Share News

పాతిక లక్షల జీవితాలకు వెలుగై..

ABN , Publish Date - Sep 14 , 2025 | 10:21 AM

ఒక వస్తువు వెయ్యి రూపాయలు ఉండొచ్చు.. లక్ష.. లేదా.. కోట్లు కూడా ఉండొచ్చు.. అంత డబ్బుంటే కొనవచ్చు. కానీ.. జీవించే హక్కు విలువెంత? దానికి ఖరీదు కట్టొచ్చా.. ఎక్కడ దొరుకుతుంది.. ఎన్ని లక్షలు పెడితే వస్తుంది? ఈ ప్రశ్నకు సారస్వత ప్రపంచం ఇచ్చిన ఏకైక సమాధానం ‘విద్య’.

పాతిక లక్షల జీవితాలకు వెలుగై..

ఒక వస్తువు వెయ్యి రూపాయలు ఉండొచ్చు.. లక్ష.. లేదా.. కోట్లు కూడా ఉండొచ్చు.. అంత డబ్బుంటే కొనవచ్చు. కానీ.. జీవించే హక్కు విలువెంత? దానికి ఖరీదు కట్టొచ్చా.. ఎక్కడ దొరుకుతుంది.. ఎన్ని లక్షలు పెడితే వస్తుంది? ఈ ప్రశ్నకు సారస్వత ప్రపంచం ఇచ్చిన ఏకైక సమాధానం ‘విద్య’. ఒక మనిషి జీవితంలో ఆత్మవిశ్వాసంతో జీవించే హక్కును సాధించాలంటే చదువుతోనే సాధ్యం అవుతుంది అని నిరూపిస్తోంది ‘ఎడ్యుకేట్‌ గర్ల్స్‌’ సంస్థ. పాతిక లక్షలమంది బడిమానేసిన బాలికల జీవితాలకు పునర్జన్మనిచ్చి.. జీవించే హక్కును కల్పించింది. అందుకే ప్రఖ్యాత రామన్‌ మెగసెసె అవార్డు అందుకున్న తొలి భారతీయ స్వచ్ఛంద సంస్థగా చరిత్ర సృష్టించింది..

‘‘ఏంటి విశేషం? మిఠాయిలు పంచుతున్నావు.. ఊరంతా నీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఏదో సాధించావు? మీ తల్లిదండ్రులు పటాసులు కూడా కాల్చారు.. ఇంతకుముందు మన బంధువుల్లో ఎవ్వరూ ఇలాంటి పండగ చేయలేదు..’’ అన్నాడు నులక మంచం మీద కూర్చున్న ఓ పెద్దాయన. మిఠాయి పొట్లం పట్టుకున్న ఆ పాప కళ్లల్లో మెరుపు. రెక్కలు కట్టుకుని ఆకాశంలో విహరించినంత సంబరం. ‘‘తాతయ్యా.. తాతయ్యా.. నేను మళ్లీ బడికి వెళ్లాను కదా.. ఈసారి పదో తరగతి ఫస్టుక్లాసులో పాసయ్యాను. మన ఊర్లో ఇన్ని మార్కులతో పాస్‌ అయిన తొలి స్టూడెంటును నేనే!. పొద్దున్నే మా ఇంటికి టీచర్లు అందరూ వచ్చారు. ఇదిగో ఈ మిఠాయిలు తెచ్చారు. పేపర్‌లో కూడా నా ఫోటో వేశారు.. మన ఊరి గురించి రాశారు..’’ అంటూ ఉప్పొంగిపోయిందా చిన్నారి. తాత కళ్లల్లో నీళ్లు తిరిగాయి. వణుకుతున్న ఆ చేతితో ప్రేమగా విద్యార్థి తల నిమిరి ఆశీర్వదించాడు..


ఈ రోజుల్లో పదోతరగతి పాసవ్వడం అస్సలు విషయమే కాదు. అత్యధిక మార్కులు సాధించడమూ వార్త కాదు. మరెందుకు ఆ విద్యార్థిని పాసయితే ఊరంతా న్యూస్‌ అయ్యింది...?

