Beauty of Nature: ప్రకృతి చెక్కిన అద్భుతాలివి...
ABN , Publish Date - Oct 05 , 2025 | 12:14 PM
ప్రపంచవ్యాప్తంగా అద్భుత నిర్మాణాలకు, ప్రకృతి వింతలకు ‘యునెస్కో’ గుర్తింపు ఇస్తుందనే విషయం తెలిసిందే. ఈ అరుదైన గుర్తింపు కోసం అన్ని దేశాలు పోటీపడతాయి. మన దేశానికి సంబంధించి ఇప్పటికే ‘యునెస్కో వరల్డ్ హెరిటేజ్’ తాత్కాలిక జాబితాలో 62 ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా అద్భుత నిర్మాణాలకు, ప్రకృతి వింతలకు ‘యునెస్కో’ గుర్తింపు ఇస్తుందనే విషయం తెలిసిందే. ఈ అరుదైన గుర్తింపు కోసం అన్ని దేశాలు పోటీపడతాయి. మన దేశానికి సంబంధించి ఇప్పటికే ‘యునెస్కో వరల్డ్ హెరిటేజ్’ తాత్కాలిక జాబితాలో 62 ఉన్నాయి. తాజాగా మరో 7 సహజ వింతలు... ప్రకృతి చెక్కిన అద్భుతాలు కూడా తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకున్నాయి. వాటి విశేషాలే ఇవి...
చిక్కని లావా మెట్లు
ముంబయివాసులకు అతి దగ్గరలో ఉన్న హిల్ స్టేషన్స్... మహాబలేశ్వర్, పంచ్‌గనీ. వారాంతాల్లో సేదతీరడానికి చాలామంది ఆ ప్రదేశాలకు వెళ్లి వస్తుంటారు. ఆ పచ్చని నేలలు, జలపాతాలు, సరస్సులు, పక్షుల కిలకిలరావాలు సందర్శకులను వేరే లోకానికి తీసుకువెళతాయి. బ్రిటీష్ కాలంలో వేసవి విడిదిగా మహాబలేశ్వర్ ఉండేది. కృష్ణానది జన్మస్థలం కూడా ఇదే. అయితే భౌగోళికంగా ఇక్కడ పెద్ద రహస్యం దాగుంది. పశ్చిమ కనుమల్లో భాగమైన మహాబలేశ్వర్, పంచ్‌గనీ దగ్గర ఉన్న పర్వతాలని భౌగోళికంగా ‘దక్కన్ ట్రాప్స్’గా పిలుస్తారు. భూమ్మీది అతిపెద్ద అగ్నిపర్వత నిర్మాణాల్లో ఇది ఒకటి. రెండు వేల మీటర్ల మేర లావా ఈ పర్వతాల మీద చేరింది. అదంతా మెట్లు మెట్లుగా ఉంది కాబట్టి ‘ట్రాప్స్’ అనే పేరు వచ్చింది. 66 మిలియన్ సంవత్సరాల క్రితం ఆ అగ్నిపర్వతం విస్ఫోటం చెందిందట. ఈనాటికీ చెక్కుచెదరని ఈ బసాల్టు, లాటరైట్ నేలలు జియాలజిస్టులకే అంతు చిక్కడం లేదు. అందుకే మహాబలేశ్వర్, పంచ్‌గని దగ్గర ఉన్న ‘దక్కన్ ట్రాప్స్’ యునెస్కో తాత్కాలిక జాబితాలో చేరాయి.
సముద్రానికే అడ్డుగోడలా...

అందమైన బీచ్‌లో పేద్ద అడ్డుగోడగా కొండ ఉంటే అత్యద్భుతంగా కనిపిస్తుంది. కేరళలో ఇలా కొండతో ఉన్న ఏకైక బీచ్ వర్కల. తిరువనంతపురం జిల్లాలోని ‘వర్కల’ అతి పెద్ద టూరిస్టు ప్రాంతం. అక్కడి అరేబియా సముద్ర తీరం పర్యాటకులనే కాదు భౌగోళ శాస్త్రజ్ఞులను కూడా ఆకర్షిస్తుంది. సుమారు 8 కిలోమీటర్ల మేర దాదాపు 40 మీటర్ల ఎత్తులో ‘వర్కల క్లిఫ్’ విస్తరించి ఉంది. ‘మియో ప్లియోసీన్’ ఏజ్‌లో ఏర్పడిన వర్కల కొండ ఎన్నో గతి మార్పులకు లోనైంది. ఈ ఎరుపు, తెల్లని ఇసుకరాతి కొండలు భౌగోళిక చరిత్రకు సాక్ష్యాలు.
