Fashion: ఆ గ్రామీణ యువతి సరికొత్త ట్రెండ్.. పొలం దగ్గరే ఫ్యాషన్ పరేడ్!
ABN , Publish Date - Nov 30 , 2025 | 08:05 AM
ఓ గ్రామీణ యువతి సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. వేరుశనగ పొట్టు, ఎండు గడ్డి, మొక్క జొన్నలు, ఆకుకూరలు, కూరగాయలతో దుస్తులను రూపొందిస్తుంది. అల్లికలు, కుట్టడం, గమ్‌తో అంటించడం ద్వారా వీటిని తయారుచేస్తోంది. వేరుశనగ పొట్టుతో ఓ ఫ్రాక్‌ను తయారుచేసి, రెడ్ బీన్స్‌తో టై కట్టేసింది.
ఈ చైనా గ్రామీణ యువతిది వ్యవసాయ కుటుంబం. వేరుశనగ, మొక్కజొన్నలు తదితర పంటలను పండిస్తారు. ఆమె కుటుంబం అంతా వ్యవసాయ పనుల్లో ఉంటే... తను మాత్రం ఇలా పొలంలో పండిన వాటితో దుస్తులు తయారుచేసి, వాటిని ధరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సెన్సేషన్‌గా మారింది. ‘విలేజ్ మ్యాజికల్ ట్రెజర్’ పేరుతో బ్లాగ్‌ను నడుపుతోంది. లక్షన్నరకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. దక్షిణ చైనాలోని గ్వాంగ్జి ప్రావిన్సులోని హేంగ్జు ఆమె స్వస్థలం. ఫ్యాషన్ డిజైనింగ్‌లో తాను ఎలాంటి కోర్సులూ చేయలేదని ఈ అమ్మడు చెబుతోంది. కానీ, ఆమెకు చిన్నప్పటి నుంచి డ్రెస్ డిజైనింగ్ అంటే మక్కువ.

వేరుశనగ పొట్టు, ఎండు గడ్డి, మొక్క జొన్నలు, ఆకుకూరలు, కూరగాయలతో దుస్తులను రూపొందిస్తుంది. అల్లికలు, కుట్టడం, గమ్‌తో అంటించడం ద్వారా వీటిని తయారుచేస్తోంది. వేరుశనగ పొట్టుతో ఓ ఫ్రాక్‌ను తయారుచేసి, రెడ్ బీన్స్‌తో టై కట్టేసింది. టోపీ, బ్యాగు కూడా వేరుశనగే. దీనిని ‘కంట్రీసైడ్ ఫ్యాషన్’గా పేర్కొంటోంది. ఎండిన మొక్కజొన్నల ఆకులతో డ్రాగన్ రోబ్, కిరీటాన్ని ధరించి టీవీ డ్రామా ‘ద లెజండ్ ఆఫ్ మి యూ’ లోని డైలాగులు చెబుతూ రీల్స్ చేసింది.
‘స్వీట్ పొటాటో డ్రెస్’, ‘లాంగ్ బీన్ అవుట్‌ఫిట్’ ఇలా వింతైన పేర్లను పెడుతూ వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటిదాకా 178 వీడియోలు చేసింది. ‘వ్యవసా యోత్పత్తుల గురించి తెలియజేయడమే తన లక్ష్యమనీ, అందుకే ఇలాంటి దుస్తులు తయారుచేస్తున్నాన’ని చెబుతోన్న ఈమెను ‘కార్న్ ఎంప్రెస్’గా పిలుస్తున్నారు. అదే ఆమె అసలు పేరుగా చలామణి అవుతోంది.