బిహార్‌లో అదొక మారుమూల గ్రామం. మేఘా (అసలుపేరు కాదు) అత్యంత వెనుకబడిన సామాజికవర్గంలో పుట్టింది. ఇంకా చెప్పాలంటే ఆ ఊర్లో పెద్దగా చదువుకున్న వాళ్లెవ్వరూ లేరు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు గొర్రెలకాపరులు. మేఘా కొన్నాళ్లు బడికి వెళ్లి మానేసింది. ‘‘మనకెందుకే సదువు. జీవాలు (గొర్రెలు) బువ్వ పెడతాయి. అడవికెళ్లి వాటిని మేతకు తీసుకెళ్లు’’ అంటూ బడి మాన్పించారు తల్లిదండ్రులు. నాలుగేళ్లు అడవి జీవితం అనుభవించింది మేఘా. గొర్రెలకాపరిగా మారింది.


book6.3.jpg

ప్రపంచం ఏమీ తెలీదు. అమాయక ముఖం. కొడిగట్టిన దీపంలాంటి కళ్లు. చింపిరి జుట్టు. చిరిగిపోయిన బట్టలు. మొత్తంగా మట్టికొట్టుకుపోయిన దేహం. ఆ అవతారంలో కనిపించిన మేఘా భుజాన్ని తట్టింది ఒక చేయి.. ‘‘ఎందుకు తల్లీ నువ్వీ వయసులో గొర్రెలు కాస్తున్నావు..? నీ చిట్టి బుర్రకు కలలు లేవా? ఇదే జీవితం అనుకున్నావా?’’ అందా ఆత్మీయ గొంతు. మేఘా దగ్గర ఎలాంటి సమాధానం లేదు. మౌనం, అమాయకత్వం తప్ప! భుజంతట్టిన ఆ చేయి.. ‘ఎడ్యుకేట్‌ గర్ల్స్‌’ స్వచ్ఛందసంస్థ ప్రతినిధి పూజ. రెండు రోజులు గడిచాక మేఘా ఇంటికెళ్లిన ఆమె.. బాలిక తల్లిదండ్రులు, బంధువులు, ఊర్లోని పెద్దలతో ఒక సమావేశం ఏర్పాటు చేసి... మేఘా జీవితం ఎలా బలైందో.. ఆమె చదువుకుంటే ఎలా ఉండేదో కళ్లకు కట్టినట్లు వివరించింది.


కమ్యూనిటీ సమావేశానికి హాజరైన వాళ్లందరి కళ్లలో బొటబొటా కన్నీళ్లు రాలాయి. ఎలాగైనా సరే.. మేఘా మళ్లీ చదువుకోవాలి.. మళ్లీ బడికి వెళ్లాలి? అనేలా ఊర్లో చిన్నపాటి ఉద్యమం బయలుదేరింది. ఆ స్వచ్ఛందసంస్థ పుణ్యమాని ఆ బాలిక మళ్లీ బడికి వెళ్లింది. ఇప్పుడు పదోతరగతి అత్యధిక మార్కులతో పాసై సంచలనం సృష్టించింది. ఆ స్ఫూర్తితో వందల మంది బాలికలు మళ్లీ బడికి వెళ్లారు. కొత్త జీవితం ప్రారంభించారు. ఒక్క బిహార్‌లోని పల్లెలే కాదు.. ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లాంటి రాష్ట్రాల్లో అలాంటి విద్యార్థుల సంఖ్య వేలు, లక్షలు దాటింది. ఎడ్యుకేట్‌గర్ల్స్‌ సంస్థ నాలుగు రాష్ట్రాల్లో 30 వేల పల్లెల్లోని 20 లక్షల మంది బాలికలకు కొత్త జీవితం ప్రసాదించింది. అందుకే మన దేశంలో ఆడపిల్లల చదువుకు కృషి చేస్తున్న స్వచ్ఛందసంస్థల్లో తొలిసారి ప్రఖ్యాత రామన్‌మెగసెసె (2025) అవార్డు పొందింది ఎడ్యుకేట్‌ గర్ల్స్‌ సంస్థ.


book6.4.jpg

చదువుల విలువ తెలుసు..

ఇది ఆధునిక తరం. ఆస్తులు అంతస్థులకన్నా చదువుకే విలువు ఎక్కువ. కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాల వారీగా తారతమ్యాలు మనుషుల్ని వేరుచేయొచ్చు కానీ.. ఉన్నత చదువులు చదువుకున్న పట్టభద్రులకు ప్రపంచవ్యాప్తంగా ఒక్కటే విలువ ఉంటుంది. విద్యార్హతలు, నైపుణ్యం, మేథోసామర్థ్యానికి రానురాను విలువ పెరుగుతుందే తప్ప తగ్గదు. సామాజిక మార్పునకు అలాంటి చదువే కీలకం అని సంపూర్ణంగా విశ్వసించిన వ్యక్తి ఢిల్లీకి చెందిన సఫీనా హుస్సేన్‌. ఎందుకంటే ఆమె ఉన్నతచదువులు చదివిన చదువరి. ప్రపంచ ప్రఖ్యాత లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌ అండ్‌ పొలిటికల్‌ సైన్స్‌లో గౌరవ డాక్టరేట్‌ అందుకున్నారు.


