‘మీకు నలభై ఏళ్లని అస్సలు ఊహించలేదు సార్’...
ABN , Publish Date - Oct 26 , 2025 | 08:41 AM
‘మీకు నలభై ఏళ్లని అస్సలు ఊహించలేదు సార్’... ‘మీకు అంత పెద్ద పిల్లలు ఉన్నారంటే నమ్మలేకపోయాం?’... ‘మీరు నిజంగా సంతూర్ మమ్మీ’... ఇలాంటి కాంప్లిమెంట్స్ తరచూ అందుకుంటుంటారు కొందరు. సాధారణంగా అసలు వయసు కనబడనీయకుండా ప్రతి ఒక్కరూ ఎంతో కొంత ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇదే నేడు ‘బయో హ్యాకింగ్’ పేరుతో అనేక దేశాల్లో ట్రెండ్‌గా మారింది.
- వయసునూ ‘హ్యాక్’ చేద్దాం...
‘మీకు నలభై ఏళ్లని అస్సలు ఊహించలేదు సార్’... ‘మీకు అంత పెద్ద పిల్లలు ఉన్నారంటే నమ్మలేకపోయాం?’... ‘మీరు నిజంగా సంతూర్ మమ్మీ’... ఇలాంటి కాంప్లిమెంట్స్ తరచూ అందుకుంటుంటారు కొందరు. సాధారణంగా అసలు వయసు కనబడనీయకుండా ప్రతి ఒక్కరూ ఎంతో కొంత ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇదే నేడు ‘బయో హ్యాకింగ్’ పేరుతో అనేక దేశాల్లో ట్రెండ్‌గా మారింది.
మీ వయసు ఎంత? మీ వయసుకు తగినట్టు కనిపిస్తున్నారా? లేక పదేళ్లు పెద్దగానో లేదా చిన్నగానో కనిపిస్తున్నారా? కొత్తగా పరిచయం అయినవాళ్లు మీ వయసును ఇట్టే కనిపెట్టేస్తున్నారా? పాతిక నుంచి 70 ఏళ్ల మధ్య వయసు ఉన్నవాళ్లు ఓసారి అద్దంలో తీరిగ్గా చూసుకోండి. మీ చర్మం, కేశాలు, కళ్లు, దంతాలు, గోర్లు, చేతులు, కాళ్లు, పాదాలు... అన్నీ తేరిపారా చూసుకోండి. మీ వయసు వాళ్లతో సరిగానే ఉన్నారా? లేక వయసుకు మించి కనిపిస్తున్నారా?

కాలేజీ రోజుల్లో అందరూ హీరోలు, హీరోయిన్లే... ఆ తరవాత వయసు పెరిగే కొద్దీ, బాధ్యతలు పెరిగే కొద్దీ శరీరంలో మార్పులు రావడం సహజం. ఈ ప్రయాణంలో కొందరు అరవైలలో ఉన్నా నలభై ఏళ్ల వారి మాదిరిగా కనిపిస్తూ, హుషారుగా జీవిస్తుంటారు. మరికొందరు ముప్ఫై ఏళ్ల వయసుకే ముసలాళ్లలా కనిపిస్తారు. ఒకరకంగా దీనికి ప్రధాన కారణం జీన్స్. వంశపారంపర్యంగా సంక్రమించే గుణాలని నిన్నటి వరకూ ఉన్న అభిప్రాయం. కానీ ఇది పూర్తిగా నిజం కాదని, కొందరు తమ వయసు రివర్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే కంప్యూటర్లను హ్యాక్ చేసినట్టుగా వయసును హ్యాక్ చేసి వృద్ధాప్యాన్ని కట్టడి చేస్తున్నారు. దీనినే ‘బయో హ్యాకింగ్’ అంటున్నారు సౌందర్య నిపుణులు.

