Share News

వీరిది.. కొండంత సేవ

ABN , Publish Date - Sep 28 , 2025 | 11:15 AM

కనుచూపుమేర నరమానవుడు లేడు.. అడుగు తీసి అడుగు ముందుకు వేయలేని పరిస్థితి. మంచు కప్పేసింది. ఒళ్లు గగుర్పొడిచే భయానక పర్వత లోయలైన హిమాలయాలు.. పర్వతారోహకులు కష్టపడి ఇంకాస్త ముందుకెళితే.. అక్కడొక ఒంటరి దాబా కనిపిస్తుంది.

వీరిది.. కొండంత సేవ

కనుచూపుమేర నరమానవుడు లేడు.. అడుగు తీసి అడుగు ముందుకు వేయలేని పరిస్థితి. మంచు కప్పేసింది. ఒళ్లు గగుర్పొడిచే భయానక పర్వత లోయలైన హిమాలయాలు.. పర్వతారోహకులు కష్టపడి ఇంకాస్త ముందుకెళితే.. అక్కడొక ఒంటరి దాబా కనిపిస్తుంది.

అదే ‘చాచా.. చాచీ’ దాబా. అసలుపేరు చంద్రదాబా. 13,084 అడుగుల ఎత్తయిన హిమాలయాలపైన ఉందీ హోటల్‌. అందులో ఉన్నది ఇద్దరు వృద్ధులైన చోద్‌ దోర్జీ, హిషే చోమో.


book5.4.jpg

మన దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అంతెత్తులో ఆహార సేవల్ని అందిస్తున్న హోటల్‌ ఇదొక్కటే!. లద్దాఖ్‌ - టిబెట్‌ లోయ ప్రాంతంలోని బటాల్‌లో ఉంటుందీ ప్రాంతం. చలికాలం వస్తే మొత్తం మంచు కప్పేస్తుంది. అప్పుడు మనుషులెవ్వరూ ఉండరక్కడ. ఆ తర్వాతే కనిపిస్తారు. ఈ వృద్ధ దంపతు లిద్దరూ బౌద్ధతత్వాన్ని అనుసరించే బుద్ధిస్టులు. ‘‘మాకు హిమాలయ పర్వతమే దేవాలయం. ఇక్కడికొచ్చే పర్వతారోహకులు అందరూ మాకు భక్తులతో సమానం. మేము దయతో, ప్రేమతో ఆహారాన్ని వడ్డిస్తాం తప్పిస్తే డబ్బు కోసం కాదు. హిమాలయాలను అధిరోహించడానికి వచ్చిన వాళ్లందరూ మాకు అభిమానులుగా ఏర్పడ్డారు. ఇంత కంటే ఇంకేం కావాలి?’’ అంటారీ దంపతులు.


book5.5.jpg

వాళ్లు హిమాలయాలపై నడిపే ఆ చిన్న దాబాలో రెండు నెలల పాటు పదిమందికి వసతి కల్పించే సౌకర్యం ఉంది. 46 ఏళ్లుగా వేలమందికి వసతి, భోజనం ఏర్పాటు చేశారు చాచా.. చాచీ. ‘‘బటాల్‌లోని పర్వతాలను ఎక్కినప్పుడు ఇక్కడ కనీసం మంచినీళ్లు ఇచ్చేవాళ్లయినా ఉంటే ఎంత బావుణ్ణు అనిపిస్తుంది. అంత భయానక వాతావరణంలో చాచా.. చాచీ ఆత్మీయంగా పలకరిస్తారు. వాళ్లు చేసే రాజ్మాచావల్‌ను ఎప్పటికీ మరిచిపోలేను’’

అని గుర్తు చేసుకున్నాడు బైకర్‌ విక్రమ్‌సింగ్‌.

ఇలా హిమాలయాలకు వెళ్లిన పర్వతా రోహకులు, బైకర్లు, విదేశీయులకు ఆతిథ్యం అందిస్తున్న చంద్ర దాబా ఒక మధురమైన జ్ఞాపకం.

Updated Date - Sep 28 , 2025 | 11:15 AM