అంతర్జాతీయ సంస్థల్లో పిలిచి ఉద్యోగమిచ్చేంత అర్హతలు ఆమెకున్నాయి. కానీ.. వెళ్లలేదు. మన దేశం పల్లెల్లోని నిరుపేద కుటుంబాల్లో బడి మానేసిన ఆడపిల్లల జీవితాలే కళ్లకు కనిపించాయి. ‘‘ఉత్తర భారతంలోని అనేక గ్రామీణ ప్రాంతాల్లో నేను తిరిగాను. ఎంతోమంది ఆడపిల్లలకు చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసి జీవితాన్ని నాశనం చేస్తున్నారు. గొర్రెలు, మేకలు, పశువుల కాపర్లుగా మారుస్తున్నారు. కూలీ’’ పనులకు పంపిస్తున్నారు. బిందెల్లో నీళ్లను తీసుకొచ్చేందుకు బడి మాన్పించిన వారున్నారు. వీటన్నిటికీ కారణం పేదరికం, పాతకాలపు సామాజిక కట్టుబాట్లు, అవగాహన లేని నమ్మకాలు.. బడి మానేసిన ఒక్క అమ్మాయికి తిరిగి చదువుచెప్పిస్తే.. ఆ తరం బాగుపడినట్లే!. మూకుమ్మడిగా సమాజాన్ని మార్చలేము.


book6.2.jpg

వ్యక్తి మారితే దానంతట అదే మారుతుంది..’’ అంటారు సఫీనా. చదువుకోని బాలికల జీవితాలను చూసి చలించిన ఆమె.. ఒక సుధీర్ఘ లక్ష్యం పెట్టుకుంది. ప్రతీ రాష్ట్రంలో బడిమానేసిన పిల్లలకు తిరిగి చదువు చెప్పించడం, ఆత్మవిశ్వాసాన్ని కలిగించడం, ఆర్థిక స్వావలంభన దిశగా ప్రయాణించేలా ప్రోత్సహించడం... గౌరవప్రదంగా జీవించే హక్కును పొందేలా చేయడం.. వంటివన్నీ ఆమె లక్ష్యాలు. ఈ బృహత్తర కార్యక్రమానికి వేదిక ఎడ్యుకేట్‌ గర్ల్స్‌. ముంబయిలో కేంద్ర కార్యాలయం నెలకొల్పి... రాజస్థాన్‌, బిహార్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్రలలోని అనేక చోట్ల ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటు చేశారు సఫీనా హుస్సేన్‌.


నిజాయితీతో తను చేస్తున్న సేవకు పలు ప్రభుత్వ, కార్పొరేట్‌, ఐటీ సంస్థలతోపాటు అంతర్జాతీయ సంస్థలు సైతం తోడ్పాటును అందించాయి. యాక్సెంచర్‌, గోల్డ్‌మాన్‌శాచ్‌, వరల్డ్‌బ్యాంక్‌, ఐటీసీ, యూబీఎస్‌, యూనిసెఫ్‌, ఎన్‌ఎస్‌సీ, మిచిగాన్‌ యూనివర్శిటీ, డిబీఐ.. ఇలా పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తోడుగా నిలిచాయి. సఫీనా హుస్సేన్‌ కృషికి మెచ్చిన కేంద్రప్రభుత్వం సైతం నీతిఅయోగ్‌ వుమెన్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ అవార్డు అందించింది. మిలీనియం అలయెన్స్‌ అవార్డు, ఎంఐటీ, స్కోల్‌, వరల్డ్‌బ్యాంక్‌ వంటి సంస్థలన్నీ సఫీనాను గౌరవించాయి. ఆమె సామాజిక సేవకు మరింత నైతిక బలం తోడైంది. ఉత్తరాది రాష్ట్రాల్లోని మరిన్ని పల్లెలకు సేవలను విస్తరించింది.


book6.5.jpg

వాలంటీర్ల అంకిత భావం..