పలు శాస్త్రాల అధ్యయనం...
జీవశాస్త్రం, జన్యుశాస్త్రం, నాడీశాస్త్రాలకు సంబంధించిన అంశాలను బాగా అధ్యయనం చేసి... పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం పొందడమే ‘బయో హ్యాకింగ్’. యూత్‌లుక్‌తోపాటు, శరీర దృఢత్వం, ఆయుర్దాయాన్ని పెంచుకోవడానికి దీన్నో సాధనంగా ప్రయత్నిస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇంకా బరువు తగ్గడం, డిప్రెషన్, ఒత్తిడిని అధిగమించేందుకు కూడా బయోహ్యాకింగ్ ఉపయోగపడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

బయో హ్యాకింగ్ అనే పదం ఇటీవల పాపులర్ అవుతోంది. అయితే అనాదిగా వయసు దాచుకోవడానికి, మంచి ఆరోగ్యం కోసం ఎవరికి తోచిన విధంగా వాళ్లు అనేక పద్ధతులను అనుసరిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఈ విషయం గురించి విస్తృతంగా చర్చించేలా చేసిన వ్యక్తి దేవ్ ఆస్‌ప్రీ. ఈ అమెరికన్ ఆంత్రోప్రెన్యూర్ 2013లో ‘బుల్లెట్ ప్రూఫ్ డైట్’ ని సిద్ధాంతీకరించారు. చక్కటి ఆరోగ్యం కోసం సొంతంగా ప్రయోగాలు చేయవచ్చన్న విషయంపై బాగా ప్రచారం చేశారు. ఎన్నో పుస్తకాలు రాశారు. అందుకే ‘ఫాదర్ ఆఫ్ బయో హ్యాకింగ్’గా దేవ్ పేరుతెచ్చుకున్నారు.

అంతా మన చేతుల్లోనే...
‘బయో హ్యాకింగ్’లో ఎన్నో పద్ధతులు ఉన్నాయి. అయితే ఎక్కువ మంది ఫాలో అవుతోన్న పద్ధతులు ఏమిటో చూద్దాం...
- న్యూట్రిజెనోమిక్స్: జీన్స్, న్యూట్రిషన్‌ని కలుపుతూ కొత్తగా ఏర్పడిన విభాగం ఇది. ‘నిద్ర లేచాం, భోంచేశాం, నిద్రపోయాం’ అని కాకుండా, ఏ ఆహారం బాగా అరుగుతోంది, ఏది తింటే భారంగా ఉంటోంది? దేనితో ఉత్సాహం వస్తోంది? అనే స్పృహతో ఆహారాన్ని తీసుకుంటారు. అంటే పోషకాహారం, జన్యువులను ఎలా ప్రేరేపిస్తోందన్నదే ఇక్కడ కీలకం. ఆహారం వల్ల కలిగే మార్పుల్ని రోజూ డైరీలో రాసుకుంటూ ఓ నిశ్చిత అభిప్రాయానికి వస్తారు ఈ విధానంలో సాధకులు. దాన్నే ఫాలో అవుతారు. ఏళ్ల తరబడి ఇలా అధ్యయనం చేసి ప్రత్యేక డైట్ రూపొందించుకోవడమే ‘న్యూట్రిజెనోమిక్స్’. కొందరు కచ్చితమైన సమాచారం కోసం డీఎన్‌ఏ టెస్టూలూ చేయించుకుంటున్నారు.
- ఫిజికల్ బయో హ్యాకింగ్: వయసుతో పాటు కుంగిపోకుండా శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడానికి ఉపయోగపడే విధానం ఇది. చక్కటి ఆరోగ్యానికి చిక్కటి దారి ఎక్సర్‌సైజ్ అన్నది మనకు తెలుసు. ఇందులో రకరకాల ఎక్సర్‌సైజులతో పాటు, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, సౌనాలు, ఐస్‌బాత్‌లు, రెడ్ లైట్ థెరపీ లాంటి సాధనాలతో లక్ష్యాన్ని సాధిస్తారు. ఒక్కోసారి సాంకేతిక బయో హ్యాకింగ్ కూడా ఇందులోకే వస్తుంది. ఫిట్‌నెస్ ట్రాకర్స్, స్మార్ట్ వాచ్‌లు, హార్ట్‌బీట్, నిద్ర, బ్లడ్‌షుగర్ స్థాయిలను కొలిచే పోర్టబుల్ యంత్రాలు అందించే కచ్చితమైన డేటాతో జీవన ప్రమాణాలను మెరుగుపరచుకుంటారు.
- కాగ్నిటివ్ బయో హ్యాకింగ్: సంపూర్ణ ఆరోగ్యంలో మెదడును విస్మరించలేం. ధ్యానం, యోగ సాధన, పుస్తక పఠనం, చేసే పనిమీద దృష్టిని నిలపడం లాంటి పద్ధతులతో మెదడు పనితీరును మెరగుపరచుకోవచ్చు. జీవన విధానంలో మార్పులు, డైట్ సప్లిమెంట్లు, ఒత్తిడిని తగ్గించుకోవడం, తగినంత నిద్ర తదితరాలన్నీ ఈ విభాగంలోకి వస్తాయి. అలాగే మెదడును శక్తిమంతం చేసే ఆహారం కూడా ముఖ్యమే. వీటన్నిటి ద్వారా మెదడు వయసు కూడా పెరగకుండా చేసుకోవడమే ఈ సిద్ధాంతంలో ఉన్న ప్రధానాంశం.