తొలి అడుగులు అతడివే...

భారతదేశానికి సముద్ర మార్గం వెదుకుతూ వాస్కోడగామా 1498లో తొలిగా కాలుమోపిన ప్రదేశం... అరేబియా సముద్రంలోని ‘సెయింట్ మేరీ ద్వీపాలు’. కోకొనట్, ఉత్తర, దర్యా బహదుర్గా, దక్షిణ అనే నాలుగు చిన్న ద్వీపాల సమూహం ఇది. తన మాతృభూమికి గుర్తుగా ఆయన ఓ ద్వీపానికి ‘సాంతా మారియా’ అనే పేరు పెట్టాడు. ఆ తరవాతే మలబార్ తీరంలోని కాలికట్‌కు వెళ్లాడు. ప్రస్తుతం ఉడిపి జిల్లాలోని మాల్పే సమీపంలో ఉన్న ‘సెయింట్ మేరీ ద్వీపాల’ను ‘థోన్సేపార్’గా కూడా పిలుస్తారు. వీటన్నింట్లోకీ పెద్దది కోకొనట్ ద్వీపం. ఈ ద్వీపానికి పక్కనే ఉన్న ఉత్తర ద్వీపానికి మధ్యలో కొన్ని రాళ్ల గుట్టలు ఉన్నాయి. 88 మిలియన్ ఏళ్ల క్రితం భారత ద్వీపకల్పం మడగాస్కర్‌ను ఢీ కొట్టినప్పుడు ఈ గుట్టలు ఏర్పడి ఉంటాయని శాస్త్రజ్ఞుల పరిశోధనలు తెలియజేస్తున్నాయి. కోకొనట్ ద్వీపంలో కొంత భాగాన్ని 1978లో నేషనల్ జియోలాజికల్ మాన్యుమెంట్‌గా ‘జీఎస్‌ఐ’ ప్రకటించింది. ఇక్కడ మరో ఆకర్షణ హెక్సాగోనల్ ఆకారంలోని బసాల్ట్ రాతి ఫలకాలు. మాల్పే నుంచి డే టూర్‌గా అక్కడికి బోట్లలో టూరిస్టులు వెళ్లి వస్తుంటారు.
విశిష్టమైన కొండలు...

‘కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ.. తెట్టలాయ మహిమలే తిరుమల కొండ...’ అంటూ అన్నమయ్య తిరుమల కొండని ఆనాడే గొప్పగా వర్ణించారు. వేదాలే శిలలుగా, పుణ్యాలు సెలయేర్లుగా, సర్వ దేవతలు మృగజాతులై చరించే తిరుమల కొండగా ఆ పదకవితా పితామహుడు కీర్తించారు. తాజాగా తిరుమల కొండ సామాన్యమైనది కాదని పేర్కొంటూ భారత ప్రభుత్వం ‘వరల్డ్ హెరిటేజ్’ తాత్కాలిక జాబితాకు పంపింది. తూర్పు కనుమల్లో భాగమైన శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి,వెంకటాద్రి.. ఈ ఏడు కొండలూ కలిసి తిరుమల కొండగా పేరు తెచ్చుకున్నాయి.
ఈ కొండలు సముద్ర మట్టానికి 980 మీటర్ల ఎత్తులో ఉంటాయి. ‘ఎపార్కియన్ అననుకూలత’ అనే భౌగోళిక వింతగా తిరుమల కొండను ‘జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా’ (జిఎస్‌ఐ) పేర్కొంది. వీటి దిగువన ఉన్న రాతి పొరలు, ఎగువన ఉన్న వాటి మధ్య అంతరం కనీసం 500 మిలియన్ సంవత్సరాలు. పురాతన శిలలు 2.5 బిలియన్ సంవత్సరాల నాడు ఏర్పడితే, నూతన శిలలు 1.6 బిలియన్ సంవత్సరాలప్పుడు ఏర్పడ్డాయి. అలాగే ఇక్కడి విశిష్టమైన శిలాతోరణం, విభిన్నమైన జంతుజాలం, వృక్షజాతులన్నీ తిరుమల కొండకు ప్రత్యేకతను తీసుకువచ్చాయి.