ఎడ్యుకేట్‌గర్ల్స్‌ స్వచ్ఛందసంస్థ మిగిలిన సంస్థలకంటే కాస్త భిన్నం. ముందుగా సేవాదృక్పథం కలిగిన యువతీ యువకులు, పెద్దలకు నాణ్యమైన శిక్షణ అందిస్తుంది. ఒకే ఒక్కరి జీవితాన్ని మార్చినప్పుడు వాళ్ల కళ్లలో మెరిసే కాంతిని చూసినప్పుడు కలిగే సంతృప్తి.. మనం ఎంత సంపాదించినా రాదు అన్నది సంస్థ ఉద్దేశ్యం. ఈ తత్వాన్ని అర్థం చేసుకున్న సేవకులు వాలంటీర్లుగా చేరారు. వీళ్లే సంస్థకు బలగం. గ్రామస్థాయికి సంస్థ ఉద్దేశ్యాలను చేరవేరుస్తారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా సేవా దృక్పథంతో వ్యవహరిస్తారు. ఎడ్యుకేట్‌గర్ల్స్‌ సంస్థకు సుమారు పాతికవేలకు పైగా వాలంటీర్ల సైన్యం ఉంది. వీరు గ్రామాల్లోని ఇంటింటికీ తిరిగి.. బడి మానేసిన పిల్లల్ని గుర్తించి.. సమాచారాన్ని సేకరిస్తారు.


ముందుగా బాలికల ఆలోచనా దృక్పథాన్ని మార్చడానికి కొన్ని రోజులపాటు సమావేశాలు పెడతారు. ఆ తర్వాత తల్లిదండ్రులతో కూర్చుని ఒప్పిస్తారు. ఉత్తర భారతంలోని కొన్ని పల్లెల్లో ఇప్పటికీ ఆడపిల్లలకు చదువు చెప్పించకూడదు అనే దురాచారాలు ఉన్నాయి. బాల్యవివాహాలు కూడా నేటికీ జరుగుతున్నాయి. ఇలాంటి సామాజిక రుగ్మతలు ఉన్న చోట.. ఊర్లో వాళ్లందరితో పంచాయతీ కార్యాలయాలు, రచ్చబండలు, చావిళ్ల దగ్గర సమావేశాలు ఏర్పాటు చేస్తారు వాలంటీర్లు. ప్రగతిశీల భావాలున్న మేధావులు, సామాజికవేత్తలను తీసుకొచ్చి అవగాహన కల్పిస్తారు. అలా మెల్లగా ఊర్లోని ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేశాక.. పిల్లల్ని మళ్లీ బడిలో చేరుస్తారు. ఈ ప్రక్రియను అత్యంత లౌక్యంగా, సౌమ్యంగా పూర్తిచేయడానికి వాలంటీర్లు ఎంతో ఓపికతో కృషి చేస్తారు.


కొన్నిసార్లు పల్లెల్లో ప్రతిఘటనలు కూడా ఎదురవుతుంటాయి. వాటిని సామరస్యంగా పరిష్కరించడం సవాలు అవుతుంది. ‘‘బాల్య వివాహాలు ఇప్పటికీ నడుస్తున్న దురాచారం. ప్రాచీ అనే ముక్కుపచ్చలారని అమ్మాయికి పెళ్లి చేశారు. ఆమె యుక్త వయసులోనే పిల్లల్ని కనింది. ఇంటి గోడల మధ్య బిక్కుబిక్కుమంటూ బతుకుతోంది. అలాంటి ఆమెను తిరిగి బడిలో చేర్పించడంతో కొత్త జీవితం మొదలైంది.. ఇప్పుడామె ముఖంలో ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది’’ అన్నారు వాలంటీర్లు. ‘‘మతతత్వ సంప్రదాయాలు, విశ్వాసాలు, నమ్మకాలు.. నిరక్షరాస్యత, పేదరికం, ఆర్థిక అసమానతలు ఎక్కువగా ఉన్న మన దేశంలో లింగవివక్ష కూడా మహిళల స్వేచ్ఛకు అడ్డంకిగా మారింది.