ఇలా సైన్స్ ఆధారంగా జగదేకవీరుడిలా, అతిలోక సుందరిలా ఉండేందుకు ‘బయో హ్యాకర్లు’ ప్రయత్నిస్తున్నారు. ‘డూ ఇట్ యువర్ సెల్ఫ్’ అన్న పంథా వీరిది. మరోవైపు ‘జీన్ ఎడిటింగ్’, యువ రక్తాన్ని ఎక్కించుకోవడం, ఎక్కువగా సప్లిమెంట్లు తీసుకోవడం లాంటి విపరీత పద్ధతులను ఫాలో అవుతోన్నవాళ్లూ లేకపోలేదు. అయితే అటువంటి వాళ్లు ప్రమాదపు అంచుల్లో ఉన్నట్టే. ఏది చేసినా వైద్యుల పర్యవేక్షణలో చేయాలన్న ప్రాథమిక సూత్రాన్ని మరచిపోకూడదు. అయితే మంచి ఆహారం, తగిన ఎక్సర్‌సైజు, చిక్కని నిద్రకు మించిన ‘బయో హ్యాకింగ్’ పద్ధతి వేరే ఉందంటారా?
మెడిసిన్ 3.0
ప్రసిద్ధ కెనడా- అమెరికన్ వైద్యుడు. ‘అవుట్ లివ్’ గ్రంథకర్త. బయోహ్యాకింగ్ మెడిసిన్ 3.0 సిద్ధాంతకర్త. ఇందులో ఎక్సర్‌సైజ్, పోషకాహారం, నిద్ర, మానసిక ఆరోగ్యం, సప్లిమెంట్స్... అనే అయిదు అంశాలతో యూత్ లుక్‌తో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని రాశారు.
‘డోంట్ డై’ నినాదం...
‘బయో హ్యాకింగ్’ ఫాలోవర్స్‌లో ఎక్కువగా వినిపించే వ్యకి బ్రియన్ జాన్సన్. ‘డోంట్ డై’ అన్నది ఇతడి నినాదం. ఏటా రెండు మిలియన్ డాలర్లను తన శరీరంలో జరుగుతోన్న మార్పులు తెలిపే టెస్టుల కోసం ఈయన వెచ్చిస్తారు. 30 మంది డాక్టర్ల పర్యవేక్షణ బృందం జాన్సన్ సొంతం. కచ్చితమైన డైలీ రొటీన్లను ఫాలో అవుతారు. మొక్కల ఆధారిత ఆహారాన్నే తీసుకుంటారు. జీన్ థెరపీ, రక్తాన్ని ఎక్కించుకోవడం లాంటి విపరీత పద్ధతులతో వివాదాస్పదుడయ్యారు. ‘ఇన్‌స్టా’లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.
ఫౌండ్ మై ఫిట్‌నెస్
డాక్టర్ రోడా పాట్రిక్.. బయోమెడికల్ సైంటిస్ట్. ‘ఫౌండ్ మై ఫిట్‌నెస్’ స్థాపకురాలు. ఇందులో ఆయుర్దాయం పెంచుకోవడం, బయో హ్యాకింగ్‌కు సంబంధించిన సమాచారం అందిస్తారు. ఎక్సర్‌సైజ్ స్నాక్స్, నిద్ర, ప్రొటీన్లు ఎక్కువగా ఉన్న డైట్, సౌనా బాత్‌లు, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌లు, ఒమేగా 3 వాడకం లాంటివి ఆరోగ్యానికి, ఆయుర్దాయానికి మంచివని ప్రచారం చేస్తుంటారు.