌ ఇవ్వాల్సి ఉంటుంది. వీలైతే వధూవరుల స్నేహబంధం ఎలా మొదలైంది, వారి ప్రేమకథ.. వంటివి కూడా పంచుకోవచ్చు.

ఓర్సీ పార్కనీ అనే ఆస్ట్రేలియా మహిళ 2016లో ‘జాయిన్‌ మై వెడ్డింగ్‌’ పేరిట వెబ్‌సైట్‌ను క్రియేట్‌ చేసింది. అప్పుడది ఒక చిన్న స్టార్టప్‌. కానీ ఇప్పుడది ట్రెండ్‌గా మారింది. ప్రపంచ దేశాల నుంచి భారతీయ సంప్రదాయాలను తెలుసుకోవడానికి, లోతుగా అధ్యయనం చేయడానికి వస్తున్న విదేశీ అతిథుల సంఖ్య పెరుగుతోంది.


book4.jpg

విదేశీయులు తమకు కావాల్సిన ప్రాంతంలో జరిగే పెళ్లిని సెలెక్ట్‌ చేసుకుని, టికెట్‌ కొనుక్కొని మరీ కళ్యాణమండపాల్లో వాలిపోతారు. ఒక్కరోజు వేడకకు హాజరైతే.. సుమారు 150 డాలర్లు అంటే మన కరెన్సీలో సుమారు 13,200 (ఒక్కో వ్యక్తికి) రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక పెళ్లి పూర్తి తతంగం మొత్తం అంటే రెండు రోజులు చూడాలంటే 250 డాలర్లు (సుమారు రూ. 20 వేలు) చెల్లించాలి. కార్యక్రమాలకు అనుగుణంగా రుసుములు ఉంటున్నాయి.

ఆన్‌లైన్‌లో సినిమా టికెట్‌ బుక్‌ చేసుకున్నట్టుగా వివాహ సందర్శనకు టికెట్‌ బుక్‌ చేసుకుంటారు. మొత్తం సొమ్ములో 60 శాతం వధూవరులకు వెళుతుంది. అనుకోని పరిస్థితుల్లో వివాహం రద్దు అయితే వారు చెల్లించిన మొత్తం తిరిగి ఇచ్చేస్తారు.


విదేశీయులు సంప్రదాయ దుస్తులు ధరించి వేడుకల్లో భాగ మవుతారు. సంగీత్‌లో డాన్స్‌, హల్దీ ఫంక్షన్‌లో సందడి చేస్తారు. విందు భోజనాల్లో వంటకాలను రుచి చూడటంతో పాటు... వడ్డన లోనూ పాలు పంచుకుంటారు.

తాజా పెళ్లిళ్ల సీజన్‌లో కొన్ని వేల మంది విదేశీయులు భారతీయ వివాహ వేడుకల్లో పాల్గొనడానికి టికెట్లు కొనుక్కున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా గోవా, కేరళ, రాజస్థాన్‌, ఢిల్లీ, తమిళనాడు, ఉత్తరాఖండ్‌, మహారాష్ట్రలతో పాటు... తెలుగు రాష్ట్రాల్లోనూ హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, విజయవాడ, వైజాగ్‌, రాజమండ్రి, తిరుపతి వంటి ప్రాంతాలకు చెందినవారు సైతం విదేశీయుల్ని ఆహ్వానిస్తున్నారు.

Updated Date - Sep 14 , 2025 | 08:29 AM