చిన్నప్పటి నుంచే ఆడపిల్లలన్న సాకుతో ఇప్పటికీ మంచి చదువులు చదివించడం లేదు. ఆర్థికస్వేచ్ఛ వారికి లభించడం లేదు. కుటుంబ, ఆర్థిక, సామాజిక నిర్ణయాల్లో మహిళలకు పూర్తి స్వాతంత్య్రం లభించడం లేదు. నేటి ఆధునిక కాలంలో కూడా లింగవివక్ష పలు రూపాల్లో అడ్డుగోడలుగా నిలవడం దారుణం. ఈ చీకట్లను పారద్రోలేందుకు పూనుకుంది ఎడ్యుకేట్‌గర్ల్స్‌ సంస్థ. బాలికలకు బాల్యం నుంచే ఈ అసమానతల గురించి తెలియజేసి.. చైతన్యం కలిగిస్తే.. కొన్నాళ్లకు సమాజంలో తప్పక మార్పు వస్తుంది...’’ అంటున్న సంస్థ ప్రతినిధుల ఆలోచనా విధానం ఆదర్శవంతం. ఈ సంస్థ కనక లేకపోతే పాతిక లక్షల మంది బాలికలు గొర్రెలు, పశువుల కాపర్లుగా.. కూలీ పనులు చేసుకునే అభాగ్యులుగా.. బాల్యవివాహాల చట్రం కింది నలిగిపోయిన బాధితులుగా మిగిలిపోయేవారు.


ఇప్పుడీ పాతిక లక్షల మంది తిరిగి చదువుకోవడం వల్ల.. ఆ కుటుంబాల్లో కొత్త కాంతులు వెదజల్లుతున్నాయి. వీరి పిల్లలు కూడా మరింత ఆత్మవిశ్వాసంతో ఉన్నత చదువులు చదువుకొని అండగా నిలబడే వాతావరణం ఏర్పడింది. ఆర్థికస్వేచ్ఛతోపాటు సామాజిక గౌరవం లభించింది. అన్నిటికంటే విలువైన జీవించే హక్కును చదువుతో సాధించారు ఆడపిల్లలు. ఇలా వెలుగు దీపంలా నిలిచిన ఎడ్యుకేట్‌గర్ల్స్‌ సంస్థకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు తల్లిదండ్రులు. ఇంత గొప్ప మార్పునకు నాంది పలికింది కాబట్టే.. రామన్‌మెగసెసె అవార్డును అందుకున్న తొలి భారతీయ స్వచ్చందసంస్థగా చరిత్ర సృష్టించింది ఎడ్యుకేట్‌ గర్ల్స్‌. ఇలాంటి చదువుల విప్లవం దేశమంతా ఉప్పొంగితే.. ఎంత బాగుంటుంది!!

- సండే డెస్క్‌


‘‘మా సంస్థ ఎడ్యుకేట్‌ గర్ల్స్‌ ద్వారా తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభించిన నగీనా బానో నాతో ఒక రోజు ఇలా అంది.. ‘‘మేడం .. అసలు పెళ్లి అనేదే తెలియనప్పుడు పెళ్లి చేశారు. పిల్లలు పుట్టారు. నా జీవితం ఘోరంగా మారింది. కాస్త తెలివితేటలు వచ్చాక ప్రపంచం తెలిసింది. అప్పుడు నాకు ఏ ఆధారం లేదు. సరిగ్గా అలాంటి సమయంలో మీ సంస్థ తిరిగి బడిలో చేర్పించింది. చదువు ఒక్కటే మనది. దాన్ని ఎవరూ దొంగలించలేరు. కరువుకాటకాలు కబళించలేవు. వరదలు తీసుకెళ్లలేవు.


కాబట్టి అదొక్కటే మనతో ఉంటుంది.. మనల్ని బతికిస్తుంది...’’ అని చెప్పింది. ఇలాంటి ఎన్నో విజయగాథలు మా వద్ద ఉన్నాయి. ఇప్పటికే పాతిక లక్షల మంది బాలికల జీవితాల్లో ఇలాంటి మార్పు తీసుకొచ్చాం. భవిష్యత్తులో కోటి మంది అమ్మాయిలకు కొత్త జీవితాన్నిచ్చేందుకు కృషి చేస్తున్నాం. అబ్బాయిలు, అమ్మాయిలు అన్న వ్యత్యాసం చూపని దేశంగా మన భారత్‌ తయారవ్వాలన్నది నా తపన. ఇద్దరూ ఒక్కటే.. అన్నింటిలోనూ ఇద్దరూ సమానమే! కూతుళ్లకు తక్కువ చదువు, కొడుకులకు ఎక్కువ చదువు అంటూ ఏమీ ఉండదు. దయచేసి వివక్ష లేకుండా పెంచండి.. సమానంగా చదివించండి. ఆ సంతృప్తి మిమ్మల్ని జీవితాంతం నడిపిస్తుంది.

- సఫీనా హుస్సేన్‌, వ్యవస్థాపకులు, ఎడ్యుకేట్‌ గర్ల్స్‌

Updated Date - Sep 14 , 2025 | 10:21 AM