ఆమె ఇంటి నిండా.. ‘మినియన్స్’ బొమ్మలే
ABN , Publish Date - Sep 28 , 2025 | 01:06 PM
అలా ఈ 15 ఏళ్లలో 1,035 విభిన్న మినియన్ బొమ్మల్ని సేకరించింది. లీజల్ ఇంట్లో, ఆఫీసులో, చివరికి కారులో కూడా ఈ బొమ్మల్ని, వీటి ఆకృతుల్లో కస్టమైజ్ చేయించుకున్న ఫొటో ఫ్రేముల్ని అమర్చుకుంది.
- ‘మినియన్స్’ లేడీ..
ఆస్ట్రేలియాకు చెందిన లీజల్ బెనెక్ ఇంటి నిండా ‘మినియన్స్’ బొమ్మలే దర్శనమిస్తాయి. ఒంటి కన్ను లేదా రెండు కళ్లకు పెద్ద పెద్ద కళ్లద్దాలు పెట్టుకుని... చిన్నగా, పసుపు రంగు క్యాప్సూల్ ఆకృతిలో ఉండే కార్టూన్ బొమ్మలైన మినియన్స్ బొమ్మలంటే ఆమెకు అంత పిచ్చి మరి. ఆ ఇష్టంతోనే గత 15 ఏళ్లుగా వాటిని సేకరిస్తూ రికార్డు సృష్టించింది.
2010లో లీజల్ తన కుటుంబంతో కలిసి ‘డెస్పికేబుల్ మి’ అనే సినిమాకు వెళ్లింది. అందులో ‘మినియన్స్’ పలికించే హావభావాలు చూసి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంది. ఇక ఆ రోజు నుంచి మినియన్స్ సేకరించే పనిలో పడింది. సింగపూర్, ఇటలీ, యూఎస్, పోర్చుగల్, చైనా... ఇలా ఏ దేశానికి వెళ్లినా అక్కడి నుంచి ఏదో ఒక బొమ్మ కొని తెచ్చుకునేది.

అలా ఈ 15 ఏళ్లలో 1,035 విభిన్న మినియన్ బొమ్మల్ని సేకరించింది. లీజల్ ఇంట్లో, ఆఫీసులో, చివరికి కారులో కూడా ఈ బొమ్మల్ని, వీటి ఆకృతుల్లో కస్టమైజ్ చేయించుకున్న ఫొటో ఫ్రేముల్ని అమర్చుకుంది. ఆమె దగ్గరున్న మినియన్ డాల్స్‌లో ‘స్టువర్ట్’ తన ఫేవరెట్ బొమ్మ అట. అందుకే ఆ బొమ్మని తన చేతిపై ట్యాటూ కూడా వేయించుకుంది. లీజల్‌ను చాలామంది ‘ది మినియన్ లేడీ’ అని ముద్దుగా పిలుస్తుంటారు. ఇలా అత్యధికంగా మినియన్స్ సేకరణ చేసినందుకు ఇటీవలే గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. ‘ఇష్టమైన బొమ్మల సేకరణ తనకీ ప్రత్యేక గౌరవాన్ని తెచ్చిపెట్టాయ’ంటూ సంబరపడిపోతోందీ మినియన్ లేడీ.