Share News

సాధనతో రికార్డు శ్వాసించాడు..

ABN , Publish Date - Sep 28 , 2025 | 12:51 PM

నీటిలో మునిగి ఎవరైనా ఎంతసేపు ఉండగలరు. మహా అయితే నిమిషం లేదా రెండు నిమిషాలు. నీళ్లలో ఆక్సిజన్‌ లేకుండా ఎక్కువ సమయం ఉంటే కీలక అవయవాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అయితే కఠోర శిక్షణ, సాధనతో నీళ్లలో ఎక్కువ సమయం ఉండేవారు ఉన్నారు.

సాధనతో రికార్డు శ్వాసించాడు..

నీటిలో మునిగి ఎవరైనా ఎంతసేపు ఉండగలరు. మహా అయితే నిమిషం లేదా రెండు నిమిషాలు. నీళ్లలో ఆక్సిజన్‌ లేకుండా ఎక్కువ సమయం ఉంటే కీలక అవయవాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అయితే కఠోర శిక్షణ, సాధనతో నీళ్లలో ఎక్కువ సమయం ఉండేవారు ఉన్నారు.

ఇటీవల క్రొయేషియాకు చెందిన విటోమిర్‌ మారిసిక్‌ అనే ఫ్రీ డైవర్‌ ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా 29 నిమిషాల 3 సెకన్ల పాటు నీళ్లలో శ్వాసను ఆపి సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 2021లో క్రొయేషియాకే చెందిన ఫ్రీ డైవర్‌ బుడిమిర్‌ సోబాట్‌ పేరుతో ఉన్న 24 నిమిషాల 37 సెకన్ల ప్రపంచ రికార్డు మొత్తానికి ‘తడిచి’ పెట్టుకుపోయింది.


ఎలా సాధ్యం?

ఫ్రీ డైవర్స్‌ అందరూ ప్రొఫెషనల్‌ బ్రీత్‌ హోల్డర్స్‌గా గుర్తింపు పొంది ఉంటారు. నీళ్లలో ఎక్కువ సమయం ఉండేందుకు వీళ్లు శారీ రక, మానసిక శిక్షణ పొందుతారు. కార్డియో వాస్క్యులర్‌ శిక్షణ తీసుకుంటారు. మెడిటేషన్‌ చేస్తారు. డయాఫ్రంపై నియంత్రణ సాధిస్తారు. హార్ట్‌రేట్‌, బ్రీతింగ్‌, రక్తసరఫరాని పెంచేలా వ్యాయామాలు చేస్తారు. ఊపిరి తిత్తుల్లో ఎక్కువ గాలిని నిలువఉంచుకునేలా శ్వాస సంబంధిత వ్యాయామాలు చేస్తారు. స్విమ్మింగ్‌, జాగింగ్‌, సైక్లింగ్‌ వంటివన్నీ ఈ కోవలోకే వస్తాయి.


అంతేకాకుండా ఫ్రీ డైవర్స్‌ డయాఫ్రంను, గొంతు కండరాలను నియంత్రించుకుంటూ ఊపిరితిత్తుల్లో నిలువ ఉన్న ఆక్సిజన్‌ను వాయుమార్గంలోకి పంపిస్తారు. ఈ ఆక్సిజన్‌ రక్తం ద్వారా శరీరంలోని అవయవాలకు చేరుతుంది. ప్రపంచ రికార్డు నెలకొల్పే ఫీట్‌కు ముందు విటోమిర్‌ మారిసిక్‌ 100 శాతం స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను పది నిమిషాల పాటు తీసుకున్నాడు. దీనివల్ల సాధారణంగా పీల్చే ఆక్సిజన్‌కన్నా ఎక్కువ రెట్లు ఆక్సిజన్‌ను గ్రహించాడు. అందుకే ఆక్సిజన్‌ సహాయంతో ఊపిరి బిగపట్టే చర్యగా ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు’ అధికారులు వర్గీకరించారు. ఆ వర్గీకరణలోనే గిన్నిస్‌ బుక్‌ రికార్డులో ఫీట్‌ను నమోదు చేశారు.


book9.2.jpg

సాధనే ప్రధానం...

కణాలు పనిచేయడానికి, మనిషి బతకడానికి ఆక్సిజన్‌ చాలా అవసరం. కణాలు ఆక్సిజన్‌ను తీసుకుని కార్బన్‌డయాక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తుంటాయి. ఈ కార్బన్‌డయాక్సైడ్‌ శ్వాసను వదలడం ద్వారానే బయటకు వెళుతుంది. ఒకవేళ మనం శ్వాస తీసుకోవడాన్ని ఆపితే... కార్బన్‌డయాక్సైడ్‌ పేరుకుపోయిందని మెదడు గుర్తించి శ్వాస తీసుకునేలా సంకేతాలు పంపుతుంది. డయాఫ్రం అసంకల్పితంగా సంకోచించడం ప్రారంభిస్తుంది. ఫ్రీ డైవర్స్‌ మెదడును డీసెన్సిటైస్‌ చేసేలా, అసంకల్పిత చర్యను నిలుపుదల చేసేలా సాధన చేస్తుంటారు.


దీనివల్ల శ్వాస తీసుకోవాలనే అసంకల్పిత ప్రతిచర్య ఆలస్యమవుతుంది. ఇలా శ్వాసను నిలిపినప్పుడు ‘సైకలాజికల్‌ బ్రేక్‌ పాయింట్‌’కు చేరుకుంటారు. ఇది సవాలుతో కూడుకునే ఫీట్‌. డయాఫ్రంను నియంత్రించడం నేర్చుకున్నవాళ్లు మాత్రమే ఈ సమయంలో శ్వాసను నిలిపి ఉంచగలుగుతారు. మారిసిక్‌ ఈ వరల్డ్‌ రికార్డును సాధించడానికి తొమ్మిది నెలలు శ్రమించారు. ఇదిలా ఉంటే 1959లో అమెరికాకు చెందిన రాబర్ట్‌ ఫోసర్‌ అనే వ్యక్తి 13 నిమిషాల 42.5 సెకన్ల పాటు ఊపిరి బిగపట్టి మొదటిసారి ప్రపంచ రికార్డు నమోదు చేశారు.

Updated Date - Sep 28 , 2025 | 12:51 PM