భూమి కదలికల్లో...
మయన్మార్, నాగాలాండ్‌ల మధ్య ఉత్తర సరిహద్దుగా ఉంటాయి నాగాహిల్స్. వీటి ఎత్తు 12 వేల అడుగులకు పైనే ఉంటుంది. ఆరకాన్ పర్వత పంక్తుల్లో నాగాహిల్స్ భాగం. ఎన్నో రకాల వృక్షాలకు, జంతుజాలానికి ఈ కొండలు ఆవాసం. అయితే ఈ పర్వతాల మధ్యలో ఓ విశిష్టమైన భౌగోళిక వింత ఉంది. అదే ‘నాగాహిల్ ఓఫియోలైట్’. కాంటినెంటల్ ప్లేట్స్ కదలిక వల్ల సముద్రాల దిగువన ఉన్న లీథోస్పియర్ పైకి వచ్చి ఈ పర్వత సానువుల్లా ఏర్పడింది. అందుకే నాగాహిల్ ఓఫియోలైట్‌ను జాతీయ భౌగోళిక మాన్యుమెంట్‌గా గుర్తించింది.
గుహల సముదాయం
మన దేశంలో మరెక్కడా లేనన్ని గుహలు మేఘాలయ సొంతం. ప్రపంచంలో అత్యంత సంక్లిష్టమైన గుహ వ్యవస్థలు అక్కడ ఉండడం విశేషం. ఈ గుహలు ‘హోలోసీన్’ టైం పీరియడ్‌కు చెందినవి. ముఖ్యంగా సున్నపురాతితో ఏర్పడిన ఈస్ట్ ఖాసీ హిల్స్‌లోని 4 గుహలు భౌగోళికంగా ఎంతో విశిష్టమైనవి. దీనికి కారణం ఈ గుహల్లో పైకప్పు నుంచి వేలాడే, నేల నుంచి పైకి పెరిగే రాతి నిర్మాణాలు. ఇవి శాస్త్రజ్ఞుల పరిశోధనలకు ఊపిరి పోస్తున్నాయి.
ఎదురేలేని ఎర్రమట్టి దిబ్బలు...
విశాఖకు వన్నె తెచ్చే అందాల్లో సముద్రంతో పోటీపడతాయి ఎర్రమట్టి దిబ్బలు. ఎన్నో సినిమాలకు సీనిక్‌బ్యూటీని తెచ్చాయివి. 1500 వేల ఎకరాల్లో విస్తరించిన ఈ దిబ్బలు సముద్రానికి సమాంతరంగా సాగుతూ అరుదైన భౌగోళిక వింతగా పేరు తెచ్చుకున్నాయి. విశాఖ- భీమిలీ బీచ్ రోడ్డులో వెళుతుంటే మోటారిస్టులను విశేషంగా అలరిస్తాయి. పది నుంచి 30 అడుగుల ఎత్తున్న ఈ ఇసుక దిబ్బలకు ఆ రంగు ఆక్సీకరణం వల్ల ఏర్పడింది. వేల ఏళ్లుగా సముద్ర హెచ్చుతగ్గులు, వాతావరణ మార్పులు, ఎరోజన్ లాంటి భౌగోళిక మార్పులను అధ్యయనం చేయడానికి ఇవి ఉపయోగపడుతున్నాయి. ‘జిఎస్‌ఐ’ 2016లో వీటికి ‘నేషనల్ జియో హెరిటేజ్’ ట్యాగ్‌ను అందించింది. ఎర్ర మట్టి దిబ్బల గురించి 1886లో జిఎస్‌ఐకే చెందిన అధికారి విలియమ్ కింగ్ తొలిగా సమాచారాన్ని సేకరించి, భద్రపరచారు.